కోరిన భక్తుల కొంగు బంగారం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మ క్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి దేవాలయం. వేములవాడ రాజన్నను కేవలం తెలంగాణ, ఆంధ్రా ప్రాంత ప్రజలే కాకుండా, దక్షిణ భారతదేశ ప్రజలంతా ఎంతో భక్తితో కొలుస్తారు. నిత్యం వేలాది మంది ప్రజలు దర్శనం చేసుకొని మొక్కులు చెల్లిస్తారు. కొత్తగా పెళ్లి అయినా, ఇల్లు కట్టుకున్నా, పంట చేతికి వచ్చినా, తీర్థ యాత్రలు చేయాలన్నా, మొదట రాజన్ననే దర్శించుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేరితే కోడెను కడతామని కోడె మొక్కులు మొక్కుతారు. ఈ కోడెను కట్టడానికి ఎంతో విశిష్టత ఉంది. శివుడి వాహనం నంది, అంటే ఎద్దు. వాటినే కోడెలుగా రాజన్నకు మొక్కులు చెల్లిస్తారు.
భక్తుల కోర్కెలు రోజంతా విని, అందరికీ దర్శన భాగ్యం ఇచ్చిన తర్వాత తిరిగి ఆ పరమ శివున్ని కైలాసానికి మోసుకెళ్లేది ఆ నందే. కాబట్టి, పరమ శివుడికి ఎంతో ప్రియమైంది, ఆత్మీయమైంది ఆ నంది. అలాంటి, నంది వాహనాన్ని పరమశివుడి ముందు సమర్పించే గొప్ప సంస్కృతి మన వేములవాడలో ఉంది. మన ఇంట్లో, మన దొడ్లో మన ఆవుకు జన్మించిన లేగ దూడను దేవుడికి కానుకగా ఇచ్చే ఈ పద్ధతి చాలా విశిష్టమైంది. మన దొడ్లో, మన ఆవులకు పుట్టిన దూడలకు మనం ఎంత ప్రాధాన్యం ఇస్తామో మనందరికీ తెలుసు. పదేండ్ల క్రితం వరకు ఫ్యామిలీ ఫొటో తీసుకుంటే అందులో ఎడ్లు, ఆవులు కూడా ఉండేవి. రైతులు తమ జోడెడ్లతో ఫొటో తీసుకొని ఫ్రేం కట్టించి ఇంట్లో పెట్టుకుంటారు. గోవులతో, ఎడ్లతో మనకు అంతటి ఆత్మీయ బంధం ఉంటుంది.
‘రాజన్న ఓ రాజన్న’ అంటూ, ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’ అంటూ ఉద్యమంలో సైతం రాజన్నను స్మరించుకున్నాం. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ తదితర ప్రాంతాల్లో రాజన్న, రాజమ్మ, రాజేష్, రాజేశ్వర్, రాజు అంటూ ఆ రాజరాజేశ్వరుడి పేరు లేని కుటుంబాలు లేవంటే అతిశయోక్తి కాదు. అంతటి విశిష్టత గల ఆ రాజన్న కోడెలను ఆ పరమ శివుడికే ప్రత్యక్షంగా సమర్పిస్తున్నామని భావిస్తాం. అందుకే, తమ దొడ్లో పుట్టిన లేగ దూడలను దేవుడి సన్నిధిలో భక్తులు సమర్పిస్తారు. అటువంటి కోడెలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన అనుచరులు సొమ్ము చేసుకోవడం కోసం కబేళాలకు అమ్ముకోవడం దుర్మార్గం, ఘోరమైన అపచారం. ఇది నందీశ్వరుడికి జరిగిన అవమానం. వారు అమ్మింది దేవుడి కోడెలనే కాదు, కోట్ల మంది హిందువుల నమ్మకాన్ని, భగవంతునిపై భక్తులకు ఉన్న భక్తిని. బలికి పంపింది లేగలనే కాదు, లక్షల మంది తెలంగాణ ప్రజల ఆచారాన్ని, ఆనవాయితీని. కాంగ్రెస్ ప్రభుత్వం, కొండా సురేఖ చేసిన ఈ పాపం కాశీకి పోయినా పోదు.
రాజు తప్పు చేసినా, మంత్రి తప్పు చేసినా ఆ పాపం తాలూకు ప్రభావం రాజ్యం మీద, ప్రజల మీద ఉంటుంది. దేవుడి మీద ఒట్టు వేసి మాట తప్పినందుకే మేడారంలో వేలాది చెట్లు నేలకొరిగాయి. ఇటీవల భూకంపం వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆ పరమేశ్వరుడి కోడెలను కోతకు పంపి, హింసించి హత్య చేశారు. రేపు జరిగే నష్టానికి బాధ్యులెవరు? అందుకే, ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా తెలంగాణ కోసం వేములవాడలో ముడుపు కట్టిన పార్టీగా వేములవాడ విశిష్టతను కాపాడటానికి కేటీఆర్ సూచనల మేరకు వరంగల్ నుంచి కోడెలను తీసుకెళ్లాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోడెలను వేములవాడ వీధుల్లో ఊరేగించి, రాజన్నకు అప్పజెప్పి, శాంతి హోమం నిర్వహించి, గోశాలను శుద్ధి చేసి, అక్కడ జరిగిన తప్పును ఎత్తిచూపితే కానీ, దేవుడి కోడెల విషయంపై స్పందించాలని ప్రభుత్వానికి సోయి రాలేదు. అయినా కలెక్టర్‌తో విచారణ చేయిస్తామంటే సరిపోతదా? తనకు తెల్వకుండా పంపిణీ చేశారని కలెక్టర్ చెప్పారంటే.. మంత్రి చెప్తేనే పంపిణీ చేసినట్టు అర్థం కావటం లేదా?
రాజన్న కోడెల తరలింపు అంశంలో తప్పు జరిగింది కాబట్టే, నిందితులైన కొండా సురేఖ అనుచరుల మీద గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కానీ, అసలు కారకురాలైన మంత్రి కొండా సురేఖ పేరు అందులో చేర్చకపోవడం దారుణం. ఆమె మంత్రి హోదాలో ఏకంగా పోలీస్ స్టేషన్లో సీఐ కుర్చీలో సైతం కూర్చొని లా అండ్ ఆర్డర్‌ను చేతుల్లోకి తీసుకోగల సమర్థవంతమైన మహిళా నేత కాబట్టే చేర్చలేదా? దేవాదాయ శాఖను నిర్వహిస్తూ దేవుడి ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన మంత్రే దొంగలకు సద్దులు మోస్తూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు. దేవుడి సొమ్ముకే రక్షణ లేకపోతే ఇక ప్రజల సొమ్ముకు రక్షణ ఎక్కడుంటుంది? తనకు తెలియకుండానే కోడెల తరలింపు జరిగిందని స్వయంగా కలెక్టర్ చెప్తున్నారు. అంతా అయిపోయాక ఇప్పుడు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కలెక్టర్.. మంత్రి ఆదేశాలు పాటించే అధికారే కాబట్టి ఆయనను అదిమిపెట్టడం, విచారణను ప్రభావితం చేయడం పెద్ద విషయం కాదు. అందుకే, విచారణ పారదర్శకంగా జరగాలంటే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేయాలి.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ దేవాలయం మీద, కోట్లాది హిందువుల మనోభావాల మీద, రాజన్న భక్తుల విశ్వాసాల మీద ఇంత దాడి జరుగుతుంటే దేశంలోని, రాష్ట్రంలోని ప్రముఖ మీడియాలకు కనిపించకపోవడం, వినిపించకపోవడం విడ్డూరం. కుమారి ఆంటీ, మోహన్‌బాబు ఇంట్లో గొడవ, అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ప్రతీ అరగంటకు లైవ్ పెడుతూ గగ్గోలు పెట్టిన వాళ్లు ఈ అంశంపై స్పందించకపోవడం బాధాకరం.