రంగారెడ్డి/హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాములు మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. రాములు మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో 1935లో జన్మించారు. చిన్నవయస్సులోనే కమ్యూనిస్టు ఉద్యమాలవైపు ఆకర్షితులై ఈ ప్రాంతంలో జరిగిన భూపోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నియోజకవర్గంలో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిన ఆయన పేదలకు భూములు పంపిణీ చేయటం, కూలి రేట్లను పెంచటం, కుల వ్యతిరేక పోరాటంలో ఉద్యమాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం నుంచి ఆయన సీపీఎం తరఫున రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అనేకమంది పేదలకు ఇండ్ల స్థలాలు కూడా అందించారు.
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు అకాల మరణం తనను ఎంతగానో కలచివేసిందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కూలి పనిచేసిన శ్రమజీవిగా ఆయన.. ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ నేతగా ఎదిగారని గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనా నిరాండంబరంగా జీవితాన్ని కొనసాగించారని కొనియాడారు. రేపటి తరానికి ఆయన జీవితం ఆదర్శనీయమని పేర్కొన్నారు. రాములు మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే రాములు మరణం విచారకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషిచేశారని ఒక ప్రకటనలో కొనియాడారు. రాములు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.