‘అట్ట పర్వతం ఎత్తి పట్టుకున్నవాడు ఆంజనేయుడు కాదు/నెత్తిలో నెమలీక పెట్టుకున్నోడు కృష్ణ పరమాత్ముడూ కాదు/అదంతా ఎన్నికల ‘అట్ట’హాసం అంటాడు అలిశెట్టి ప్రభాకర్. ఉత్తుత్తి మాటలతో భ్రమింపజేసినవాడు జనం మెచ్చే నేత కాలేడు అని కవి ఉద్దేశం. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి మిన్నకుండిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పంక్తులు సరిగ్గా సరిపోతాయి. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు తొమ్మిది వందల రోజులైనా తీరలేదు. ఐదేండ్లలో కూడా అవి తీరేలా లేవు. హామీల అమలులో సాగుతున్న నిర్లక్ష్యం, వైఫల్యాలు విపక్షాలకు నిత్య విమర్శనాస్ర్తాలుగా పనికొస్తున్నాయి. ప్రజలు, పత్రికలవాళ్లు వీటిపై నిలదీసినప్పుడు కాంగ్రెస్ నేతల దాటవేసే ధోరణి మాటలు చూస్తున్నాం. పెండ్లి చేసుకున్న ఆడపిల్లకు తులం బంగారం ఎప్పుడిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ను అడిగితే ‘ఇంకెక్కడి బంగారమురా నాయనా.. అది ఎవరితరం కాదు’ అనేశారు.
ఈ మధ్య కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు ఓ ఛానల్ తో మాట్లాడుతూ..తమ పార్టీ ప్రజలకిచ్చిన 419 హామీల్లో 370 నెరవేరాయని, దాదాపు అన్నీ అమలు చేసినట్లేనని అన్నారు. పెండ్లి చేసుకున్న ఆడపిల్లకు తులం బంగారం ఇవ్వలేదు కదా? అని అడిగితే ఆలస్యమైనా..ఆర్థిక వ్యవస్థ గాడిలో పడ్డాక ఇచ్చి తీరుతామని సవరించి చెప్పారు. మంత్రులను ఇంతకన్నా ఎక్కువ నిలదీయలేక విలేకరులు సర్దుకుపోతున్న సందర్భాలు ఉన్నాయి. పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాము ఇప్పటికే 75% హామీలు నెరవేర్చామని చెప్పారు. వాటిలో 25% హామీల గురించి చెప్పమని ఒక విలేకరి అడిగితే..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలని సమాధానం ఇచ్చారు. ఇలా పొంతన లేని మాటలతో మంత్రులు జారుకుంటున్న వైనం మొదలైంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ అట్టహాసాన్ని కేరళం ప్రజల ముందుంచి, కాంగ్రెస్‌కు ఓటేయాలని అక్కడి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ పార్టీ ఇచ్చిన హామీల అమలుతో ప్రజలు సుఖసౌఖ్యాలతో ఉన్నారని అక్కడి జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానం ఉంటే తెలంగాణకు వచ్చి చూడండని సభాముఖంగా ప్రకటించారు. ఈ విషయం ఇక్కడి పత్రికల్లో రావడంతో సీఎం ఇంత అబద్ధం చెప్తారా? అని ప్రజలు విస్తుపోయారు. చదువులో ముందున్న కేరళం ప్రజలు ఈ మాటలను విశ్వసించరని, గూగుల్‌లో వెదికితే తెలంగాణలో కాంగ్రెస్ హామీల దగా బయటపడదా? అని ఇక్కడి సంగతి తెలిసినవారు ఎద్దేవా చేస్తున్నారు. మన సీఎం కేరళం ప్రజలను తక్కువగా అంచనా వేశారో, ఎవరేమనుకుంటే తనకేమిటి అనుకున్నారో వాస్తవాన్ని మాత్రం దాచిపెట్టారు.
గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో జరిగిన చర్చల సందర్భంగా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి నోటీసు అందజేశారు. వాటి అమలుపై ప్రభుత్వానికి ఎలాంటి అనుమానం లేకపోతే కాంగ్రెస్ సభ్యులు ఆ బిల్లుకు మద్దతు పలుకాలని కేటీఆర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో వైఫల్యం చెందినందువల్ల వాటికీ చట్టబద్ధత అవసరమని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత ఎంతో నష్టపోతున్నారని, హామీల చట్టబద్ధత వల్ల ప్రభుత్వాన్ని ఎవరైనా న్యాయ మార్గంలో ప్రశ్నించవచ్చని ఆయన అన్నారు. చట్టబద్ధత వల్ల హామీ అమలుకు అవసరమైన నిధుల మంజూరు జరిగి, ఆ సొమ్ము బ్యాంకులో డిపాజిట్ ద్వారా భరోసా వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే హామీల ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు.
ఆనాటి గవర్నర్ తమిళిసై సమక్షంలో ఈ ఆరు గ్యారెంటీలకు చట్టపర హోదా ఇస్తామని రేవంత్ ప్రజలకు హామీ ఇచ్చారు. అదే ప్రశ్న ఇప్పుడు బీ ఆర్ఎస్ అడుగుతున్నది. చట్టబద్ధత అంటే ప్రభుత్వం ప్రజలకు రాసిచ్చిన ప్రామిసరీ నోటు లాంటిది. మాట తప్పితే ప్రభుత్వాలను కోర్టు నిలదీయవచ్చు, దోషిగా ప్రకటించవచ్చు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ జాప్యానికి నిరసనగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి. వచ్చే సంవత్సరం నుంచి విద్యార్థులు నుంచే ట్యూషన్ ఫీజు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని యాజమాన్యాలు కోరాయి. వారికి అనుమతినిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మౌనం వహిస్తున్నది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చట్టబద్ధత ఉంటే వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపు విషయంలో కోర్టు ప్రభుత్వానికి ఇప్పటికే కటాఫ్ తేదీ పెట్టింది. చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వ హామీలకు కూడా న్యాయపర హక్కు లభించే వీలుంటుంది. మిగిలిన కాలంలోనైనా హామీలు నెరవేర్చి తీరుతామంటున్న కాంగ్రెస్ సర్కార్ వాటికి చట్టబద్ధ్దత కల్పించాలి.
– బద్రి నర్సన్