విద్యారంగంలో ప్రాథమిక దశలో పాఠశాలల్లో నీతి పద్యాలు నేర్పిస్తే అదే వ్యక్తిగత వికాసానికి తోడ్పడుతుంది. ఒక్క వ్యక్తిగత జీవితానికే కాకుండా సామాజిక జీవితానికి, రాజకీయాలు అవగాహన చేసుకోవటానికి కూడా పనికి వస్తాయి. కొన్ని చాలా మందికి తెల్సిన పద్యాలే ప్రస్తుతం అవి మన రాష్ట్ర రాజకీయాలను ఎలా ప్రతిబింబిస్తాయో చూద్దాం.
నాయకులను ఎన్నుకునే ప్రజలకు ఒక సందేశం కూడా ఇచ్చాడు మేధావి వేమన. దేశ ప్రజలకు సేవ చేయాలంటే కావాల్సినది పశుబలం కాదు. ఒక్క సరైన నాయకుడు. 1857 నుంచి భారత స్వాతంత్య్ర పోరాటం సాగినా ఎందరో నాయకులు త్యాగాలు చేసినా చివరకు మహాత్మాగాంధీ వచ్చాకే భారతదేశ స్వాతంత్య్రం సిద్ధించింది. అంటే ప్రజలు లక్షలు, కోట్లు ఉన్నా, వారిని నడిపే ధీశాలి ఒక నాయకుడు అవసరం.
కోతిబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్చు లెల్ల గొలిచినట్టు
నీతిహీనునొద్ది నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ
ఆరు దశాబ్దాలు పోరాడి, అష్టకష్టాలు పడి, వేలమంది యువతను కోల్పోయి, మూడు తరాల రైతుల ఆత్మహత్యలు, మూడు తరాల నిరుద్యోగం, వలసలు, నిధుల దోపిడీ, నీటి చౌర్యం, సంపద నష్టం జరిగిన తర్వాత రాష్ట్రం సాధించుకుని, ఉద్యమపార్టీ పాలనలో సేద తీరారు తెలంగాణ ప్రజలు. ఒక దశాబ్దంలోనే చాలా కష్టాలు తీరి, రాష్ట్రమే ఒక ఆదర్శ రాష్ట్రంగా మారిన తరుణంలో అధికారం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త వ్యక్తిని పార్టీలోకి రానిచ్చి, ఆ అనుభవం లేని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, పాత పార్టీ వారందరూ ఆ వ్యక్తి బాటలోనే పయనిస్తుండటం కొత్త విషయంగా కనిపించినా, సుమారు 700 ఏండ్ల కింద వేమన ఇలా రాయటం విచిత్రమే కదా!
కనకమృగము భువిని కద్దులేదనకయె
తరుణి విడిచి చనిపోయేదాశరథియు..
బంగారు లేడి ప్రపంచంలో ఉండదని రాముడంత గొప్ప వ్యక్తికే తెలియకుండా ఆ క్షణంలో త్వరపడి సీతమ్మను వదిలివెళ్లిపోయాడు. సీతమ్మును రావణాసురుడు ఎత్తుకపోయే అవకాశం కల్పించాడు. దురదృష్ట క్షణాల్లో భ్రమలను నమ్మి, దొంగ ప్రమాణాలు చేస్తున్నది తమను 43 ఏండ్లు పీడించిన పార్టీ అని గుర్తించక, తెలివితక్కువగా ఎన్నికల్లో గెలిపించిన పార్టీ వల్ల బాధ పడుతున్నారు కదా తెలంగాణ ప్రజలు.
ఎలుకతోలు దెచ్చి యేడాది ఉతికినా
నలుపు నలుపే గానీ తెలుపు కాదు
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినా బలుకునా? /వి/
అనుభవంలేని వాళ్లు కదా, ప్రజల అవసరాలు, కష్టాలు తెలుసుకొని మంచి పాలన చేస్తారేమో అనుకొంటే, ఎలుకతోలు లాగే వారి నిజమైన రంగు చూపుతున్నారే కానీ ఏ మాత్రం ప్రజాహితంగా ప్రవర్తించటం లేదు కదా. అంటే అసలు వ్యక్తిత్వాలు తెలిసిన తర్వాత వారిని దూరం పెడితే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ లాఠీ వారి చేతికిచ్చి కొట్టొద్దంటే ప్రజాకంటకులు వింటారా? కొయ్యబొమ్మల లాగే పలకకుండా ప్రజల జీవితాలను దుర్భరం చేస్తారు.
అల్పుడెపుడు బల్కు ఆడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్టు కనకంబు
మ్రోగునా /వి/
మనుష్యులను, వారి నిజ స్వరూపాలను కాని ప్రమాణాలు చేసి ప్రలోభపెడుతుంటే ఓటు హక్కు ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలిగా. పైగా అన్ని పార్టీల్లో చేరి, అనైతిక పనులు చేసి పట్టుబడ్డ వాళ్లు చెప్పే మాటలు ఎంత వరకు నమ్మాలి అనే తెలివి ప్రజలకు ఉండాలి కదా. ఎన్నికల ముందు చెప్పిన మాటలు గెలిచాక తప్పిన వారిని ఏమి చేయాలో ప్రజల విజ్ఞత మీదే ఆధారపడి ఉంటుంది. ఎన్నికల ముందు చెప్పని పథకాలు కూడా అమలు చేసిన వారే సరైన పాలకులు కదా.ఇక ప్రజలకేమీ సహాయం చెయ్యని వారి గురించి వేమన ఏమన్నాడో చూడండి.
పెట్టిపోయలేని వట్టి నరులున్న
పుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టవా /వి/
ఎన్నికలు గెలిచి సగం కాలం అయిపోయినా, అధికారం, సంపద చేతిలో ఉండి కూడా ప్రజలకు ఏమీ మంచి చేయని వారిని వేమన చెదలతో పో ల్చాడు. మంచి వస్తువులను పాడు చేసే చెదల వల్ల నష్టమే కానీ లాభం లేదు. ఇక రాష్ర్టానికి పట్టిన ఈ చెదలను వదిలించుకుంటేనే ప్రజలు బతుకగల్గుతారు.కుత్సితమైన బుద్ధి ఉన్నవారి పాలనలో మంచి వారు కూడా చెడిపోతారు. అందుకే దుష్టులను దూరంగా పెట్టాలని సామెత వచ్చింది.
వేరుపురుగు చేరి వృక్షంబు జెరచును
చీడపురుగు జేరి చెట్టు జెరుచు
కుత్సితుండు చేరి గుణవంతు
చెరచురా /వి/
చెడ్డ గుణములున్న వారికి అధికారం కట్టబెట్టడమంటే మానవ నాశనం చేసే పురుగులను చెట్ల దగ్గర వదిలినట్టే చెడ్డవారని మనకు అనుభవం ద్వారా తెలిసిన తర్వాత వారిని దగ్గరికి రానీయకూడదు. అధికారం అసలే ఇవ్వకూడదు.
చిన్నబుద్ధి ఉన్నవారికి పెద్ద పదవి ఇస్తే ఎలా ఉంటుందో కూడా వేమన వర్ణించాడు.
హీనగుణము వాని నిలుచేర నిచ్చిన
ఎంత వానికైన నిడుము గలుగు
ఈగ కడుపుజొచ్చి యిట్టట్టు సేయ? /వి/
పాలనా అనుభవమూ లేక, సమాజ మంచి గుణాలూ లేక, ప్రజల పట్ల అభిమానమూ లేక, గతంలో స్థానికులకు వ్యతిరేకంగా పనిచేసి, తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు కానీయకుండా అడ్డుపడ్డ సైంధవులకు కొమ్ముకాసే వ్యక్తికి అధికారం కట్టబెడితే, పొట్టలో చేరిన పురుగులాగే ప్రజలను సుఖంగా బతకనివ్వడు. ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించాలి.
ప్రస్తుతం కేంద్ర, రాష్ర్టాల్లో రాజ్యమేలుతున్న వారి ధైర్యం ఎలా ఉన్నదో తెలిసిందే కదా. ఇలాం టి వాళ్ల గురించి కూడా వేమన ఆనాడే చెప్పాడు.
మేడిపండు చూడ మేలిమై యుండురా
పొట్టవిప్పి చూడు పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా /వి/
దేశంలో ఒక్క ప్రెస్మీట్ కూడా ఎదుర్కోలేని వాళ్లు ప్రపంచనేతలే కాదు, విశ్వగురువులౌతామని పొంకణాలు కొడుతారు. మణిపూర్ మంటల్లో కాలిపోతుంటే పట్టదు కానీ, దేశాల మధ్య సయోధ్య కుదురుస్తారంట.
మరి ఇటువంటి వారికి వేమన ఏమీ బుద్ధి చెప్పలేదా? అంటే, బాగానే చెప్పాడు. కానీ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే కదా.
ఆత్మశుద్ధిలేని యాచారమదియేల?
భాండశుద్ధిలేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా /వి/
ఆత్మశుద్ధి అంటే మనుష్యుల లోపల ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండటం. అయితే ఈ విషయం అందరికీ అర్థం కావాలి కనుక మురికిగా ఉన్న పాత్రలో వండిన వంట మనుష్యులు తింటే ఎంత ప్రమాదమో, ఆత్మ మురికిగా ఉన్నా అంతే ప్రమాదం. కలుషిత ఆహారం మనుష్యుల ప్రాణాలు తీసే, కలుషిత బుద్ధి ఉన్నవారు మిగతా మనుష్యులకు ప్రమాదకారులవుతారు. ఒకమారు వీరి బుద్ధి తెలిశాక వీరిని ప్రజలు దూరం పెట్టాలి. చిత్తం అన్నది మనిషి భావాలను ప్రతిబింబించే సాధనం. అందుకని మాటలు గొప్పగా చెప్పినా చిత్తశుద్ధి లేని వారు తమ మాటలనే పాటించరు. కనుక వీరితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.నిజానికి దాతృత్వ బుద్ధి ఉన్న వాళ్లే నాయకులవ్వాలి. అలా కాని పక్షంలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతాయి అని వేమన వివరించాడు.
లగంగపారుచుండు కదలని గతితోడ
మురికి కాల్వపారు మ్రోతతోడ
దాత యోర్చినట్లధముడోర్వగలేడు /వి/
మంచి మనిషికి నలుగురిని సంతోష పెట్టాలని ఉంటుంది. బలహీనులకు తగిన సహాయం అందిస్తాడు. మరి ఆ బుద్ధి నీచత్వము సంతరించుకున్న వాడికి ఇతరులకు సహాయం చేయాలన్న మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు అన్నది సమాధానం. అటువంటి వాడికి అధికారం కూడా వస్తే ఇక ప్రజలకు నరకం చూపిస్తాడు.
నాయకులను ఎన్నుకునే ప్రజలకు ఒక సందేశం కూడా ఇచ్చాడు మేధావి వేమన. దేశ ప్రజలకు సేవ చేయాలంటే కావాల్సినది పశుబలం కాదు. ఒక్క సరైన నాయకుడు. 1857 నుంచి భారత స్వాతంత్య్ర పోరాటం సాగినా ఎందరో నాయకులు త్యాగాలు చేసినా చివరకు మహాత్మాగాంధీ వచ్చాకే భారతదేశ స్వాతంత్య్రం సిద్ధించింది. అంటే ప్రజలు లక్షలు, కోట్లు ఉన్నా, వారిని నడిపే ధీశాలి ఒక నాయకుడు అవసరం.
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టెడేల?
చాటు పద్యమిలను చాలదా
ఒక్కటి? /వి/
తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలు ఎదురించి, ప్రజలను చైతన్యపర్చి, మేధావును ఏకతాటిపైకి చేర్చి, రాష్ర్టావతరణ సాధించిన నాయకుడు కేసీఆర్. దశాబ్ద కాలంలోనే రాష్ట్ర ముఖచిత్రా న్ని మార్చి వేసిన ఒక్క రత్నం లాంటి నాయకుడు చాలడా ప్రజలకు? ప్రలోభాలకు లొంగి దొంగరాళ్లను కొనుక్కొనే కంటే అభివృద్ధి చేసి చూపిన నాయకుడే కదా కావాలి… ఆలోచించండి.
-కనకదుర్గ దంటు