గుజరాత్, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు, కొన్ని ఉప ఎన్నికల ఫలితాలు చెబుతున్న వాస్తవాలు. మోదీ సర్వశక్తిమంతుడూ కాదు. బీజేపీ అన్య పార్టీల కన్నా అతీతమైనది, అజేయమైనదీ కాదు. ప్రతిపక్షాల బలహీనతే బీజేపీ బలం. బీజేపీ రాజేసిన మత విభజన దేశానికి చేటైనా, బీజేపీకి శ్రీరామరక్ష. బీజేపీ పాలనా సుడిగుండం నుంచి దేశాన్ని కాపాడుతానన్న భరోసాను ప్రజలకు కాంగ్రెస్ ఇవ్వలేకపోతున్నది. ఈ లోటుపాట్లను సవరించుకొని సంఘటితంగా పోరాడితేనే బీజేపీని జయించగలరని బీజేపీయేతర పార్టీలను ప్రస్తుత ఎన్నికలు హెచ్చరిస్తున్నాయి.
బీజేపీపై పోరాటానికి ప్రతిపక్షాలు, గుర్తుంచుకోవలసిన అంశాలు
మోదీని ఢీకొట్టగల, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని చూపగల ప్రధాన సవాలు దారు కావాలి. 2. ప్రధాన సవాలుదారు నిర్దేశిస్తున్న మార్గం, ఇచ్చే సందేశం కచ్చితంగా ప్రగతిదాయకం, ఆచరణీయమన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలి 3. దేశ భద్రత, ప్రగతి కోసం ‘బీజేపీ ముక్త భార త్’ లక్ష్యాన్ని, అందుకు సంఘటిత పోరా ట ఆవశ్యకతను విశదీకరిస్తూ ప్రతిపక్ష పార్టీలను; బీజేపీకి ‘బీ’ టీములుగా అపఖ్యాతి పాలౌతున్న పార్టీలనూ చైతన్యవంతం చేసే కృషిని ప్రారంభించాలి. ఈ వాస్తవాలను గుర్తించి, ఆ దిశగా సంసిద్ధుడయ్యే కథా నాయకుని కోసం ఆశగా ఎదురు చూ స్తున్న భారతీయులకు ‘ఆశాజ్యోతి’లా అగుపించాడు కేసీఆర్! సదరు లక్ష్య సాధనకు ‘బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని’ ‘భానోదయం’గా భావిస్తున్నారు భారతీయులు! కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు కూడ ప్రజల ప్రగతి, దేశభద్రత గొప్పవన్న సత్యాన్ని గుర్తించి సంఘటిత పోరాటాని కి సిద్ధమవ్వాలి. ఇది చారిత్రక అవసరం.
బీజేపీయేతర పార్టీల విచ్ఛిన్నానికి ‘ఈ డీ-ఐటీ-సీబీఐ’ అనే త్రిశూలాన్ని ధరించింది బీజేపీ అంటున్నారు విశ్లేషకులు! అందుకే దేశభద్రత కోసమే గాదు. తమ తమ పార్టీల ఉనికిని కాపాడుకోవడానికి కూడా సంఘటిత పోరాటమే శరణ్యం. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్క పార్టీ గుర్తించాలి.
మోదీ, బీజేపీ అజేయులు కాదు: అందుకు నిదర్శనాలివే. గుజరాత్లో మోదీ హవా విజృంభించింది. అదే, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీలో చతికిలబడింది. గుజరాత్లో 49 మంది సిట్టింగులకు టికెట్‌ను తిరస్కరించినా, కొత్తగా చేరిన 10 మంది కాంగ్రెస్ వాళ్ళకు ఇచ్చినా సరే, అసంతృప్తి తలెత్తకుండా అదుపుచేయగలిగారు మోదీ. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లో విస్తృత ప్రచారం చేసినా, తిరుగుబాటు దార్లను స్వయంగా కలిసి ప్రయత్నించినా, అదుపు చేయలేకపోయారు. ‘అభ్యర్థిని కాదు, నన్ను చూసి ఓటేయమంటూ’ చేతులు జోడించి వేడుకున్నారు మోదీ. అయినా తిరస్కరించారు ప్రజలు. హిమాచల్‌ప్రదేశ్ కన్నా ఎక్కువ ఓటర్లున్న ఢిల్లీ కార్పొరేషన్‌లోనూ చతికిలబడింది బీజేపీ. 9 ఉప ఎన్నికలకు గాను ఏడింటిలో ఓడింది బీజేపీ.
ప్రతిపక్షాల బలహీనతే, బీజేపీ బలం : అందుకు నిదర్శనాలివిగో..1. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలో కొన్ని పార్టీలు ఓట్లు చీల్చడం ద్వారా కాంగ్రెస్ ఓటమికి, బీజేపీ గెలుపునకు తోడ్పడ్డారు. 2. ఆదివాసీల ఓట్లు చీల్చటం ద్వారా బీఎస్పీ, ఆప్ కాంగ్రెస్ ఓటమికి, మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలుపునకు దోహదపడ్డాయి. 3. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే, బీజేపీని ధిక్కరించటానికి మాకు ధైర్యం ఉండేది. ఓడిపోయే ఈ పార్టీలకు ఓటేసి బీజేపీ నేతల ఆగ్రహానికి బలి కావటమెందుకని, బీజేపీకే ఓటేశామని ముస్లిం ఓటర్లు చెప్పటం ఇంకో నిదర్శనం!
‘మత విభజనే బీజేపీకి శ్రీరామ రక్ష’: అంటూ, అందుకు నిదర్శనాలనూ చూపు తున్నారు విశ్లేషకులు 1. మొత్తం 182 స్థానాల్లో ఒక్క ముస్లింకూ టికెట్టివ్వకున్నా ముస్లిం ఓట్లు అత్యధికం (45%)గా ఉన్న 19 నియోజక వర్గాలలో 17 గెల్చుకున్నది బీజేపీ. 2. ఆదివాసీలను దెబ్బతీసే అటవీ చట్టాలను తెచ్చినా 27 ఆదివాసీ నియోజక వర్గాలలో 23 గెల్చుకున్నది. 3. బిల్కిన్బానో కేసులో నిందితులను క్షమాభిక్ష పేరిట విడిపించటమేగాక, వాళ్ళను దేశభక్తులుగా పేర్కొన్న బీజేపీ ఎంఎల్ఏ సీకే రవుల్జీ ఏడవసారి భారీ మెజారిటీతో గెలిచాడు. 4. కేబుల్ బ్రిడ్జి కూలి, 140 మందిని బలి తీసుకున్న మోర్బీలోనూ రికార్డు స్థాయి మెజారిటీని సాధించింది. ‘మత విద్వేష భావజాలం’ ఎంతటి శక్తివంతమైనదో, బీజేపీ విజయాలు చాటి చెబుతున్నయ్!
దేశ సంపదను భారీగా గుజరాత్‌కు తరలించటం: బీజేపీ విజయానికి మరో కార ణం అని సోదాహరణంగా చెబుతున్నారు పరిశీలకులు. 19-5-21 నుంచి 20-10-22 వరకు కేవలం 17 నెలల్లో, వివిధ ప్రాజెక్టుల రూపంలో గుజరాత్‌కు మోదీ తరలించిన నిధులు రూ.1,37,655
కోట్లు. ఉదా: ఖేల్ ఇండియా నిధుల్లో గుజరాత్‌కు రూ.608 కోట్లు కట్టబెట్టిన మోదీ, తెలంగాణాకు రూ.24 కోట్లు విదిల్చారు. అంతేకాదు తెలంగాణకు కేటాయించా ల్సిన ‘ఖాజీపేట రైల్వే కోచ్’ ఫ్యాక్టరీని, హైదరాబాదుకొచ్చిన ‘ఆయుష్ గ్లోబల్ సెంటర్’ను గుజరాత్‌కు తరలించారు మోదీ. అలాగే మహారాష్ట్ర నుంచి మరికొన్ని ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించారాయన.
అసలు సిసలైన హిందువు, దేశభక్తుడు, కేసీఆర్! ‘సముద్రంలో కలిసిన నదీనదాల జలమంతా- సముద్ర జలమే’- భారత దేశంలో నివసిస్తున్న, కుల, మత, జాతుల వారంతా భారతీయులే! భారతీయులం దరూ సహోదరులే అని మనసా, వాచా, కర్మణా విశ్వసిస్తున్న పరిణిత వ్యక్తి కేసీఆర్. అందుకే భారతీయులందరి ప్రగతి కోసం పరిశ్రమించేందుకు సంసిద్ధులయ్యారాయన. అందువల్లనే కుల, మత, ప్రాంతా ల కతీతంగా ‘దేశ్‌కీ నేతా కేసీఆర్’ అంటూ భారతీయులంతా ఆయనను గౌరవంగా స్వాగతిస్తున్నారు!
తథాస్తు! భరతమాతకు శుభమస్తు!
-పాతూరి వెంకటేశ్వర రావు
98490 81889