ఒక ప్రాంతీయ ఆకాంక్షల నేపథ్యంలో చూసినప్పుడు తెలంగాణ విషయంలో కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకులే ప్రజల ఆశలను నెరవేరుస్తారు. రాష్ట్ర, దేశాభివృద్ధే ఎజెండాగా అడుగులు వేస్తారు.
ఇది చరిత్ర చెప్తున్న సత్యం. అందుకు సజీవసాక్ష్యం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాదు, సాధించిన తెలంగాణను చక్కదిద్దుతున్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యాన్ని అధిగమించినట్లు, ఒక్కో రంగాన్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు.
ఉద్యమనేత కేసీఆర్ అపర రాజకీయ చాణక్యుడు. ఆయనకు తెలంగాణ అన్నా, రాష్ట్ర ప్రజలన్నా అపారమమకారం. అందుకే ప్రజలు మెచ్చే పాలనను అందిస్తు న్నారు. కాబట్టి రెండోసారి కూడా రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌కే పట్టం గట్టారు. ఇది ప్రజలంటే పట్టని, గిట్టని ప్రతిపక్ష నాయకులకు రుచించడం లేదు. వారు కేవలం అధికారం కోసం ఎనిమిదేండ్లుగా ఆరాటపడుతున్నారు. కానీ అధికారం ఊరికే రాదు కదా? అధికారం కోసం తెలంగాణ లో నానా తంటాలు పడుతున్నారు. పరుగులు తీస్తున్నారు. ఈ పరుగుల వెనుక దాగి ఉన్న నిజమేంటో తెలుసుకోలేని స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. అందులో భాగంగానే ‘వచ్చెరా.. పాయెరా..’ అనే హడావుడి మొదలైంది. మహబూబ్‌నగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఏర్పాటైన సభ నుంచి మొదలు, వరంగల్‌లో ‘రైతు సంఘర్షణ సభ’ పేరుతో కాంగ్రెస్ ఏర్పాటుచేసిన సభ దాకా అంతా అధికార దాహమే. రాహుల్‌ను బలవంతంగా రప్పించడం అధికారదాహం తప్ప మరేం కాదు. ఇక ఈ సభలు చాలవన్నట్లు రాష్ట్రం లో ఏవో విపత్తులు వచ్చినట్లు, ఆ విపత్తుల్లో రాష్ట్రం మునిగిపోతున్నట్లు పాదయాత్రలు! సుభిక్షంగా వర్ధిల్లుతున్న ప్రజలకు ప్రతిపక్షాల పాదయాత్రలు ప్రజల్లో ఒకింత విసుగు తెప్పిస్తున్నాయి.
‘మొరిగే కుక్క కరవద’నే సామెత సభలు పెడుతున్న నేతలకు, పాదయాత్రలు చేస్తున్న నాయకులకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ‘పసలేని నాయకులకు పాకులాటలెక్కువ’ అన్నట్లు విషయం లేని ఈ నాయకులకు విర్రవీగడం కూడా ఎక్కువే. ఈ హడావుడి చేసే నాయకులకు అసలు విషయంపై అవగాహన ఉండదు. రాష్ర్టాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం తపన ఉండదు. వాళ్లకు కావాల్సిందల్లా అధికారం.., అధికారం. అందుకే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌పై దుర్భాషలాడుతుంటారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇంకా విషాదమేమంటే వీరందరి వల్లమాలిన ప్రేమ ఎవరిపైనా అంటే ‘రైతు’పైనే. రైతును ఆసరాగా చేసుకొని నాటకాలాడటం వీరికి అలవాటైపోయింది.
ప్రతిపక్షాలు ‘రైతు’నే కేంద్రంగా ఎందుకు తీసుకుంటున్నాయంటే.. కేసీఆర్ నాయకత్వంలో రైతు అనుకూల విధానాలతో తెలంగాణ దేశానికే దిక్సూచి అయ్యింది. అలాంటి పరిస్థితుల్లో ఆ రైతులను రెచ్చగొట్టి, తప్పుదోవ పట్టించి రైతులను తమ వైపు తిప్పుకోవడానికే ప్రతిపక్షాలు, కేంద్రంలోని అధికార బీజేపీ కుప్పిగంతులు, వాళ్లు ఆడుతున్న ఈ డ్రామా. ఈ డ్రామాలకు తెలంగాణ రైతు మోసపోయే పరిస్థితి లేదు. రైతు మీద ప్రేమ ఉంటే వారి కోసం బీజేపీ, కాంగ్రెస్‌లు ఏం చేశాయో వాళ్లు ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లోనే చెప్పాలి కదా? ఎందుకు చెప్పడం లేదో ప్రజలకు వివరించాలి. అంతే తప్ప, కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల ను, కేసీఆర్ రైతు అనుకూల విధానాలను కాపీ కొడుతూ మళ్లీ తప్పుబట్టడమేమిటి? ఉద్యమ నాయకుడు కేసీఆర్ మీద విమర్శలు చేయడం రాజకీయ స్వార్థమే తప్ప మరొక్కటి కాదనే విషయం సుస్పష్టం.
(వ్యాసకర్త: ఉప్పల శ్రీనివాస్ గుప్త, 98490 11400, చైర్మన్, స్టేట్ టూరిజం డెవలప్మెంట్
కార్పొరేషన్ లిమిటెడ్)