కొలీజియం వ్యవస్థపై దేశ ప్రజానీకం అసంతృప్తిగా ఉన్నదని, న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన అంశమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్య కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నది. రాజ్యాంగబద్ధ సంస్థల పనితీరులోకి కేంద్రం చొరబాటు ధోరణిని కూడా ఇది తేటతెల్లం చేస్తున్నది. ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను, విభాగాలను యథేచ్ఛగా మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటిని స్వీకరించి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన కేంద్రం దీనికి పూర్తి విరుద్ధంగా మరింత పెడసరి వైఖరిని ప్రదర్శిస్తున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించి, గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించలేదు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఈసీ ఇలా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కూడా టీఆర్ఎస్ చిహ్నమైన కారు గుర్తును పోలిన గుర్తులకు ఈసీ అనుమతించటం వివాదాస్పదమవుతున్నది. ఇక్కడ కూడా బీజేపీ కోసమేనని టీఆర్ఎస్ నేతలు ఆరోపించటం గమనార్హం. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈసీని కేంద్ర పాలకులు నియంత్రించటం దారుణం.
రాజ్యాంగకర్తలు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల అధికార విభజన చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన ఈ వ్యవస్థల పనితీరు ఈ 75 ఏండ్లలో ఆశించిన స్థాయిలో లేనప్పటికీ ప్రజాస్వామ్యం పాదుకోవడంలో, భిన్న సంస్కృతులు, భాషలు, మతాలు, కులాలతో కూడిన సువిశాల దేశాన్ని ఒకటిగా ఉంచటంలో కీలకమైన పాత్ర పోషించాయి. మూడవ ప్రపంచ దేశాలు సైనిక పాలనలో, ఏకపార్టీ నిరంకుశ వ్యవస్థలలో మగ్గుతున్న కాలంలో మన దేశం ప్రజాస్వామ్య బాటలో పయనించి అంతర్జాతీయంగా గౌరవాన్ని పొందుతున్నది. ప్రజాస్వామ్యం, సమాఖ్యతత్వం, లౌకిక విధానం. వీటికితోడు స్వతంత్ర న్యాయవ్యవస్థ, మీడియా, ఎన్నికల సంఘం, చైతన్యవంతమైన పౌర సమాజం వంటివి భారత్ ప్రతిష్ఠను ప్రపంచదేశాల్లో పెంచాయి.
మోదీ అధికారం చేపట్టిన తర్వాత స్వతంత్ర వ్యవస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు నిర్వీర్యమవుతున్నాయి. తమకు అనుకూలంగా వ్యవహరించేలా వాటిపై ప్రభుత్వమే ఒత్తిడి తెస్తున్నది. ఏ వ్యవస్థా స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితులను తీసుకొచ్చింది. న్యాయవ్యవస్థనూ చెప్పుచేతల్లో ఉంచుకోవాలన్న కేంద్రం కోరిక న్యాయశాఖ మంత్రి మాటల్లో ప్రతిఫలిస్తున్నది. భారత్ ఇన్నేండ్లలో సాధించిన పురోగతి అంతా మోదీ హయాంలో తుడిచిపెట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు, సంస్థలు ముందుకొచ్చి నిరంకుశ పోకడల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.