గత నవంబర్ 12న, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తూ, ప్రధాని మోదీ తన ప్రసంగంలో ‘సింగరేణిని ప్రైవేటీకరించబోము. సింగరేణిలో తెలంగాణ రాష్ట్ర వాటా 51%, కేంద్ర వాటా 49% ఉన్నది. కేంద్రం ప్రైవేటీకరించే అవకాశమే లేదు’ అని చెప్పారు. ఇలా బహిరంగ వేదిక మీద చెప్పిన భారత ప్రధాని, తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని మరచిపోయారా! లేక అబద్ధం చెప్పారా! అంటే అబద్ధమే చెప్పారని తేటతెల్లమవుతున్నది.
2021, డిసెంబర్ 13న పార్లమెంట్ క్వశ్చన్ అవర్‌లో తెలంగాణ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిం గరేణిలోని నాలుగు బ్లాకుల వేలం గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి జవాబిస్తూ తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపేది లేదన్నారు. కావాలంటే సింగరేణి కూడా వేలంలో పాల్గొనవచ్చు అని చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు డిసెంబర్ 9,10,11తేదీలలో చేసిన సమ్మెను పార్లమెంట్ వేదికగా అవమానించారు.
టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ సమ్మెకు పిలుపునిచ్చినప్పటికీ, మిగతా జాతీ య సంఘాలతో కలిపి ముఖ్యంగా బీజేపీ భావజాలం గల బీఎంఎస్ కూడా సమ్మెలో పాల్గొన్నది. ఈ విషయాలు మన గౌరవ ప్రధానికి తెలియనివి కావు. కానీ రామగుండం సభలో సింగరేణి ప్రైవేటీకరణ జరగదు అని చెప్పడం ఇక్కడ శోచనీయం.
2021 డిసెంబర్ 14న తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులు 1)సత్తుపల్లి, 2)కోయగూడెం, 3)శ్రావణపల్లి, 4)కళ్యాణిఖని బ్లాక్ -6లను కార్మికులు సమ్మె చేసినా వినకుండా కేంద్రం వేలానికి పెట్టింది. అదృష్టవశాత్తు మూడు బ్లాకుల వేలంలో ఔత్సాహిక కాంట్రాక్టర్లు ఎవరూ పాల్గొనలేదు. మరో బ్లాక్ వేలం లో ఒక్కరు పాల్గొన్నప్పటికీ అదీ నిబంధనలోకి రాక పోవడంతో ఆ టెండర్ పక్రియ ముగిసి సింగరేణి కార్మికులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. మరొక సా రి టెండర్లు పిలవాలని కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణ యం కూడా కార్మికులను ఆందోళనకు గురిచేసింది.
కోల్‌బెల్టు ఏరియాలో మెజారిటీ కార్మికుల పిల్ల లు ఐటీఐ, డిప్లమా, బీటెక్ లాంటి చదువులు చదవటానికి మొగ్గు చూపుతున్నారు. డిప్లొమా కాలేజీ కూడా సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తుండటం గమనించవచ్చు. సింగరేణి యాజమాన్యం కూడా కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం కల్పించి విద్యార్థులను సాంకేతిక విద్య వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నది. ఓపెన్ కాస్ట్‌ల వల్ల ఇప్పటికే సింగరేణిలో కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. కొన్ని ఏరియాలు ఓపెన్ కాస్ట్‌ల వల్ల బొందల గడ్డలుగా మారిపోతూ, అవి కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నా యి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అన్‌ఫిట్ కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించటంతో మళ్ళీ సింగరేణి గనులు యువరక్తం తో కళకళ లాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ల వల్ల డిప్లొమా, ఇంజనీరింగ్ చదివిన పిల్లలకు కోల్‌బెల్ట్ ఏరియాలో ఉద్యోగాలు వచ్చాయి. ‘ఇది ఇలాగే కొనసాగితే పిల్లల జీవితాలు బాగుంటాయి’ అని కార్మికులు కలలు కన్నారు. కొత్త బాయిలు ఒపెనవుతాయి అని ఎదురుచూస్తున్న సమయంలో కేంద్రం బొగ్గు బ్లాకులను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే ప్రక్రియ మొదలు పెట్టడంతో కార్మికుల గుండెల్లో పెద్ద బండరాయి పడ్డట్టు అయింది. ఈ విధంగా ప్రైవేటీకరణ జరిగితే తమ పిల్లల భవిష్యత్ ఎలా అనే భయం వారిని వెంటాడుతున్నది.
నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానికి లేఖ వ్రాసినా కూడా కేంద్రం స్పందించలేదు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రధాని ప్రకటించి నెల రోజులు కూడా గడవకముందే, బెంగుళూరు లో జరిగిన 14 బొగ్గు బ్లాకుల వేలంలో తెలంగాణలోని నాలుగు బ్లాకులను చేర్చడం మోసపూరితం!
తమ ప్రాణాలను పణంగా పెట్టి కార్మికులు రాష్ర్టానికి వెలుగును ఇవ్వడమే కాకుండా లాభాలను కూ డా ఇస్తున్నారు. వారి కష్టం కొలవడానికి ఈ భూమ్మీ ద కొలమానమే లేదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, సకల జనుల సమ్మెలో పాల్గొన్న చరిత్ర కార్మికులది. ఇప్పుడు మరోసారి సింగరేణి కార్మికులు ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటూ తేల్చి చెబుతున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నారు.
(వ్యాసకర్త: సామాజిక విశ్లేషకులు)
-కె. శ్యామ్
9398004592