Music | అధిక శాతం మంది ఎక్కువ శబ్దంతో సంగీతాన్ని వింటూ ఉంటారు. అలాగే శుభ కార్యాల్లో ఎక్కువ శబ్దంతో పాటలు వింటూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా భారీ శబ్దాలతో సంగీతం వినడం హానికరమని నిపుణులు చెబుతున్నారు. అధిక శబ్దాలతో సంగీతం వినడం వల్ల చిన్న వయస్సులోనే తిరిగి సరిచేయలేని వినికిడి నష్టం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ శబ్దంతో సంగీతం వినడం వల్ల వినికిడి శక్తి తగ్గడం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. దీనిని ప్రారంభ దశలో చాలా మంది గుర్తించలేరు. అయితే ఈ నష్టం తిరిగి సరిచేయలేనిదని కనుక ముందు జాగ్రత్త అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు. వినికిడి నష్టం కలగకుండా ఉండాలంటే హెడ్ ఫోన్ వంటి వ్యక్తిగత ఆడియో పరికరాలను 60 శాతం కంటే తక్కువ వాల్యూమ్ తో ఉపయోగించాలి.
అలాగే ఒక గంట ఉపయోగించిన తరువాత విరామం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎంత ఎక్కువ శబ్దంతో సంగీతాన్ని వింటే తీసుకునే విరామ సమయం కూడా అంతే ఎక్కువగా ఉండాలని అప్పుడే వినికిడి నష్టం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా యువత అధిక శబ్దంతో సంగీతాన్ని వింటూ ఉంటారని దీని వల్ల వినికిడి నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వినికిడి నష్టం పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో వినికిడికి సంబంధించిన పరీక్షలు చేయిస్తూ ఉండాలని ముందస్తుగా గుర్తించడం వల్ల చికిత్స అందించడం సులభం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే నవజాత శిశువుల్లో వినికిడి లోపాలను గుర్తించడం కూడా చాలా ముఖ్యమని తీవ్రమైన వినికిడి లోపం ఉన్న శిశువులకు కోక్లియర్ ఇంప్లాట్ ద్వారా తిరిగి వినగలిగేలా చేయవచ్చని అలాగే ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాట్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వినికిడిని పునరుద్దరించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అలాగే చిన్నారుల్లో వినికిడి లోపాలను ముందుగానే గుర్తించి సమయానికి తగిన చికిత్స అందించడం వల్ల వారిలో మాట, భాష, అభ్యాస సామర్థ్యాలు సంపూర్ణంగా అభివృద్ది చెందుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ వారిలో వినికిడి లోపాన్ని గుర్తించకపోతే వారిలో సంభాషణ నైపుణ్యాలు, విద్యాపురోగతి, మానసిక, సామాజిక అభివృద్దిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ శబ్దంతో సంగీతాన్ని విని ఆనందించాలని, భారీ శబ్దంతో సంగీతాన్ని వినడం హానికరమని, అలాగే ప్రతి ఒక్కరు వినికిడి లోపంపై అవగాహన కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.