ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయనే నానుడి జాతీయ పార్టీలుగా చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీలకు వర్తించినంతగా మరే పార్టీలకు వర్తించవు. తాము అధికారంలో ఉన్నచోట ఒకలాగ, విపక్షంగా ఉన్నచోట మరోలా రెండునాల్కల ధోరణితో వ్యవహరించడం ఆ పార్టీలకు అలవాటుగా మారింది. ఢిల్లీలో సీజేపీ ఆందోళన, జార్ఖండ్ రాజధాని రాంచీలో నిరుద్యోగుల ఆందోళన విషయంలో ఈ రెండు పార్టీల ద్వంద్వవైఖరి మరింత తేటతెల్లమైంది. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు అత్యంత ప్రాథమికమైనదని అన్ని పార్టీలూ అంగీకరిస్తాయి. ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఈ హక్కును గట్టిగా సమర్థించింది. అయితే ఆ హక్కుపై ఎవరి చేతిలో అధికారం ఉన్నది అనేదాన్ని బట్టి పార్టీల స్పందన మారిపోతుండటం విడ్డూరం.
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన తీవ్రస్థాయికి చేరినప్పుడు కేంద్ర ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరించడం దేశాన్ని ఆవేదనకు గురిచేసింది. ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జ్‌ను తనకు అనుకూలంగా ఉపయోగించుకుని కాంగ్రెస్ లబ్ధి పొందడానికి ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు గురైంది. స్వయంగా రాహుల్ గాంధీ ధర్నాకు దిగి నానా హంగామా చేయడం, మార్కులు కొట్టేయాలని చూడటం విడ్డూరం. అదే కాంగ్రెస్ తాను ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న జార్ఖండ్‌లో ఉద్యోగార్థులపై విరిగిన లాఠీలపై తటపటాయించడం, ఆలస్యంగా, అదీ మెతకగా స్పందించడం ఆత్మవంచనకు పరాకాష్ట.
నిరసనలను అణచివేయడం, పోలీసు బలాన్ని ప్రయోగించడం విషయంలో కాంగ్రెస్ రికార్డు బహిరంగ రహస్యమే. అందుకు కోకొల్లలుగా ఉదాహరణలు మనముందున్నాయి. అంతెందుకు.. తెలంగాణలో ఉద్యోగార్థులను ఎన్నికల ముందు మాయమాటలతో కాంగ్రెస్ మోసగించింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ అయితే కోచింగ్ సెంటర్లకు వెళ్లి మరీ నమ్మబలికారు. తర్వాత ఉద్యోగాల హామీ అటకెక్కించారనేది తెలిసిందే. మాట తప్పి మడమ తిప్పిన కాంగ్రెస్‌పై ఉద్యోగార్థులు ఆందోళనకు దిగితే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ పోలీసు లాఠీలతోనే సమాధానం చెప్పింది. హైదరాబాద్ నగరానికి రాహుల్ రాక సందర్భంగా ఆందోళనకారులను పోలీసు లాఠీలతో చితకబాదడం దారుణం. ఢిల్లీలో, జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఊరికో తీరుగా వ్యవహరించడం ఏమిటి? అనేది ప్రశ్న. ఈ అవకాశవాద ధోరణి లాఠీలు, వాటివల్ల కలిగే బాధ వేర్వేరుగా ఉంటుందా? అనే చర్చకు దారితీయడం గమనార్హం.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. విపక్షంలో ఉన్నప్పుడు నిరసన హక్కుల గురించి గొప్పగొప్ప మాటలు చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అవే నిరసనలను ‘శాంతిభద్రతలకు ముప్పు’గా చిత్రీకరిస్తున్నది. ఢిల్లీ నిరసనకారులపై అత్యంత పాశవికంగా పోలీసు దాడులు చేయించి అపకీర్తి మూటగట్టుకున్నది. ఇదంతా ఒకెత్తయితే రాంచీ ఘటనపై బీజేపీ స్పందన ఆ పార్టీ రెండునాల్కల వైఖరికి నిలువెత్తు అద్దం పట్టింది. అవకాశం దొరికింది కదా అని రాంచీలో బీజేపీ నీతులు వల్లించడం హాస్యాస్పదం. తమకు అనుకూలంగా ఉన్న రాష్ర్టాల్లో లాఠీచార్జ్ జరిగితే అది ‘చట్టబద్ధ చర్య’గా, ప్రత్యర్థి పాలిత రాష్ర్టాల్లో జరిగితే ‘ప్రజాస్వామ్యంపై దాడి’గా అభివర్ణించడం బద్ధశత్రువులుగా చలామణి అయ్యే కాంగ్రెస్, బీజేపీ రాజకీయ వ్యూహంగానే పరిగణించవచ్చు. ఈ రెండు పార్టీల వైఖరి ఒకేరీతిగా ఉండటం విచిత్రం. ప్రజాస్వామ్య విలువలు వల్లించడానికి తప్ప ఆచరణకు పనికిరావనేది వాటి పరిపాలనా తీరులోనే వెల్లడైంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకం మాటలు మాట్లాడటం ద్వారా అవి ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఏ ఒక్క పార్టీకో చెందింది కాదు; అది ప్రతి పౌరుడి హక్కు. అయితే సదరు హక్కును రక్షించే విషయంలో కాంగ్రెస్, బీజేపీ ద్వంద్వవైఖరికి రాంచీ ఘటన ఓ గీటురాయిలా నిలిచింది.