తెలంగాణ రాష్ట్రమవుడుతోనే టీఆర్ఎస్ను కాంగ్రెస్ మింగజూశింది. కొత్త రాష్ట్రం మీద పెత్తనానికి ఢిల్లీ ఎత్తులకు పోయింది. అది అధర్మం, తప్పుడు బ్యారం కాబట్టి దాని పప్పులు ఉడుకనీయలేదు ముఖ్యమంత్రి కేసీఆర్. సోనియాగాంధీతోనే కయ్యమా? అంటే, ఏ ఫో ఎవరైతేందని బాజాప్త నిటారుగ నిలవడ్డరు. తెలంగాణే పంచ ప్రాణాలుగా జనం గుండెల్లో ఉన్న టీఆర్ఎస్ను తొలి పొద్దులోనే నూతిలోకి తొయ్యబోయిన కాంగ్రెస్‌కే ఈడ నూకలు చెల్లినంత పనైంది.
కోటి ఆశల కొత్త రాష్ట్రంల పాలన మీద దృష్టి పెడుతుండగనే రెండు కండ్ల సిద్ధాంతుడు చంద్రబాబు కన్ను వడ్డది. ఒక ముఖ్యమంత్రిగా తన రాష్ట్రం తాను చూసుకొనుడు పోయి తెలంగాణ కూ డా కావాల్నని పగటి కలలు కన్నడు. అత్యాశకు పో యిండు. రేవంతు అనే తెలంగాణీయుడి భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణ సర్కారునే కాల్వబోయిండు. ఆఖరికి ఆ కుతంత్రపు తుపాకీ ఉల్టా తిరిగి తనకే తూటా దిగినంత పనాయే. ఆ దెబ్బకు ఆగమైన చంద్రబాబు ఏక్ ధమ్ మూట ముల్లె సర్దుకొని తన రాష్ట్రం తను బిస్తర్ కట్టిండు.
కేసీఆర్ ప్రభుత్వంతో పెట్టుకోబోయి మొదట్ల సోనియా-కాంగ్రెస్, అటెన్క చంద్రబాబు-టీడీపీలకు ఎట్ల ఉసురు
తగిలిందో బీజేపీ-న.షా (నరేంద్ర మోదీ, అమిత్ షా జోడీ)లకు తెల్వదని మనం అనుకోలేం. మంచికి తలవంచి, చెడును చీల్చి చెండాడే కేసీఆర్ ఏలుతున్న తెలంగాణ గడ్డ మీదనే అడ్డంగా దొరికిన వారి మనుషుల రోజుకో సుబూతు బైటపడుతున్నది.
కేసీఆర్‌కు తెలంగాణల మూడోసారి అధికారం ఖాయమని రూడీ కాంగనే, కేసీఆర్ సర్కారును ఎట్లనన్న కూలగొట్టాలెనని దేశంల బీఆర్ఎస్కు పలుకుబడి పెరుగకుండ దిక్కుమాలిన ప్లాన్ ఏయాలె అని దుర్బుద్ధి పుట్టిన ఢిల్లీ కమ్ నాగపూర్ దిగుమతి బాప తు ఆ ముగ్గురు దళారులకు దేవుడు గట్టిగనె బుద్ధి చెప్పిండు. నోటితో సుద్దులు జెప్పుకుంటనె, చేష్టలతో అపాయం తలపెట్టే బీజేపీ-న.షా.లను కేసీఆర్ అయెపట్టికె తట్టుకుంటున్నడు. నువద్దెకు మన తెలంగాణకు సెంట్రల్ నుంచి ఏ ఒక్క ఫాయిదా రాకున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేండ్లు ఓపిక పట్టిన్రు. మస్తు మర్యాద, ప్రేమ, మద్దతు పంచిన్రు. కనీ, కడుపు నిండా ఇసం పెట్టుకొని గిట్ల కుట్రలకు దిగితే ఎట్ల ఊకుంటరు? గందుకే ఉగ్ర నరసింహుడు అయి ండు. ఇప్పుడు బీజేపీ అసలు రంగు లోకానికి చూపుతున్నరు.
దేశంల సుత బీజేపీ బిస్తర్ కట్టేలా తెలంగాణ హుషారుతనం తక్కిన రాష్ర్టాలకు పాకుతున్నది. సార్థక నామధేయుడిగా తెలంగాణ ప్రజలకు చల్లని చంద్రుడు కేసీఆర్. ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబమూ కడుపు నిండ తిండి, కంటి నిండ నిద్ర కోసం నియ్యత్గ తపిస్తరు కేసీఆర్. మన రాష్ట్రం బాగుండాలె. మన దేశమూ మంచిగ ఉండాలె అని ఆరాటపడెటోళ్ళలో కేసీఆర్ తర్వాతనే ఎవలైనా. 2001 సంది మొదలువెడితె ఇప్పటికీ సుత రకరకాల కుట్ర లు, కుతంత్రాలను కేసీఆర్ కాబట్టే తిప్పి కొడుతున్న రు. మన రాష్ర్టాన్ని ఎట్లనైతే కాపాడుతున్నరో, దేశాన్ని సుత అట్లనె కాపాడెతందుకు బైలెల్లిన కేసీఆర్ దమ్ము ను ఓర్వలేక ఢోకబాజి భాగోతం కట్టిన్రు. జనం గుండెల్లో కొలువైన కేసీఆర్‌ను ఎవరూ ఏమీ చేయలే రు. చేయకూడనిది అంతా చేసి, ఇంకా పోయి పోయి ఇమానాలు, ప్రమాణాలు చేస్తరా. గుజరాత్ల ఒక బొమ్మ నిలవెడితేనే బొంబాట్ చేసుకున్నరు. ఈడ ఏకంగా ప్రపంచమే మెచ్చే గుడి, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టిన్రు. బడి నిలిపిన్రు. దవాఖాన తెచ్చిన్రు. దళితులను లక్షాధికారులను చేస్తున్నరు.
మన తెలంగాణల ఎంతో బుద్ధిమంతుల్లో ఒకరైన ప్రొఫెసర్ నాగేశ్వర్ మొన్నటికి మొన్న ఏమన్నరు? నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి, నా మీద రాజద్రోహం కేసు పడలె…అని అన్నరంటే, ఈడ ప్రజాస్వామ్యం ఎట్లా గుబాళిస్తున్నదో చెప్పడానికి ఇదొక్క టి సాలదా? అంతెందుకు? కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా దినాం తన పేపరు, టీవీ చానల్ల ఏదో ఒక పుల్ల వెట్టే రాధాకృష్ణ కూడా.. ‘తెలంగాణ అస్తిత్వానికి ఎవరు హాని తలపెట్టినా కేసీఆర్ ఊరుకోరు’ అనే మాట అనేకమార్లు చెప్పక తప్పలేదు.
కేసీఆర్ ఒక జన జీవన గ్రంథం. ప్రజాస్వామ్య రాజకీయాలకు పెద్ద బాలశిక్ష. కేసీఆర్-తెలంగాణ, తెలంగాణ-కేసీఆర్.. విడదీయరాని బంధానికి ఇదొక మేలిమి గుర్తు. నిన్న, ఇయ్యాల, రేపూ మన రాష్ర్టానికి ఎట్లనైతే చంద్రశేఖరుడు రక్షనో, ముందు ముందు దేశానికి కూడ చంద్రశేఖరుడే రక్ష అనేది తెల్వనీకి ఇంకా ఎంతో టైం బట్టదు.
(వ్యాసకర్త: ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
-ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384