పునరంకిత దినం
కత్తుల వంతెనపై నడిచింది తెలంగాణ. నెత్తుటి త్యాగాలతో నిజమై నిలిచింది తెలంగాణ. నీళ్లు, నిధుల దోపిడీని ఎదిరించి, నిలబడి, కలబడి కొట్లాడితే వచ్చింది తెలంగాణ.
కత్తుల వంతెనపై నడిచింది తెలంగాణ. నెత్తుటి త్యాగాలతో నిజమై నిలిచింది తెలంగాణ. నీళ్లు, నిధుల దోపిడీని ఎదిరించి, నిలబడి, కలబడి కొట్లాడితే వచ్చింది తెలంగాణ. తెలంగాణ ప్రజల అలుపులేని అస్తిత్వ దీప్తికి, పోరాట స్ఫూర్తికి ప్రపంచమే జైకొట్టింది. అద్వితీయ పోరాటం, అపురూప విజయం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కోటి కలలతో తీర్చిదిద్దుకున్నం. పుటం బెట్టిన బంగారంలా వెలుగులీనిన తెలంగాణ ఇప్పుడు మరో మలుపులో నిలిచింది. ప్రతీప శక్తులు మళ్లీ విజృంభిస్తున్నాయి. కుదుటపడుతున్న తెలంగాణను ఆగమాగం చేస్తున్నాయి. తెలంగాణ సోయిలేని మోసకారి పాలన రాగానే పొరుగు దోపిడీ శక్తులు ఒళ్లు విరుచుకుంటున్నాయి. తినమరిగిన దోపిడీగాళ్లకు మళ్లీ ఆశలు ఆవురావురుమంటున్నాయి. ఇంతలో ఎంత తేడా? ఇన్నాళ్లూ ఇటు తొంగి చూడటానికే జడిసిన రెండుకండ్ల సిద్ధాంతులు స్వరాన్ని సవరించుకుంటున్నారు. వెకిలి నవ్వులు విసురుతున్నారు.
తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలతో ఆటలాడుకున్న బాబులు మళ్లీ సమైక్యవాదం వల్లె వేస్తున్నారు. తెలంగాణ వైపు మళ్లీ ఆధిపత్య పవనాలు వీస్తున్నాయి. తెలంగాణ వచ్చినందుకు కన్నీరు మున్నీరై రోజుల తరబడి పచ్చి మంచినీళ్లు ముట్టని నేతలు దండయాత్రకు బుసలు కొడుతున్నారు. తెలంగాణ ఊసెత్తవద్దని తాఖీదులు జారీచేసిన దోపిడీ శక్తులు మళ్లీ జడలు విప్పుతున్నాయి. దొంగలకు సద్దిగట్టే ఇంటిదొంగల వత్తాసుతో నాలుక తడుపుకుంటున్నాయి. తెలంగాణకు ఉక్కుకవచం లాంటి బీఆర్ఎస్ పాలనకు కొద్దిగా విరామం రాగానే ఇదే అదునుగా రెచ్చిపోతున్నాయి. తెలంగాణకు వెన్నుపోటు పొడిచి పుట్టగతులు లేకుండా పోయిన పార్టీని పునరుజ్జీవింపజేసే ఎత్తుగడలు బాహాటంగానే బరితెగిస్తున్నాయి. తెలంగాణ కోట తలుపులు లోపలి నుంచి శత్రువుల కోసం తెరవాలని తహతహలాడే ఇక్కడి బానిస బుద్ధులకు హుషారు వచ్చింది. పొరుగు ధూపాలతో శివాలెత్తుతున్నాయి. ఇప్పటికే విగ్రహాల పేరిట మన నిగ్రహాన్ని పరీక్షిస్తున్నారు. ఇప్పుడు అస్తిత్వానికి కొత్త అర్థాలు వెతుకుతూ తెలంగాణ ఆత్మను క్షోభపెడుతున్నారు.
తొలిదశ, మలిదశ అమరుల త్యాగాలకు వెలకడుతున్నారు. తెలంగాణ తల్లిని చెరబట్టాలని చూసే రాబందులకు రాచమర్యాదలు చేసి తరిస్తున్నారు. ఇంటాబయటా దాడి జరుగుతున్నది. అందుకే ఇది దీక్షా సమయం. పరీక్షా సమయం. నిరంతర అప్రమత్తతే స్వాతంత్య్రానికి చెల్లించాల్సిన మూల్యం అన్నారు పెద్దలు. తెలంగాణకు ఇపుడు ఈ మాటలు వర్తించినట్టుగా మరెపుడూ వర్తించవేమో. మొక్కవోని ఉక్కు సంకల్పంతో నిలిచి, చావునోట్లో తలపెట్టి కేసీఆర్ స్వరాష్ర్టాన్ని సాధించారు. సాధించిన తెలంగాణకు సారథిగా నిలిచి ప్రగతి, సంక్షేమాల్లో సమున్నతంగా నిలబెట్టారు. అన్నింటికీ మించి తెలంగాణ ద్రోహుల్ని నూరామడల దూరం తరిమికొట్టారు. ఇటువైపు కన్నెత్తి చూడకుండా చేశారు. కానీ అధికార మార్పిడితో అంతా తారుమారవుతున్నది. మూతపడ్డ నోళ్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి. సమైక్యంపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. త్యాగాలను తూలనాడుతూ విషం కక్కుతున్నాయి. వీధికెక్కుతున్నాయి. కేసీఆర్ చేతిలో పగ్గాలు ఉండగా ఇది ఊహలో కూడా లేని విషయం. కానీ ప్రస్తుతం అనూహ్యమైనవి జరుగుతున్నాయి. అందుకే తెలంగాణ బిడ్డలు అప్రమత్తమై మరో అస్తిత్వ పోరాటానికి నడుం బిగించాల్సిన ఘడియ వచ్చింది.
‘కత్తి ఆంధ్రోడిదే గానీ పొడిచేటోడు మన తెలంగాణోడే’ అని కేసీఆర్ ఏనాడో చెప్పారు. పన్నెండేండ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ పోట్లు మొదలయ్యాయి. ‘ద్రోహం చేసినవాడు పరాయివాడైతే పొలిమేరల దాకా తరిమికొట్టు…ఇక్కడి వాడైతే పాతిపెట్టు’ అనే కాళోజీ హితోక్తిని ఆచరణలో పెట్టేందుకు కదలాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకు జూన్ రెండో తేదీ స్ఫూర్తి కావాలి. ఈసారి ఇది కేవలం రాష్ర్టావతరణ దినోత్సవం మాత్రమే కాదు. తెలంగాణ ఆత్మపై జరుగుతున్న ఘాతుక దాడిని తిప్పికొట్టేందుకు పునరంకిత దినం కావాలి. ఈ గడ్డమీద పుట్టిన ప్రతిబిడ్డ కర్తవ్యం ఇది!
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

