ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో వృద్ధి చెందుతూ అభివృద్ధి దిశగా దూసుకువెళ్తున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. పదేండ్ల పాటు అధికారానికిదూరమై మొహం వాచిపోయిన కాంగ్రెస్ నేతలు ఈసారి ఎట్లాగైనా గద్దెనెక్కాలని మార్పు పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించారు.
అనుకున్నట్టే.. అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్నది. కానీ, ఎన్నో ఆశలు, ఆశయాలను మోస్తూ పీఠమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా పూర్తిగా గడవకుండానే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఎంతలా అంటే.. కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ సర్కార్ పేరు చెప్తేనే ప్రజలు అసహ్యించుకునేలా, ఏవగింపు వచ్చేంతలా. అందుకే, ఇప్పుడు ‘వద్దురో ఈ కాంగ్రెస్ పాలన’ అంటూ నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఎక్కడో ఒకచోట మాత్రమే కాదు, యావత్ రాష్ట్రవ్యాప్తంగా ఏ మూలన చూసినా ఇదే పరిస్థితి.
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో హామీల అమలు కోసమని చెప్తూ ప్రజాపాలన పేరిట రేవంత్ హడావుడి చేశారు. అదిగో ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నాం.. అని ప్రజలను ఊరించి లక్షల దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులకే అతీగతీ లేదు. సమగ్ర సర్వే అంటూ మళ్లీ వివరాల సేకరణకు తెరలేపారు. ఏడాదిగా రేవంత్ పాలన చూసి విసిగి వేసారిపోయిన ప్రజలు సర్వేకు సహకరించడం లేదు. అదేదో సినిమాలో కోట శ్రీనివాస్‌రావు చెప్పినట్టు.. ‘మాకేంటి.. ఆహా చెప్తే మాకేంటి’ అని సర్వే సిబ్బందిలోనే రేవంత్‌ను చూసుకుంటూవారితో ఆటలాడుకుంటున్నారు. హామీల సంగతేంటని వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు సీఎం అయిన కొత్తలో తెగ హడావుడి చేసిన రేవంత్ ఇప్పుడు సొంత నియోజకవర్గం కొడంగల్ రైతులనే పట్టించుకోవడం లేదు. లగచర్లలో రక్తం ఏరులై పారుతున్నా కనీసం స్పందించడం లేదు. సీఎం సొంతూరును తమ రాజ్యంలా భావిస్తున్న సీఎం సోదరులు అక్కడ చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వారి వేధింపులు భరించలేక మాజీ సర్పంచ్ ‘తన చావుకు సీఎం సోదరులే కారణం’ అని స్పష్టంగా మరణ వాంగ్మూలం రాసి మరీ మరణించారంటేనే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పద్నాలుగేండ్ల పాటు సర్పంచిగా కొండారెడ్డిపల్లికి సేవలందించిన ఆ వ్యక్తి చివరి మజిలీకి బాట కూడా లేకపోవడం విచారకరం. అంతేకాదు, కలుషిత ఆహారం తిని మరణించిన గురుకుల విద్యార్థి ఆఖరి మజిలీ కూడా పోలీసు వలయం మధ్యనే సాగడం రేవంత్ సర్కార్ నిర్బంధ పాలనకు నిదర్శనం.
రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రం అట్టుడుకుతున్నది. హైడ్రా, మూసీ, జీవో 46 బాధితులు, బెటాలియన్ కానిస్టేబుళ్లు, ఆటోడ్రైవర్లు.. ఇలా అన్ని వర్గాలవారు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. ఆఖరికి మంచి బువ్వ కోసం గురుకుల విద్యార్థులు సైతం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రం ఆగమాగమైపోయింది. రోమ్ నగరం తగలబడిపోతుంటే.. రోమన్ చక్రవర్తి ఫిడెల్ వాయించారట. కానీ, మన చక్రవర్తి రేవంత్‌కు ఆ ఫిడెల్ కూడా దొరకడం లేదేమో. తెలంగాణ తగలబడిపోతుంటే చూస్తూ ఉండటం తప్ప ఆయనేమీ చేయడం లేదు. రాష్ర్టాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులు చేశామని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. విధ్వంసం తప్ప వికాసమే తెలియనివారు అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదం. డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ తెలియని కాంగ్రెస్ నుంచి అతిగా ఆశించడం మన తప్పే.
ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్ పేరిట మొదలైన కాంగ్రెస్ మోసాల పర్వం మొన్నటి వరంగల్ సభ వరకు నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. విజయోత్సవాల పేరిట సభ పెట్టి చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో రేవంత్ మళ్లీ పాత పాటే అందుకున్నారు. నిమిషానికోసారి కేసీఆర్, కేటీఆర్‌లను తల్చుకున్నారు. పల్లెల నుంచి రాజధాని హైదరాబాద్ దాకా అడుగడుగునా కేసీఆర్ ఆనవాళ్లే కనిపిస్తుండటంతో రేవంత్‌కు నిద్ర పట్టడం లేదనుకుంటా. అందుకే, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదే పదే ఆయనను తలుచుకుంటున్నారు. నిమిషానికోసారి కేసీఆర్ జపం చేస్తూ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం. అయినా అబద్ధాల పునాదులపై నిర్మించిన కోట ఎంతోకాలం నిలవదు. అది ఏదో ఒకరోజు కుప్పకూలాల్సిందే. కేసీఆర్, కేటీఆర్‌లపై చేసే దుష్ప్రచారం కూడా అంతే. కాంగ్రెస్ నాయకుల మాయమాటలను ప్రజలు ఒకసారి నమ్మి ఓట్లు వేశారు. అవే మాయమాటలు చెప్పి మళ్లీ మోసం చేయాలనుకోవడం కాంగ్రెస్ నేతల మూర్ఖత్వమే.
నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచిన రేవంత్.. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి తన సొంత ఖజానా నింపుకొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు అనేక స్కాములు బయటపడ్డాయి. కేటీఆర్ చెప్పినట్టు.. అదానీ, అన్న, తమ్ముడు, అల్లుడి కోసమే రేవంత్ సర్కార్ నడుస్తున్నది. సీఎం సోదరుడు జగదీశ్వర్‌రెడ్డికి చెందిన ఊరు, పేరు లేని స్వచ్ఛ బయో కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రచారం చేసి తెలంగాణ సొమ్మును సోదరుడికి ధారాదత్తం చేశారు. బామ్మర్ది సృజన్‌రెడ్డికి రూ.1,137 కోట్ల విలువైన అమృత్ కాంట్రాక్టును కట్టబెట్టారు. అన్నాదమ్ముళ్లకు కొడంగల్‌ను రాసిచ్చేశారు. ఇప్పుడు అల్లుడికి లబ్ధి చేకూర్చేందుకు ఫార్మా విలేజ్ పేరిట లగచర్లలో రక్తపాతం సృష్టిస్తున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన ప్రతీసారి ఏదో ఒకవిధంగా డైవర్షన్ రాజకీయాలకు తెరలేపుతూ కాంగ్రెస్ పాలకులు పబ్బం గడుపుకొంటున్నారు. అయితే, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతోకాలం సాగవు. ఏదో ఒక రోజు వాటికి తెరదించక తప్పదు. ప్రజలిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పూటకో స్టంట్ వేస్తూ పొద్దు గడుపుతున్నది. ఇప్పటికైనా రేవంత్ తన తీరును మార్చుకోకపోతే ‘పాలకుడు ఇలా ఉండకూడదు’ అన్నదానికి ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.