ఎప్పుడు వస్తుందో తెలియని కరెంటు కోసం రైతన్నల నిరీక్షణ. వచ్చినా అది ఎన్ని గంటలు ఉంటుందో తెలియని పరిస్థితి. దీనికితోడు అనావృష్టి. సాగుచేసిన ఎకరం కూడా నీళ్లు పారక నెర్రెలు వారేది. పెట్టుబడులకు చేసిన అప్పు తీర్చేందుకు రైతులు వలసబాట పట్టేది. అక్కడి కష్టాలు భరించలేక, అప్పులు తీర్చలేక అసువులు బాసిన అన్నదాతలెందరో.. కరెంటు బిల్లులు కట్టలేదని అధికారులే స్టార్టర్లు ఎత్తుకెళ్తే అవమానాలతో ఉరేసుకున్న ఘటనలెన్నో… ఒక్క యూరియా బస్తా కోసం క్యూలైన్లో చెప్పులు పెట్టి పడిగాపులు కాసి, లాఠీ దెబ్బలు తిన్న అనుభవాలెన్నో నా తెలంగాణ రైతన్నలకు. కానీ ఇప్పుడు ఇదంతా గతం.
నా తెలంగాణలో ఇప్పుడు కరెంటు కోతల్లేవు, లక్షల ఎకరాల్లో పంట కోతలున్నాయి. ఎండిన పొలాల్లేవు కానీ మెదువులను అలుగుల్లా పారిస్తున్న కాళేశ్వర జలాలకు కాళ్లు వచ్చినయ్. బీడువారిన తెలంగాణ మాగాణంలో ఆకుపచ్చని నవ్వులు పూస్తున్నాయి. కరెంటు కోసం ఎదురుచూపులు పోయి.. ‘రైతుబంధు’ పైసలు పడ్డయంటూ మెసేజ్‌ల చప్పుడు చప్పట్ల వలె మోగుతున్నాయి. వలస బతుకులు పోయి, బతుకు దెరువుకు బాటలు పడ్డయి. క్యూలైన్లు పోయి నా తెలంగాణ విత్తన, ఎరువుల భాండాగారంగా విరాజిల్లుతున్నది. స్టార్టర్లు లాక్కెళ్లడం కాదు ప్రతి పల్లెకు 24 గంటల పాటు ఉచిత కరెంటు అందుతున్నది. అవును.. ఇది అక్షర సత్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం మొదటిరోజు నుంచే రైతు సంక్షేమానికి శ్రీకారం చుట్టింది. కేవలం ఏడున్నరేండ్లలోనే ఆరు దశాబ్దాల వ్యవసాయ సంక్షోభానికి చరమగీతం పాడింది.
ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అతితక్కువ కాలంలోనే దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. పంట పెట్టుబడులు రైతులకు భారంగా మారుతున్నాయని గ్రహించిన సీఎం కేసీఆర్ ‘రైతుబంధు’ పథకాన్ని అమలుచేశారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏకంగా ఒక్క యాసంగిలోనే రూ.6 లక్షల కోట్లను ‘రైతుబంధు’ రూపంలో అందించారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే, ఆ రైతు కుటుంబానికి ‘రైతుబీమా’ రూపంలో నామినీ ఖాతాలో రూ. 5 లక్షల బీమా సొమ్ము జమవుతున్నది. రైతు బీమా కోసం ఏటా రూ.1,450 కోట్లను చెల్లిస్తున్నది. ఇప్పటివరకు 70,714 మంది రైతు కుటుంబాలకు రూ.9,585.70 కోట్లను రైతుబీమా రూపంలో అందించి అన్నదాతల కుటుంబాలను అక్కున చేర్చుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇక రైతురుణ మాఫీ కోసం ఇప్పటివరకు ఇచ్చింది రూ.16,876 కోట్లు. పంటనష్ట పరిహారం కింద రూ.1,824.64 కోట్లు, వ్యవసాయ ఉచిత విద్యుత్తు కోసం రూ.10,500 కోట్లు, విద్యుత్‌రంగ మౌలిక సదుపాయాల కోసం రూ.28,473 కోట్లు, కాళేశ్వరం, కల్వకుర్తి, చేవెళ్ల ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి వంటి అనేక సాగునీటి రంగం కోసం రూ.1,07,815 కోట్లు వెచ్చించడంతో నేడు 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. అంతేకాదు భూగ ర్భ జలమట్టం పెరిగింది.
‘హరితహారం’ కార్యక్రమంలో భాగంగా కోట్ల సంఖ్యలో చెట్లు నాటడంతో నా తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణగా మారింది. వాతావరణ సమతుల్యత ఏర్పడి ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఉద్యానపంటలు, ఆయిల్‌పాం కోసం రూ.572.88 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.151.29 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన రైతు వేదికల కోసం రూ.572.88 కోట్లు, లక్ష రైతు కల్లాల కోసం రూ.750 కోట్లను తెలంగాణ ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఈ క్రమంలో 2014లో 131.34 లక్షల ఎకరాలు సాగులో ఉంటే, అది 2021 వరకు 208.80 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణానికి చేరింది. 2014లో కేవలం 72 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండితే.. 2021 నాటికి 288 లక్షల మెట్రిక్ టన్నులకు వరి ఉత్పత్తి చేరింది. అంటే.. నాటి ఆకలి కేకల నా తెలంగాణ అన్నపూర్ణగా మారిందని చెప్పుకోవడానికి ఇంకెన్ని ఉదాహరణలు కావాలి. దీనంతటికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పడంలో సందేహం లేదు.
రైతు సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. పండిన వరి ధాన్యాన్ని రైతుల కల్లాల వద్దకు వెళ్లి కొనుగోలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతి పల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ రెండేండ్లుగా తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేసింది.
ఎడారి, కరువు ప్రాంతంగా పిలువబడిన తెలంగాణ నేడు పాడి పంటలకు నెలవుగా మారింది. అంతేకాకుండా యావత్ దేశంలోనే అత్యధిక వరి పంటను పండించిన రాష్ట్రంగా కీర్తి గడిస్తున్నది. దీన్ని ఓర్వలేని కేంద్రం తెలంగాణలోని వరి ధాన్యాన్ని కొనబోమంటూ రైతులతో ఆడుకుంటున్నది.
రైతును రాజు చేయాలని, రైతుల జీవన ప్రమాణాలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమంటూ రైతుల మనోభావాలతో ఆడుకుంటున్నది. తెలంగాణలో పండిన వరి పంటను కొనుగోలు చేయకుండా మొండి వైఖరిని ప్రదర్శిస్తున్న కేంద్రం మెడలు వంచేందుకు కదం తొక్కింది గులాబీ దండు. తెలంగాణలో పండిన వరి పంటను కేంద్రం కొనుగోలు చేసేదాకా ఈ దండు పోరాడుతూనే ఉంటుంది. రైతును గుండెల్లో పెట్టుకొని చూసుకునే సంస్కృతి టీఆర్ఎస్ పార్టీది. కానీ రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం పోరాడుతున్న రైతులను వాహనాలతో తొక్కించిన సంస్కృతి కేంద్రానిది. ఇప్పుడు రైతులపై కపట ప్రేమను చూపుతూ రాజకీయరంగు పులుముకోవడాన్ని యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఈ విషయం కేంద్రం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. లేకుంటే కేంద్రానికి నూకలు చెల్లక తప్పదు.
(వ్యాసకర్త: దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎమ్మెల్యే)