నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత వరుసగా లోక్‌సభ, వివిధ రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధిస్తూ వస్తున్నది. డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నది. బీజేపీ విజయాల వెనుక దర్యాప్తు సంస్థలు, ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తున్నాయనే విమర్శలు నెలకొన్నాయి. ముందుగా ప్రతిపక్ష పార్టీల నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐని ప్రయోగించడం.. వారిని బీజేపీలో చేర్చుకోవడం అధికారం చేపట్టడం వంటి ఉదంతాలను చూశాం. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుంటూ అనుకూల ఫలితాలను సాధించడం చూస్తున్నాం.
ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ఓటర్లను తొలగించి, బెంగాల్లో అధికారం చేపట్టి, పోల్ మేనేజ్మెంట్ తమకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అనే విధంగా చెప్పుకొంటున్నది. కమలం పార్టీ పరిస్థితి ఇలా ఉంటే కమ్యూనిస్టు పార్టీలది మరో విధమైన పరిస్థితి. సుదీర్ఘమైన పోరాట, రాజకీయ చరిత్ర కలిగిన వామపక్ష పార్టీలు కనుమరుగవుతున్నాయి.
దాదాపు ఒక శతాబ్దం క్రితం 1925లో దేశంలో ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దేశంలో రోజురోజుకు విస్తరించడంతో తమ అనుబంధ సంస్థ అయిన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ తన ప్రాభావాన్ని, ప్రాబల్యాన్ని కోల్పోతున్నది. ఇక లోతుగా విశ్లేషిస్తే 1917లో రష్యా విప్లవం, 1949 చైనా విప్లవం అప్పటి వలస విముక్తి దేశాలకు, నవ స్వాతంత్య్ర దేశాలపై పెను ప్రభావం చూపాయి.
మన దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఒక రాజకీయ పార్టీగా కాకుండా, ఒక సామాజిక చలనంగా, వర్గ పోరాటంగా, జీవన విధానంగా పుట్టింది. స్వాతంత్య్ర పోరాటంలో, తదుపరి తెలంగాణ సాయుధ పోరాటంలో, భూసంస్కరణలు అమలు చేయడానికి, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షణకు కార్మిక, కర్షక హక్కుల కోసం పోరాడే పార్టీగా కమ్యూనిస్ట్ ఉద్యమం దేశంలో దాదాపు అరవై శాతం జనాభాపై మంచి ప్రభావాన్ని చూపింది. అందువల్లనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక కమ్యూనిస్టులు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై, ప్రతిపక్ష పార్టీగా సముచిత పాత్ర పోషించారు. పుచ్చలపల్లి సుందరయ్య ఒక ఉదాహరణ. దేశ మొదటి సార్వత్రిక ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీతో నల్లగొండ నుంచి కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణరెడ్డి గెలుపొందారు. అంటే అప్పట్లో కమ్యూనిస్టులంటే ప్రజల్లో ఎంత గౌరవం, అభిమానం ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 1957లోనే ప్రపంచంలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో కేరళంలో ఈఎంఎస్ నముద్రిపాద్ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) అధికారంలోకి వచ్చింది. అయితే తదుపరి కేంద్ర ప్రభుత్వం కుయుక్తులతో ఆ ప్రభుత్వాన్ని కూలదోసింది. ఆ తర్వాత సైద్ధాంతిక విభేదాలతో సీపీఐ రెండుగా చీలిపోయింది. కొత్తగా భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్)-సీపీఎం ఏర్పాటైంది. ప్రస్తుతం సీపీఐ, సీపీఎం రెండు పార్టీలు కొనసాగుతున్నాయి.
సీపీఎం తన విశిష్టమైన నాయకత్వం, ఉద్యమాలు, పోరాటాలు, గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఉన్న క్యాడెర్, విద్యార్థి, కార్మిక, కర్షక సంఘాల పోరాటాలు, సహకారంతో దాదాపు 50 ఏండ్లపాటు మూడు రాష్ర్టాల్లో ప్రభుత్వాలు నడిపించింది. బెంగాల్లో 1977 నుంచి 2011 వరకు, త్రిపురలో 1993 నుంచి 2018 వరకు, దఫదఫాలుగా కేరళంలో 2026 మే వరకు అధికారంలో ఉన్నది. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేవు. ఈ రాజకీయ పరిణామాలు పేద, మధ్య తరగతి ప్రజలు, కార్మిక, కర్షక వర్గాలకు అభ్యుదయ, ప్రజాస్వామ్యవాదులకు తీవ్ర నిరాశ కలిగిస్తున్నది. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాయి. ఒక దశలో జ్యోతిబసు ప్రధాన మంత్రిగా ఉండాలనే స్థాయిలో గుర్తింపు పొందిన వామపక్షాలు (సీపీఎం) నేడు తమ ప్రాబల్యాన్ని కోల్పోయాయి.
రాజకీయ పరిణామాలను కమ్యూనిస్ట్ పార్టీలు ఇకనైనా విశ్లేషణ, సమీక్ష చేసుకోవాలి. కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం కొన్ని చారిత్రక తప్పిదాలు, కాలం చెల్లిన వ్యూహాలు, ఎత్తుగడలు, సిద్ధాంతం- ఆచరణ మధ్య వ్యత్యాసం, సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రజల్లో వినిమయ సంస్కృతి పెరగడం, మధ్యతరగతి ఆకాంక్షలు, యువత అభీష్టాలు అంచనా వేయడంలో లోపం, ప్రపంచీకరణ ప్రభావం, నాయకత్వ లేమి, తగ్గిన ఉద్యమాలు, సోషల్ సైన్సెస్ ప్రాధాన్యత తగ్గడం, డబ్బులు సంపాదించడం, ఖర్చు పెట్టడం తప్ప ప్రజల్లో ఉద్యమాల పట్ల ఆసక్తి లేకపోవడం ముఖ్యంగా తన సైద్ధాంతిక శత్రువును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలు, ప్రణాళికలను రచించకపోవటం తదితర కారణాల వల్ల వామపక్షాలు ఢీలా పడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఓటమితో ఫలానా పార్టీ పని పూర్తిగా అయిపోయింది అని చెప్పడం కుదరదు. ఓటమి తాత్కాలికం-ఆశయం శాశ్వతం అనే భావనతో ముందుకు సాగాలి. దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్తులో ఎర్రజెండాలు రెపరెపలాడాలి.
20వ శతాబ్దం కమ్యూనిస్ట్ ప్రపంచమే అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక మనదేశంలో కొన్ని రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న 1977 నుంచి నేటి వరకు సుమారు యాభై ఏండ్ల వామపక్షాల ప్రయాణం చరిత్రాత్మకమైనది. ప్రపంచ స్థాయిలోనే కేరళం విద్య, వైద్యం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం వంటి వాటిలో గణనీయమైన స్థానం సంపాదించుకుని, దేశానికే ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా కొవిడ్ కాలంలో, వరద విపత్తుల సమయంలో తాజా మాజీ సీఎం పినరయి విజయన్ పోషించిన పాత్ర శ్లాఘనీయం.
ఇన్ని ఘనతలు సాధించిన వామపక్షాలు తిరిగి అధికారంలోకి రావడానికి ఇకనైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. విద్యార్థుల స్థాయిలోనే సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలి. నేటి జెన్ జీ మిలీనియం యువత ఆకాంక్షలకు అనుగుణంగా పథక రచన చేయాలి. ప్రజల కోసం పోరాడేవే పార్టీయే కమ్యూనిస్ట్ పార్టీలు అని, సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఎర్రజెండా ఉంటుంది అని తెలియజేయాలి. దూరం అవుతున్న విద్యార్థులు, యువత, రైతులపై పార్టీలు దృష్టి పెట్టాలి. మార్క్సిస్ట్ సిద్ధాంతంపై ఆధారపడి ప్రజాస్వామిక విప్లవం ద్వారా భారత సమాజాన్ని పరివర్తన చెందించాలనేది కమ్యూనిస్ట్ పార్టీ ఆశయం. అయితే, తన భావజాలాన్ని వదలకుండా యువత, నేటి సమస్యలను అనుసంధానం చేసుకుంటూ వామపక్షాలు ముందుకు కదిలితేనే పూర్వ వైభవం వస్తుందని గ్రహించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, సోషల్‌మీడియాపై పట్టు సాధించాలి.
బెంగాల్లో మమతా బెనర్జీ ఒంటెత్తు పోకడలు, ప్రజాసమస్యల్లో ప్రజా ప్రతినిధుల ప్రమేయం, అవినీతి, కమ్యూనిస్టుల అణచివేత, ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు, ముఖ్యంగా ప్రధానితోపాటు ఇతర కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనటం, మతపరమైన విభజన చిచ్చుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇకనైనా తృణమూల్ కాంగ్రెస్ విశ్లేషణ చేసుకోవాలి. అసోంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టాయి. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల్లో ఇండి కూటమి కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ కూటమి లోటుపాట్లే పరాజయానికి కారణం. పార్లమెంట్ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు కలిసి పని చేయటం, ఆయా రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారు విడివిడిగా పోటీ చేయటం వల్ల ఈ రెండేండ్ల కాలంలో కూటమి నష్టపోయింది. ఇప్పటికే ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు జట్టుకు దూరం వెళ్లాయి. తమిళనాడులో డీఎంకే 1950, 1960 ద్రవిడ సాంప్రదాయ పద్ధతుల నుంచి బయటపడకపోవడమే ఓటమికి ఓ కారణం. ఇదే విషయాన్ని నేటి యువత తమ ఓటు ద్వారా తెలియజేశారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పార్టీలు తమ వైఖరులను మార్చుకోవాలి. లేకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.
-ఐ.ప్రసాదరావు
63056 82733