Iran-US-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలోకి పాకిస్తాన్ కూడా అడుగుపెడుతుందా..? దీనిపై పాక్ వైపు నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. అయితే, పాక్ రంగంలోకి దిగబోయేది ఇరాన్‌కు మద్దతుగా కాదు. వ్యతిరేకంగా. సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా.. పాకిస్తాన్‌కు సన్నిహిత దేశం. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య భద్రత, రక్షణ పరమైన ఒప్పందం ఉంది.
వేరే ఏ దేశమైనా ఈ రెండింటిలో ఏ ఒక్క దేశంపై దాడి చేసినా.. మిగతా దేశం దానికి మద్దతుగా నిలవాలి. ఈ అంశంలో సౌదీ అరేబియాతో పాకిస్తాన్ గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీపై వేరే దేశం దాడి చేస్తే పాక్ మద్దతుగా.. పాకిస్తాన్‌పై ఏ దేశమైనా దాడి చేస్తే సౌదీ మద్దతుగా రావాలి. ఈ లెక్కన ప్రస్తుతం సౌదీపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో సౌదీ అరేబియాకు మద్దతుగా పాకిస్తాన్ రంగంలోకి దిగాలి. ఈ ఒప్పందాన్ని స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ (ఎస్ఎండీఏ)గా పేర్కొంటారు. దీనిపైనే పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌదీతో తమకు రక్షణ, భద్రతాపరమైన ఒప్పందం ఉందని ఇరాన్‌కు తెలుసని, అవసరమైతే తాము కూడా సౌదీ అరేబియాకు మద్దతుగా యుద్ధంలోకి దిగే అవకాశం ఉందని ఇషాక్ దర్ అభిప్రాయపడ్డాడు.
పాకిస్తాన్ నుంచి ఈ యుద్ధంపై వచ్చిన స్పష్టమైన ప్రకటన ఇది. ఇప్పటికిప్పుడు సౌదీకి మద్దతుగా యుద్ధం చేస్తామని పాక్ ప్రకటించకపోయినా, ఈ విషయంలో తమ వైఖరి మాత్రం ఇదేనని పాక్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందానికి సంబంధించి పాక్ అణ్వస్త్రాలు కూడా ప్రయోగిస్తుందా అనే విషయంలో స్పష్టత లేదు. ఎందుకంటే పాక్ వద్ద అణ్వాయుధాలున్నాయి. నిజానికి గత ఏడాది కుదిరిన ఎస్ఎండీఏ వివాదాస్పదమైంది. అణు ఆయుధాలు కలిగిన దేశంతో ఇలాంటి ఒప్పందం చేసుకోవడంపై విమర్శలు చెలరేగాయి. సౌదీ.. ధనిక గల్ఫ్ దేశం. అలాంటిది పాక్ తోడైతే ఈ ప్రాంతంలో అది భౌగోళిక రాజకీయ సంక్షోభానికి దారితీయవచ్చని నిపుణుల అంచనా. గత ఏడాది దోహా, ఖతార్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్‌లో దేశాల భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అందుకే సౌదీ అరేబియా.. తమకు మద్దతుగా నిలిచే దేశాలపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అందులోనూ అమెరికాపై నమ్మకం లేకపోవడంతో సౌదీ.. పాక్‌తో ఒప్పందం వైపు మళ్లిందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. సౌదీకి, పాక్‌కు మధ్య ఒప్పందం ఉన్నప్పటికీ పాక్ యుద్ధానికి దిగే అవకాశం లేదు.