‘కదనాన శత్రువుల కుత్తుకల నవలీలనుత్తరించిన బలోన్మత్తులేనిన భూమివీరులకు కాణాచిరా
తెలంగాణ ధీరులకు మొగసాలరా’
‘అబలయని దేశమును కబళింప తలపడిన పర రాజులకు స్త్రీల పటు శౌర్యమును జూపి రాజ్య తంత్రము నడిపెరా తెలగాణ రాణి రుద్రమదేవిరా’ ఖమ్మం జిల్లా గోకినేపల్లి గ్రామంలో పుట్టిన సాయుధ కవి రావెళ్ల వెంకటరామారావు నుంచి జాలువారిన ఈ గేయం తొలిదశ తెలంగాణ ఉద్యమం కంటే ముందే అనేక సభల్లో మార్మోగింది. తెలంగాణ ప్రాంత సాంస్కృతిక ఉద్యమాలకు, ఉద్యమ చైతన్యానికి, ఉద్యమకారుల పౌరుషానికి నిలువెత్తు అస్తిత్వ చిత్రం ఈ గేయం. ఇప్పుడీ పాట భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావానికి అతికినట్లుగా సరిపోతుంది. ‘కదనాన శత్రువుల కుత్తుకల నవలీల’ అనే పల్లవితో ఆరంభమయ్యే ఈ గీతం తెలంగాణ వీరత్వాన్ని కీర్తించడమేకాదు, రణరంగంలో శత్రువుల కంఠాలను అలవోకగా నరికేసిన బలవంతులున్న భూమి మన తెలంగాణ అని స్పష్టం చేస్తుంది. వీరులకు మూలస్థానం, వీరయోధుల జన్మస్థానం అని తెలియజేస్తుంది.
‘అబలయని దేశమును కబళింప తలపడిన’ అనే చరణంతో కాకతీయ రాణిరుద్రమదేవి సాహసగాథను కవి చెప్పారు. తెలంగాణ మహిళ అబల కాదు సబల అని పేర్కొన్నారు. స్త్రీలనే చులకనభావం చూపే పొరుగు రాజులకు శౌర్య పరాక్రమాలనే కాదు, రాజ్యనిర్వహణలో సమర్థతకు నిదర్శనంగా రుద్రమదేవిని కవి తన గేయంలో చూపించారు. దుష్టపాలనతో చీకటి నింపే రాజ్యాధికారులను కూలదోసి బానిస సంకెళ్లను తెగ్గొటేందుకు ధర్మపోరాటం చేయాల్సిందేనని ఎలుగెత్తి చాటిన కవి రావెళ్ల వెంకటరామారావు. ప్రజలకు, ప్రాంతాలకు అన్యాయం జరిగితే.. వాటిపై పోరాడే సత్తా సామర్థ్యం, రాజనీతి, యుద్ధతంత్రం, వీరత్వం తెలంగాణ బిడ్డలకు ఉన్నవని రావెళ్ల నాడే తెటతెల్లం చేశారు. ఇప్పుడు నిఖార్సైన తెలంగాణ బిడ్డగా, తెలంగాణ విముక్తి కోసం పుష్కర కాలనికిపైగా ఉద్యమాలు నడిపి, ప్రాణాలను పణంగా పెట్టి పదవులను తృణపాయంగా వదలి చివరికి సమైక్య సంకెళ్ల నుంచి స్వరాష్ట్రం సాధించిన పోరాట వీరయోధుడు కేసీఆర్ దేశం కోసం అదే పంథాను ఎన్నుకున్నారు.
బీఆర్ఎస్ ఏర్పాటుచేసి.. ఇప్పటికే రణరంగంలో దూకిన కేసీఆర్, దేశాన్ని దోచుకుంటున్న శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఈ తరుణంలో ఖమ్మం గడ్డపై జరిగే సభ దేశ రాజకీయాల్లో నవశకానికి నాంది పలుకబోతున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణ నలుదిశలా తన ప్రాశస్థ్యాన్ని చాటుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే వినూ త్న ఆలోచన, విప్లవాత్మక పథకాలతో పసిమొగ్గ తెలంగాణ నేడు పరిఢవిల్లుతున్నది.
ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్, బీజేపీలకు దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో సరైన దృక్పథం లేదు. అమెరికా, చైనా, యూరప్, జర్మ నీ, జపాన్, సింగపూర్, వంటి దేశాల గొప్పతనం గురించి చెప్పుకోడమే తప్ప మన సక్కదనం మాత్రం కనిపించడం లేదు. దీనికితోడు ప్రస్తుతం దేశంలో రాజ్యమేలుతున్న మత మౌఢ్యం, ఆర్థిక వనరుల దోపిడీ, కార్పొరేట్ కంపెనీలకు కేంద్రం దాసోహమవుతున్నది. ప్రపంచదేశాల ముందు చతికిలపడి అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నది. వనరులున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నది. తెలంగాణ వికాసానికి అడుగడుగునా అడ్డుపడుతున్నది. ప్రశ్నించిన తెలంగాణ సమాజంపై స్వయంగా ప్రధానే అక్కసు గక్కుతున్నారు. పసికూన అయిన తెలంగాణపై కేంద్రం దురాగతాలు రాస్తే రామాయణం.. వింటే మాహాభారతం. దేశంలో చూస్తే భారత్‌లో 130 కోట్లకుపైగా మానవ సంపంద ఉంది. 40 కోట్ల ఎకరాల భూమికి నీళ్లివ్వడానికి గల నీటి వనరులున్నాయి. కరెంటు ఉన్నది. అయినా ఎక్కడచూసినా వెనుకబాటుతనమే. దీనికి కారణాలను చూస్తే రాజకీయ సంకల్పం కరువైనందువల్లే ఈ దుస్థితి అన్నది స్పష్టమవుతున్నది.
మౌలిక మార్పు బీఆర్ఎస్ ద్వారానే సాధ్యం: దేశంలో స్ట్రక్చరల్ చేంజెస్ అంటే వ్యవస్థలో గుణాత్మక, మౌలికమార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. దేశంలో నేటికి బ్రిటిష్ కాలం నాటి కేంద్రీకృత విధానాలే అమలవుతున్నాయి. సమాఖ్యస్ఫూర్తి దెబ్బతింటున్నది. రాష్ర్టాల అవసరాలకు భిన్నంగా కేంద్రం విధానాలు ఉంటున్నాయి. రాష్ర్టాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తున్నది. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగంతోపాటు న్యాయవస్థలో మార్పులు రావాలి. కొత్త ఆర్థిక విధానాలు కావాలి. దేశంలో కొత్త వ్యవసాయ విధానం అమల్లోకి రావాలి. ఇది బీఆర్ఎస్ ద్వారానే సాధ్యమవుతుంది. నాడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కో వ్యక్తి, పార్టీని కలసి అందరి మద్దతు కూడగట్టిన కేసీఆర్, ఇప్పుడు దేశం దాస్య శృంఖలాలు తెంపడానికి అదే పంథాలో ముందుకువెళ్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు కదనరంగంలో ఖమ్మం గడ్డ వేదికగా శంఖం పూరిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల గుత్తాధిపత్యాన్ని బద్ధలు కొట్టి, బంగారు భారతం నిర్మాణం చేసుకుందామనే పిలుపుతో ముందుకుసాగుతున్న కేసీఆర్ వైపు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త: కరీంనగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి)
-కడపత్రి ప్రకాశ్‌రావు
80966 77022