మోదీ ఎనిమిదేండ్ల పాలనలో దేశంలో మున్నెన్నడూ లేని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. క్షీణిస్తున్న రూపాయి విలువ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల ఆహారభద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. దేశం అప్పుల ఊబిలో కూరుకొని పోతున్నది. 2022-23 సంవత్సరానికి దేశం మీదున్న అప్పు రూ.155 లక్షల కోట్లకు చేరుకొని జీడీపీలో అప్పుల వాటా 60.2 శాతానికి పెరిగిపోవడం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తున్నది.
అంతర్జాతీయంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.81కి చేరుకున్న తరుణంలో దేశం లో ఈ ప్రభావం అన్ని రంగాల మీద పడుతున్నది. అన్ని వస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఈ ప్రభావం నేరుగా దేశ పారిశ్రామిక రంగం మీద పడుతున్నది. ఇది చాలదన్నట్లు జీఎస్టీ పేరుతో కేంద్రం సామాన్యునిపై భారం మోపుతున్నది. ఎన్నడూ లేని విధంగా పాలఉత్పత్తులు మొదలుకొని, నిత్యావసర సరకులన్నింటిపై పన్ను పోటుతో దాడి చేస్తున్నది. దీంతో సామాన్యుడి సగటు జీవితం దుర్భరంగా మారింది. బీజేపీ ముందుచూపు లేని పాలన వల్ల మన దేశం అనేక సూచీల్లో అంతర్జాతీయంగా అట్టడుగు స్థానం లో ఉన్నది. ఇది దేశ ప్రతిష్ఠకు భంగకరంగా మారింది.
నిత్యావసరాల ధరలతో పాటు, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంటగ్యాస్ (సిలిండర్) కోసం 2018-19లో రూ. 37,209 కోట్లు సబ్సిడీగా కేటాయించిన మోదీ సర్కార్.. 2019-20లో రూ. 24,172 కోట్లకు కుదించింది. ఇదే క్రమంలో తగ్గిస్తూ 2021-22 నాటికి 242 కోట్లు మాత్రమే కేటాయించింది. గ్యాస్‌పై సబ్సిడీని రూ.37 వేల కోట్ల నుంచి 242 కోట్లకు తగ్గించి ఒక పద్ధతి ప్రకారం సబ్సిడీకి మంగళం పాడింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,105లకు చేరుకున్నది. ఇదే బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గ్యాస్ సిలిండర్ ధర రూ.432 ఉన్నపుడు ధరల పెరుగుదల మీద ఆందోళనల పేరిట మొసలి కన్నీరు కార్చటం గమనార్హం.
ఎనమిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో గణనీయ పురోగతి సాధించింది. నేడు దేశానికే అన్నం పెట్టె రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. కానీ మోదీ కక్షపూరిత ధోరణితో రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణకు మోకాలడ్డుతున్నాడు. మోదీ సర్కార్ వైఫల్యాలపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ చౌకబారు రాజకీయాలు చేస్తున్నది.
దేశాన్ని భ్రష్టుపట్టించింది చాలదన్నట్లు పురోగమిస్తున్న తెలంగాణ రాష్ర్టాన్ని కూడా కష్టాల పాలు చేయాలని బీజేపీ చూస్తున్నది. చేరికల పేరిట రాష్ట్రంలో చెత్త రాజకీయం చేస్తున్నది. టీఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. కేసీఆర్ ఊపిరిపోసిన ఈ జెండా అనుకున్న లక్ష్యాన్ని సాధించి, తెలంగాణ పునర్నిర్మాణం కోసం కూడా అదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నది. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ.. తెలంగాణ ద్రోహులను, విశ్వాస ఘాతకులను అడ్డంపెట్టుకొని రాష్ట్రంలో మకిలి రాజకీయం చేస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏదీ కూడా తెలంగాణ సాధిస్తున్న పురోగతికి దరిదాపుల్లో కూడా లేదు. కేంద్రం నుంచి బీజేపీ పాలిత రాష్ర్టాలకు దండిగా నిధులు వస్తున్నప్పటికీ అప్పుల విషయంలో మొదటి ఐదు స్థానాలు బీజేపీ పాలిత రాష్ర్టాలవే. అవి.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్.
తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులు రాష్ట్రంలో సంపద పెరగడానికి దోహదపడ్డాయి. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ సంస్కరణలు వ్యవసాయ రంగానికి జవజీవాలు తీసుకొచ్చాయి. కానీ, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సామాన్య ప్రజలకు ఒరిగిన ప్రయోజనం శూన్యం. ఈ ఎనిమిదేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థకి ఊతమిస్తున్న నాలుగు రాష్ర్టాల్లో ఒకటిగా నిలువటం తెలంగాణ సాధించిన విజయం. ఈ నేపథ్యంలోనే దేశంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను సరిచేయటానికి కేసీఆర్ రంగంలోకి దిగారు. తెలంగాణ సాధించిన విజయం స్ఫూర్తితో జాతీయస్థాయిలో ఒక ప్రత్యామ్నాయం కోసం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇదే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది. దీంతోనే వారు కుటిల రాజకీయాలు చేస్తున్నారు. సంస్కారం మరిచి నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు.
మోదీ సర్కారు వైఫల్యాల కారణంగా అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలన్న ప్రశ్నకు ఏ ఒక్క బీజేపీ నేత దగ్గర సమాధానం ఉండదు. కానీ టీఆర్ఎస్. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ అభివృద్ధి కోసం పని చేసే పార్టీ. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎల్లప్పుడూ సురక్షితంగానే ఉంటుంది. చైతన్యం పుణికి పుచ్చుకున్న గడ్డ తెలంగాణ. ఇక్కడ చిల్లరమల్లర రాజకీయాలకు స్థానం లేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ గుజరాత్ బానిసలు పన్నుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరికి రాజకీయంగా సమాధి కట్టడం ఖాయం.
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూల్చి, దొడ్డిదారిన అధికారం చేపట్టిన బీజేపీ అనైతిక రాజకీయాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు. వారి ఆధిపత్య కపట రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు వస్తున్నాయి. నరేంద్ర మోదీ దురహంకారాన్ని పాతర వేసే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి త్వరలోనే ఉప్పెనలా యావత్ భారతదేశాన్ని ఆవరిస్తుంది. మత రాజకీయం మట్టిపాలు అవుతుంది.
(వ్యాసకర్త: బాల్క సుమన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే)