ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా పాలన సాగాలి. అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలకులు పని చేయాలి. కానీ, రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏడాది తిరక్కముందే తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగిన తెలంగాణ తిరోగమనంలో పయనిస్తున్నది.రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ పేరిట జరుగుతున్న విధ్వంసమే అందుకు నిదర్శనం.
అసలు ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి స్పష్టమైన డీపీఆర్ లేదు. ఒక్కో మంత్రి ఒక్కో విధంగా అంచనాలు లెక్క గడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు రూ.50 వేల కోట్లని చెబితే.. ముఖ్యమంత్రి ఏకంగా రూ.1.50 లక్షల కోట్ల అంచనా వ్యయం అవుతుందని చెప్తుండటం కాంగ్రెస్ పాలకుల తీరుకు నిదర్శనం.
స్వరాష్ట్రం ఏర్పడే నాటికి మన తెలంగాణ అనేక సమస్యలకు నిలయం. తెలంగాణలోని పది జిల్లాల్లో హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచడమే అందుకు ఉదాహరణ. అలాంటి రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతికాలంలోనే దేశంలోనే నెంబర్ 1గా ఎదిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో అవార్డులు గెలుచుకొని ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ సర్కార్ దార్శనికత, విధానాలు, దూరదృష్టి, విజనరీ నాయకత్వం, అధ్బుతమైన పాలనా పటిమ అందుకు ప్రధాన కారణం. పదేండ్లలోనే తెలంగాణ, హైదరాబాద్ అంటే ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తే ‘అసలు మనం హైదారాబాద్‌లోనే ఉన్నామా?’ అన్న సందేహం కలిగేలా అభివృద్ధి జరిగింది.
పునర్నిర్మాణం దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మార్పు అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా, మూసీ సుందరీకరణ వంటి అగమ్యగోచరమైన విధానాలతో హైదరాబాద్ బ్రాండ్‌ను దెబ్బతీస్తున్నది. పెట్టుబడులకు స్వర్గధామమైన తెలంగాణ ఇప్పుడు విధ్వంసం దిశగా సాగుతున్నది. కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది.
ఈ కూల్చివేతల విషయంలో ప్రభుత్వం, స్వయంగా ముఖ్యమంత్రే సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను, హైడ్రా బాధితులను ఆక్రమణదారులుగా, సంఘ విద్రోహ శక్తులుగా, కబ్జాదారులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది అత్యంత పైశాచికం. ఇల్లు వాకిలితో పాటు జీవనోపాధిని కోల్పోయిన వారంతా చేయని తప్పుకు నిందలు మోస్తూ, సామాజిక వెలివేతకు గురవుతూ మానసిక వేదనను అనుభవిస్తున్నారు.
చాలామందిలో ఒక అపోహ ఉంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటే ఆక్రమిత భూములని అనుకుంటున్నారు. కానీ, అవన్నీ పట్టా భూములే. ప్రభుత్వమే వారికి పట్టాలు ఇచ్చింది. ప్రతి ఇంటి స్థలం సుమారు 20, 30 సార్లు రిజిస్ట్రేషన్ అయింది. ప్రభుత్వం అందుకు పన్నులు కూడా స్వీకరించింది. అందులో గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో పాటు విద్యుత్తు, నీళ్ల కనెక్షన్, రోడ్లు, నాలాలు నిర్మాణాలు చేసి అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఉన్నపళంగా అవన్నీ అక్రమమని అంటే ఎలా? వారంతా ఎక్కడికి వెళ్లాలి? పన్నులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములు అక్రమమెలా అవుతాయి?
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా సంక్షేమార్థమే పని చేయాలి. ఏ ప్రభుత్వానికైనా ప్రజలు సుఖసంతోషాలతో జీవించడమే తొలి ప్రాధాన్యం కావాలి. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ చేసే విధ్వంసం అభివృద్ధి ఎలా అవుతుంది? ఒక ప్రభుత్వం అనుమతి ఇస్తే మరో ప్రభుత్వం ఎలా కూలగొడుతుంది? ఒక ఐఏఎస్ అధికారి అనుమతులు ఇస్తే మరో ఐపీఎస్ అధికారి కూలగొట్టడమేంటి? ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో సమాజం పురోగతి సాధిస్తుందా? విధ్వంసం జరిగేచోట వికాసం సాధ్యమవుతుందా? ఈ నేపథ్యంలో నిర్మాణం చేయడం అభివృద్ధా? లేదా కూల్చడం అభివృద్ధా? అన్నది మేధావులు, ప్రజలు ఆలోచించాలి. కూల్చివేతలు పెట్టుబడులను ఆకర్షిస్తాయా? నిలబెడితే పెట్టుబడులు వస్తాయా? అన్నది ప్రభుత్వం, పాలకులు గుర్తించాలి.
చెరువులను, కుంటలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమైతే ముందుగా ఒక కమిటీ వేయాలి. ఏ నిర్మాణాలు అక్రమమో, ఏవి సక్రమ నిర్మాణాలో గుర్తించాలి. ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలి. పట్టా ఇళ్లకు మార్కెట్ ధర నిర్ణయించి నష్ట పరిహారం చెల్లించాలి. ఇలా ఒక విధానం ప్రకారం ముందుకు సాగాలి. అది అసలైన ప్రజా పాలన. హైడ్రా పేరిట చెరువులు, కుంటలు రక్షిస్తామని చెప్పి ఆ చెరువులను పేదల కన్నీళ్లతో నింపడం ప్రజాపాలన అవుతుందా?
హైడ్రాకు అందరూ సమానమే అంటున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క నాగార్జున ఎన్ కన్వెన్షన్ మినహా ఒక్క బడా నాయకుడి ఫామ్‌హౌస్ మీదికి కూడా బుల్డోజర్ పంపలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావుల ఫామ్‌హౌస్‌లు పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నప్పటికీ వాటిని కూల్చలేదు. అందుకు విరుద్ధంగా పైసా పైసా పోగుచేసి కట్టుకున్న నిరుపేదల ఇళ్లను మాత్రం నేలమట్టం చేస్తున్నారు.
నదులే నాగరికత నిర్మాతలు. నదుల వెంబడే నాగరికత పరిఢవిల్లుతుంది. అందుకే మూసీ పక్కనే నగరం
నిర్మాణమైంది. అలా కాలక్రమంలో వేల కుటుంబాలు మూసీ తీరం వెంబడి ఇళ్లు నిర్మించుకున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వల్ల ఇప్పుడు వారంతా రోడ్డున పడుతున్నారు. ప్రాజెక్ట్ అంటే తాగునీరో, సాగునీరో అందించేది కాదు. నది
సుందరీకరణ మాత్రమే.
కాళేశ్వరం, నాగార్జున సాగర్, శ్రీశైలం, దేవాదుల, సీతారామ లాంటి ప్రాజెక్టుల కోసం భూములు త్యాగం చేస్తే జరిగే నష్టమేమీ లేదు. జాతి ప్రయోజనాల కోసం జరిగే బృహత్తర కార్యంలో భాగస్వాములు అవుతున్నదందుకు నిర్వాసితులు సంతోషిస్తారు. కానీ, మూసీ సుందరీకరణ అలాంటి కాదు. బడా బాబుల కోసం జరిగే సుందరీకరణ కోసం పేదల బతుకులను ఛిద్రం చేయడమేమిటి?
అసలు ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి స్పష్టమైన డీపీఆర్ లేదు. ఒక్కో మంత్రి ఒక్కో విధంగా అంచనాలు లెక్క గడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు రూ.50 వేల కోట్లని చెబితే.. ముఖ్యమంత్రి ఏకంగా రూ.1.50 లక్షల కోట్ల అంచనా వ్యయం అవుతుందని చెబుతుండటం కాంగ్రెస్ పాలకుల తీరుకు నిదర్శనం.
నమామి గంగా ప్రాజెక్ట్‌కు కిలోమీటర్‌కు రూ.17 కోట్లు ఖర్చు అవుతుండగా.. మూసీ సుందరీకరణకు మాత్రం కిలోమీటర్‌కు రూ.2,727 కోట్లు ఖర్చు అవుతున్నట్టు ప్రాథమిక అంచనా. అంటే నమామి గంగాతో పోలిస్తే ఇది 160 రెట్లు ఎక్కువ. ప్రాజెక్టు మొదలయ్యాక ఇది మరింతగా పెరగొచ్చు.
మూసీ తీరంలో నివసించే వేల ఇండ్లను కూల్చడం ద్వారా నగరంలో భయోత్పాతాన్ని సృష్టించడమే పాలకుల కుట్ర. తద్వారా రియల్ ఎస్టేట్ రంగం కుదేలై పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలను అమరావతి వైపు తరలించాలన్నది వారి లక్ష్యం. ఈ కుట్ర ఇలా ఉంటే, సినీ పరిశ్రమను సైతం తరలించడానికి భారీ కుట్ర జరుగుతున్నది. ప్రముఖ హీరో నాగార్జునపై మంత్రి కొండా సురేఖ చేసిన దిగజారుడు వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఏపీకి పరిశ్రమ తరలిరావాలని, అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తామని అక్కడి పాలకులు పిలుపునిస్తుండటంతో సినీ పరిశ్రమ సైతం ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక, సామాజిక దోపిడీని తెలంగాణ ప్రజలు, మేధావులు, విద్యావంతులు గ్రహించాలి. తెలంగాణపై కాంగ్రెస్ పాలకులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
–ఏనుగుల రాకేశ్ రెడ్డి