విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రాజకీయ లక్ష్యాల కోసం బీజేపీ సర్కార్ ఉపయోగించే సాధనాల్లో ఈడీ కేసులు ప్రధానమైనవని దేశంలో చిన్నపిల్లాడికి కూడా తెలిసిపోయింది. ‘అయితే మోడీ.. కాదంటే ఈడీ’ అనే నానుడి ఊరికే రాలేదు. అదే పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్ నిరుడు ఓ విచిత్రమైన చట్టాన్ని పార్లమెంటు ముందుంచింది. ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇలా ఎవరైనా ఏదైనా కేసులో అరెస్టయి ఏకబిగిన 30 రోజులు జైలులో ఉంటే వారి పదవులను ఉన్నపళంగా ఊడగొట్టేందుకు ఈ చట్టం తెస్తున్నట్టు చెప్పుకొన్నారు. ఈ మేరకు 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన మూడు బిల్లులను గత ఆగస్టు 20న గందరగోళం మధ్య పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. విపక్షాల తీవ్ర అభ్యంతరాలతో వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. ఈనెల 17న జరిగే కమిటీ సమావేశంలో బిల్లును తూతూమంత్రంగా మమ అనిపించి, 20 నుంచి జరిగే వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం తిరిగి ఈ బిల్లును ప్రవేశపెడుతుందని తెలుస్తున్నది. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీ ప్రభుత్వానికి లేదు. అందుకే బిల్లును ఓడగొడుతామని విపక్ష పార్టీలు తేల్చిచెప్తున్నాయి. మరోవైపు విపక్షాలను చీలికలు పీలికలు చేసి బలాన్ని పెంచుకొనేందుకు కేంద్ర పాలక పక్షం నానా తంటాలు పడుతుండటమూ చూస్తున్నాం.
ఇంతకూ రాజకీయ దుమారానికి కారణమైన ఆ బిల్లుల్లో ఏమున్నదో పరిశీలిస్తే విస్మయం కలుగక మానదు. ప్రధాని, కేంద్రమంత్రులు, రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రి, మంత్రులు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలతో అరెస్టయి జైలుకువెళ్తే వారిని ఆ పదవుల నుంచి తొలగించే చట్రాన్ని కొత్త చట్టాలు సమకూరుస్తాయని కేంద్రం అంటున్నది. ఐదేండ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు జైలుశిక్ష పడేందుకు అవకాశమున్న నేరాల్లో అరెస్టయి 30 రోజులు కస్టడీలో గడిపితే 31వ రోజు రాష్ట్రపతి.. ప్రధానిని, ప్రధాని కేంద్రమంత్రులను, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రులను, ముఖ్యమంత్రి మంత్రులను తొలగించేందుకు ఈ బిల్లులు వీలు కల్పిస్తున్నాయి. విడుదలైన తర్వాత వారిని తిరిగి పదవుల్లో నియమించవచ్చని కూడా అవి తెలియజేస్తున్నాయి. రాజకీయాలను నేరరహితం, అవినీతి రహితం చేయాలనే సదుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లులను తెస్తున్నదని ఎవరూ నమ్మడం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ విపక్షనేతలను ముప్పుతిప్పలు పెడుతున్న బీజేపీ హయాంలో కేసులు పెరిగాయి. వాటిలో శిక్షలు పడిన సందర్భాలు బహుతక్కువ అని గణాంకాలు చెప్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం విపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న చరిత్ర అంతా కండ్ల ముందే ఉన్నది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేస్తే ఆయన రాజీనామా చేసి కస్టడీలోకి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ పదవి చేపట్టడం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉండగా మద్యం కేసులో అరెస్టు చేస్తే ఆయన రాజీనామా చేసేందుకు ససేమిరా అంటూ జైలు నుంచే పాలన కొనసాగించారు. నచ్చని వారిపై కేసులు పెట్టించడం, కేసులున్న వారు తమవైపు వస్తే ‘వాషింగ్ మెషిన్’లో వేసినట్టు శుభ్రం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే బాంబే హైకోర్టు జడ్జి ఒకరు ఈ తతంగాన్ని కొంత వ్యంగ్యంగా ప్రస్తావించడం తెలిసిందే. ఈ చరిత్ర అంతా కండ్ల ముందే ఉంటే ఇప్పుడు ప్రధాని సహా అందరినీ పరిధిలోకి తెస్తున్నామని కేంద్రం గడుసుగా వాదించడం హాస్యాస్పదం. అయిదేండ్లకు పైగా శిక్ష పడే క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తి ప్రధాని, సీఎం వంటి పదవుల్లోకి వస్తారా? ఒకవేళ వస్తే వారిపై తగిన చర్య తీసుకొనేందుకు ఇప్పుడున్న చట్టాలు సరిపోవా? అనేది మరో ప్రశ్న. ఇది పిల్లికి రొయ్యల మొలతాడు కట్టడం తప్ప మరోటి కాదని చెప్పక తప్పదు.