‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అని ఘోషించిన ప్రపంచంలో స్త్రీకి బతికి ఉండటమే పెద్ద వరమైపోయింది. బతికి ఉన్నవారికి కూడా అవమానాలు లేని బ్రతుకు మృగ్యమైపోయింది. అయినా అత్యుత్తమ వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఉండవలసిన పార్లమెంటులో 151 మంది నేర చరిత్ర కలిగిన పురుషులున్న దేశంలో ఆడవాళ్ల పరిస్థితి హీనంగా, హేయంగా ఉండకుండా పూజనీయంగా ఉంటుందని ఆశించడం తెలివి తక్కువే కదా!
Woman | సర్దార్ పటేల్ విగ్రహానికి రూ.3,000 కోట్లు వెచ్చించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం సుమారు 70 కోట్ల స్త్రీ జనాభా రక్షణ కోసం రూ.100 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం హాస్యాస్పదం, అన్యాయం కాదా? గర్భవతి బిల్కిస్ బానోను అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులు 14 మందిని హత్యచేసిన వారికి పడని శిక్ష, ఒక్క డాక్టర్ మహిళను అత్యాచారం చేసి చంపిన ఒక్కడికి (మిగతా వాళ్లను ఎలాగూ దాచిపెట్టారు) పడుతుందని ఆశించగలమా? రెండేండ్ల నుంచి రావణకాష్టంలా మండుతున్న మణిపూర్ అత్యాచారుల మీద కేసులైనా పెట్టారా? ధర్మం కనీసం రెండు పాదాల మీదైనా నడిచింది కాబట్టి, ద్వాపరయుగంలో ద్రౌపదిని అవమానపడకుండా శ్రీకృష్ణుడు కాపాడాడు. మరి ఒంటికాలి మీద నడుస్తున్న ధర్మం ఈ కలియుగంలో ఆడవారిని ఎలా రక్షిస్తుంది.
మేకప్ లేకుండా వాణిశ్రీని హీరోయిన్గా చూపగలిగిన సాహసి, బాపు డైరెక్షన్లో వచ్చిన ‘గోరంత దీపం’ సినిమాలో నాస్తికుడు ఆరుద్ర రచించిన ‘రాయినైనా కాకపోతిని’ అన్న అద్భుత రచన ఒక్కసారి గురుచేసుకుందాం.
‘రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా’ అన్న మాట అహల్య శాప విమోచనం సూచిస్తుంది. కానీ, కలియుగ పురుషుల్లో, ముఖ్యంగా రాజకీయ నాయకులలో స్త్రీలు, అనుభవిస్తున్న ఈ వెతలు ఎవరు తీరుస్తారు? ఒక్క తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ మాత్రమే తన పాలనలో ఈ విషయం గురించి మధించి, షీ టీమ్స్‌ను ఏర్పాటుచేసి 2014 నుంచి డిసెంబర్ 2023 దాక రాష్ట్రంలో స్త్రీలకు రక్షణ కల్పించారు. దేశంలో ఇటువంటి రెండో నాయకుడు కనపడటం లేదంటే అతిశయోక్తి కాదు. మళ్లీ 2024 నుంచి కథ మామూలే! ఆంధ్ర కుమారీ ఆంటీకి రక్షణ, తెలంగాణ మహిళా జర్నలిస్టులకు దెబ్బలు ప్రస్తుత ప్రభుత్వ పక్షపాత ధోరణికి అద్దం పడుతున్నాయి.
ఇంతకూ స్త్రీలు ఏం కోరుతున్నారు? మణులా, మాన్యాలా? ఏమీ లేదు. తమంత తాము చదువుకొని, ఉద్యోగాలు చేస్తూ, చదువు లేకపోతే కూలీ, ఇతర పనులు చేస్తూ, సంపాదిస్తూ తమ బతుకు తాము బతుకుతామంటున్నా మగవారి అహంకారం, వివక్ష తగ్గటం లేదు. ఈ విషయంలో బీద, గొప్ప తేడా లేదు, కులాల ప్రసక్తి లేనే లేదు. దేశమంతా లింగవివక్ష సాగుతూనే ఉన్నది. చిన్న విషయాల దగ్గర్నుంచీ, అత్యాచార నేరాల వరకూ ఆడవారికి అవమానం, మగవారి వికృతచేష్టలకు మద్దతు దొరుకుతూనే ఉన్నాయి. దీన్ని అరికట్టడం ఎలా సాధ్యం?
బలహీనుడిని బలవంతుడు రక్షించేదే నిజమైన నాగరిక సమాజం. శారీరకంగా పురుషుడి కంటే బలహీనురాలైన స్త్రీ నైతికంగా, వ్యక్తిత్వ విలువలలో పురుషుడి కంటే ఎంతో బలవంతురాలు. ఈ విషయం, లింగ సమానత్వం గురించి విషయాలు విద్య ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ అర్థమైనప్పుడే ఇటువంటి విజ్ఞానం పురుషులకు అబ్బుతుంది. అంతకంటే ముఖ్యమైనది ఏ నేరానికైనా ముఖ్యంగా స్త్రీల మీద, బలహీనవర్గాల మీద జరిగే అకృత్యాలకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. చిన్న, పెద్ద ఏ నేరాలైనా భయపెట్టే శిక్షలు, వాటి అమలు సరిగ్గా ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది. ‘పది మంది నేరస్థులు తప్పించుకున్నా ఫరవాలేదన్న’ మాట పోయి, ఒక నేరస్థుడు కూడా తప్పించుకోలేనిదే నాగరిక సమాజంగా మారుతుందన్న సత్యాన్ని గుర్తించాలి.
ఒకరి జీవితం మీద ఇతరులకు మాట్లాడే హక్కే లేనప్పుడు ఆ జీవితాన్ని చిదిమేసే హక్కు ఎవరికి ఉంది? నేరస్థులకు ఉరిశిక్షలు అమానవీయం అయితే మరి అమాయకులను చంపడం అమానవీయం కాదా? 30 ఏండ్ల కిందట గుంటూరు దగ్గర దుండగులు బస్సుకు నిప్పు పెట్టిన సంఘటనలో 27 మంది సజీవ దహనమయ్యారు. ఆ దుండగుల న్యాయవాది వారిని ఉరి తీయకూడదని వాదించాడు. న్యాయానికే వారికి శిక్ష వేసే హక్కు లేనప్పుడు, పక్కవారిని చంపే హక్కు సామాన్యులకు ఉందా? బతికే హక్కు దుండగులకే ఉంటే మరి ఆ 27 మందికి బతికే హక్కు లేదా? ఇటువంటి వెర్రివాదనలు పక్కనపెట్టి శిక్ష రుజువైన ప్రతివారికి ముఖ్యంగా అత్యాచారం, హత్య వంటి సందర్భాలలో ఉరిశిక్షనే ఖరారు చేయాలి. ఒకసారి ఉరిశిక్ష పడ్డాక పైకోర్టులు అతను నేరస్థుడేనా అన్నది పరిశీలించాలి కానీ, శిక్ష తగ్గించకూడదు. ఇటువంటి నేరస్థులు ఇరవై కోట్ల మందిని ఉరితీసినా భారతదేశ జనాభాకి నష్టమేమీ లేదు.
ముఖ్యంగా మన పార్టీ వాడు, పరాయి పార్టీ వాడు అన్న భేదం అసలు పాటించకూడదు. కలకత్తా అత్యాచార సంఘటనను నిరసిస్తున్నవారంతా బిల్కిస్ బానో నిందితులను, మణిపూర్ ఘటనా నిందితులను, ముఖ్యంగా బ్రిజ్‌భూషణ్ వంటి రాజకీయవేత్తలను, నేరచరిత్ర ఉన్న రాజకీయ నాయకులను కూడా శిక్షించాలని కోరాలి. కలకత్తాలో నిరసన తెలుపుతున్న బీజేపీ వారు గురివింద గింజల్లా ప్రవర్తిస్తున్నారు. నిందితులెవరైనా కఠిన శిక్షలుంటేనే న్యాయం, ధర్మం పాటింపబడతాయని గ్రహించాలి. మానవత్వం కంటే, పార్టీ ఐడియాలజీ గొప్పది కాదు. ఒక్క నిందితుడు తప్పించుకోలేనిదే నిజమైన మానవీయ సమాజం అని గ్రహించాలి.
కనకదుర్గ దంటు
89772 43484