భారతీయ జనతా పార్టీ పాలనలో ఆగమాగమైన హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల కారణంగా మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. దీంతో ఆ రాష్ట్రం పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. సుఖ్విందర్ సింగ్ సుఖూ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కి రెండేండ్లు కూడా పూర్తికాకముందే ఆ రాష్ట్రం దివాలా దిశగా సాగుతున్నది. ఎలాగైనా హిమాచల్‌ప్రదేశ్ పీఠమెక్కాలనుకున్న కాంగ్రెస్ పార్టీ 2022లో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 10 గ్యారెంటీలను గుప్పించింది. ఆ గ్యారెంటీలకు ఆకర్షితులైన హిమాచల్ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఎన్నో ఆశలతో ఊరిస్తూ అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ వారి ఆశలను అడియాశలు చేసింది. అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఈ గ్యారెంటీల్లో ఇప్పుడు ఏ ఒక్కటీ అమలుచేయడం లేదు. వారంటీ లేని గ్యారెంటీలను నమ్మిన అక్కడి ప్రజలు నట్టేట మునిగారు.
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న హిమాచల్ భవన్‌ను అటాచ్ చేస్తూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు నవంబర్ 18న ఉత్తర్వులు జారీచేసింది. సెలీ జల విద్యుత్తు కేంద్రానికి సంబంధించిన రూ.150 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశా లు జారీచేసింది. ఆ మరుసటి రోజే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో నష్టాల్లో నడుస్తున్న 18 హోటళ్లను మూసివేయాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ హోటళ్లను హైకోర్టు ‘తెల్ల ఏనుగులు’గా అభివర్ణించడం గమనార్హం. అంతేకాదు, రిటైర్డ్ ఉద్యోగుల కు రావాల్సిన బకాయిలను సదరు కార్పొరేషన్ చెల్లించకపోవడం ప్రభుత్వ అసమర్థతేనని హైకో ర్టు దుయ్యబట్టింది. సుఖూ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ పాలనా వైఫల్యాలు పరాకాష్ఠకు చేరాయనడానికి ఈ ఘటనలే నిదర్శనం.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు హిమాచ ల్కు గుదిబండగా మారాయి. కాంగ్రెస్ పాలకుల అసమర్థత కారణంగా ఆ రాష్ట్ర ఆర్థిక వనరులు పెరగడం గ్యారెంటీల పేర అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అప్పులు చేసుకుంటూ పోతున్నది. అయినా గ్యారెంటీలను నెరవేర్చలేదు.
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) పునరుద్ధరణ, ఐదు లక్షల ఉద్యోగాల కల్పన, మహిళలకు నెల నెలా రూ.1,500 ఆర్థిక సాయం, 300 యూని ట్ల వరకు ఉచిత విద్యుత్తు, యువత కోసం రూ.680 కోట్ల స్టార్టప్ ఫండ్, ప్రతి నియోజకవర్గంలో నాలుగు ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, మొబైల్ క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా గ్రామాల్లో ఉచి త వైద్యం లాంటి గ్యారెంటీల వర్షం కురిపించిం ది. అయితే, వీటిలో ఏ హామీ అమలుకు నోచుకోలేదు. ఒకటీ, అరా అమలుచేసినా అవి కూడా కోతలు, కొర్రీలతోనే అసంపూర్తిగా మిగిపోయా యి. ఓపీఎస్ పునరుద్ధరణ హామీని ఎప్పుడో గాలికి వదిలేసింది. మహిళలకు ఇస్తామన్న రూ.1,500 భృతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ హామీని అమలుచేస్తే రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.800 కోట్ల భారం పడుతుంది. దీనినుంచి తప్పించుకునేందుకు సుఖూ సర్కార్ విఫలయత్నం చేస్తున్నది. ఈ పథకానికి మొత్తం 7.88 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 28,249 మంది మహిళలను మాత్ర మే అర్హులుగా గుర్తించింది.
అక్టోబర్‌కు సంబంధించి రూ.91.62 లక్షలు మాత్రమే అందజేయడం గమనార్హం. 300 యూనిట్ల వరకు ఉచి త విద్యుత్తు ఇస్తామన్న కాంగ్రెస్ పాలకులు అం దుకు ప్రజలపై భారం చార్జీలను పెంచడమే కాకుండా, జల విద్యుత్తు కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను వాడుతున్న వినియోగదారులపై సెస్ వేయాలని యోచిస్తున్నది. తద్వారా ప్రజల నుంచి ఏటా రూ.2-3 వేల కోట్ల వరకు వసూలు చేయాలన్నది ప్రభు త్వ పన్నాగం. అంతేకాదు, 125 యూనిట్ల లోపు విద్యుత్తు వాడే కుటుంబాలకు ఇస్తున్న రాయితీని నిలిపివేసి ఏటా రూ.200 కోట్ల నిధులను మిగిల్చుకోవాలనేది ఇంకో కుటిలయత్నం. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచకుండా పథకాలు నిలిపివేసి తద్వారా మిగిలే నిధులను ఆదాయం గా చెప్పుకుంటుండటం విడ్డూరం. ఉద్యోగాల విషయంలోనూ అట్లాగే వ్యవహరించింది.
ఆర్థిక వనరులను పెంచే విషయమై కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేకపోవడంతో పన్నుల పెంపు, కొత్త పన్నులు తీసుకురావడంపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నది. సీఎం సుఖూ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పరిశ్రమలు, గృహ విద్యుత్తు వినియోగదారులకు సబ్సిడీలను నిలిపివేయడం లాంటి చర్యలకు ఉపక్రమించేందుకు యత్నిస్తున్నారు. పర్యావరణం, పాల సెస్ విధించాలని చూస్తుండటం హేయనీయం.
అంతేకాదు, సుఖూ సర్కార్ దేశంలో ఎక్కడాలేని విధంగా టాయిలెట్ ట్యాక్స్‌ను తీసుకురావాలనీ ప్రయత్నిస్తున్నది. అయితే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సుఖూ తోక ముడవక తప్పలేదు.
హిమాచల్‌ప్రదేశ్ జనాభా 77.56 లక్షలు కాగా.. ఒక్కో నెత్తిపై రూ.1.17 లక్షల అప్పు ఉన్న ది. 2018లో ఆ రాష్ట్ర అప్పులు రూ.47,906 కోట్లు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య రూ.86,589 కోట్లకు చేరుకున్నది. రెండేండ్లలోనే సుఖూ సర్కా ర్ రూ.22 వేల కోట్లకు పైగా అప్పు చేసింది. అవి చాలవన్నట్టు రూ.2,810 కోట్ల అప్పు పెన్షనర్స్ వెల్ఫేర్ నుంచి తీసుకున్నది. అయితే, ఈ సొమ్మంతా ఎటుపోతున్నదనేది ప్రశ్నార్థకం. భారీగా తెస్తున్న ఈ అప్పులకు లెక్కాపత్రమూ లేదు.
హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూ.100లో రూ.25 జీతభత్యాలకు, రూ.17 పెన్షన్లకు, రూ.11 వడ్డీలకు, రూ.9 తిరిగి చెల్లించే అప్పులకు, రూ.10 గ్రాంట్ల రూపంలో పోతున్నా యి. ఈ లెక్కన మూలధన వ్యయం, ఇతర ఖర్చులకు రూ.28 మాత్రమే రాష్ట్ర ఖజానాలో మిగులుతున్నాయి. ఈ లెక్కలన్నీ స్వయంగా సీఎం సుఖూ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. కేంద్రం ఇప్పటికే జీఎస్టీ పరిహారాన్ని నిలిపివేయడంతో ఖజానాకు రూ.2,500-3,000 కోట్ల మేర గండిపడింది. ఈ నేపథ్యంలో 2025-2026 ఆర్థిక సంవత్సరంలో హిమాచల్ ప్రభుత్వానికి అసలైన సవాలు ఎదురుకానున్నట్టు ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సుఖూ నిర్వాకం వల్ల హిమాచల్‌లో ఆర్థిక అత్యయిక స్థితి విధించే దుస్థితి దాపురించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల కారణంగానే ఇప్పుడు హిమాచల్ రోడ్డున పడ్డది. ఒక్క హిమాచల్ మాత్రమే కాదు, కాంగ్రెస్ పాలి త రాష్ర్టాలైన కర్ణాటక, తెలంగాణలు కూడా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి. సుఖూకు, రేవంత్‌కు పెద్దగా వ్యత్యాసం లేదని చెప్పడంలో ఏ మాత్ర సంశయం అక్కరలేదు. కాంగ్రెస్ పాలనలో అధ్వాన్నస్థితికి చేరిన హిమాచల్‌ప్రదేశ్‌ను చూస్తుంటే.. మన తెలంగాణ కూడా అధఃపాతాళంలోకి వెళ్తున్న దృశ్యం కండ్లముందు సాక్షాత్కరిస్తున్నది.
-మాలోతు సురేష్
98856 79876