హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ) : నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్టుంది హైడ్రా తీరు. చేయని పనులను తానే చేశానంటూ పెద్దఎత్తున ప్రకటించుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను చూసి నగరవాసులు నవ్వుకుంటున్నారు. తాజాగా ఖానామెట్‌లోని ప్రభుత్వ భూమిని నాటి ఆర్డీవో అధికారి సురేశ్ పోద్దాటి నానాకష్టాలు పడి కోర్టులో సరైన పత్రాలు సమర్పించగా అధి ప్రభుత్వానికే చెందినట్టు హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఆ భూమికి ఫెన్సింగ్ వేసి తానే కాపాడినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించుకోవడంపై ఇదేమి విడ్డూరమని నగరవాసుల్లో చర్చ జరుగుతున్నది. బుధవారం సైబర్ టవర్స్‌కు చేరువలో 15 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసి రూ.3వేల కోట్ల భూమిని కాపాడామంటూ హైడ్రా ప్రకటించుకున్నది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని సర్వే నంబర్లు 41/12,13,14లో 15 ఎకరాల భూమి విషయంలో హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో జస్టిస్ భీమపాక నగేశ్ తీర్పు వెలువరించారు. ఈ భూమిని కాపాడే విషయంలో నాటి ఆర్డీవో సురేశ్ పోద్దాటి.. పిటిషనర్ సమర్పించిన పట్టాపత్రాలు నకిలీవని ఆధారాలు సహా కోర్టుకు సమర్పించారు. అప్పటి రాజేంద్రనగర్ కార్యాలయం 1978లో ఏర్పాటుకాగా 1972, 1973లో ఆ కార్యాలయం పేరుతో పట్టాలు ఎలా వస్తాయని, ప్రొసీడింగ్స్ జారీ చేసిన అధికారి అక్కడ పనిచేసినట్టు రికార్డులు లేవంటూ ఆధారాలు చూపించిన రెవెన్యూ అధికారి, నకిలీపత్రాలతో ప్రభుత్వభూమిని కొట్టేయాలని చూస్తున్నారని చెప్పడంతో కోర్టు ఇదే విషయాన్ని నిర్ధారించింది. ఆ భూములను రక్షించాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఈ భూమిని కాపాడడంలో కీలక పాత్ర పోషించిన ఆర్డీవో కృషిని హైడ్రా తన ఖాతాలో వేసుకొని బిల్డప్ ఇచ్చింది. ఇంతకు అక్కడ జరిగిందేంటంటే ప్రభుత్వ భూములను పరిరక్షించే క్రమంలో కోర్టు ఉత్తర్వుల మేరకు ఆ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులది కాగా, ఫెన్సింగ్ ప్రక్రియను హైడ్రాకు అప్పగించారు. కేవలం ఫెన్సింగ్ వేసి తామే భూమిని కాపాడినట్టు చెప్పుకొంటున్న హైడ్రా తీరుపై సర్వత్రా చర్చించుకుంటున్నారు.
ఆ లక్ష కోట్ల భూమి ఇదే తరహానా..
ఒకవైపు నగరంలో రూ.లక్ష కోట్ల విలువైన ప్రభుత్వభూమిని కాపాడింది తామేనంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు వేదికలపై చెప్పుకుంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ భూముల విలువ లక్షకోట్ల సంగతేమో కానీ, అవి కూడా ఖానామెట్ మాదిరే వేర్వేరు శాఖలు కష్టపడి సాధిస్తే వాటికి ఫెన్సింగ్ వేసి తమ ఖాతాలో వేసుకుంటున్నారంటూ పలువురు చెప్పుకొంటున్నారు. ఈ భూములు తమ ఖాతాలో వద్దు సార్.. అని చెప్పినా మా సార్ వినడం లేదని హైడ్రాకు చెందిన ఓ అధికారి తెలిపారు. హైడ్రా అధికారులతోపాటు సిబ్బంది కూడా తాము నలుగురిలో నవ్వులపాలవుతున్నా మంటూ చెప్పుకోవడం గమనార్హం.