పది నెలల కిందటి దాకా పచ్చని చెట్లతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు బోసిపోతున్నాయి. అనారోగ్యంతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం లేక విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. బడుల్లో మౌలిక వసతులు కరువై పిల్లలు నానా అగచాట్లు పడుతున్నారు. నెల నెలా ఠంఛన్‌గా ఆసరా పింఛన్ అందుకున్న అవ్వాతాతలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఇప్పుడు పింఛన్ రావట్లేదని లబోదిబోమని మొత్తుకుంటున్నారు.
ఆరు గ్యారెంటీలు అతీగతీ లేవు. తులం బంగారం ఇస్తామన్న నాయకులు ఇప్పుడు తూర్పుకు తిరిగి దండం పెట్టమంటున్నారు. వంటగ్యాస్ పథకం తుస్సుమన్నదని ప్రజలు వాపోతున్నారు. యువతులకు స్కూటీలు ఇస్తామన్న నేతలు ఇటుదిక్కే రావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. బతుకమ్మ పండుగకు చీరలు వస్తయనుకొని ఆశపడ్డ మహిళలు ఈసారి బతుకమ్మ పండుగ పండుగ లెక్కనే జరగలేదని నిరాశపడుతున్నారు. 24 గంటలు నిరంతరాయంగా వెలిగిన కరెంటు బుగ్గ ఇప్పుడు మిణుకు మిణుకుమంటున్నది. వేసిన పంటను కొనే నాథుడు లేక దళారులు రాజ్యమేలుతున్నారు. రైతులకు అడ్డికి పావుశేరు అమ్ముకునే రోజులు మళ్లీ వచ్చాయి. ప్రపంచంతో పోటీ పడి, అనేక అంతర్జాతీయ కంపెనీలను తన దగ్గరికి రప్పించుకున్న మహా నగరం నేడు ‘హైడ్రా’ కూల్చివేతలతో, మూసీ నిర్వాసితులతో మూలుగుతున్నది. ‘ఎవ్వాని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడురో తెలంగాణ’ అని ఉద్యోగ అభ్యర్థులు పాటలు పాడుతున్నరు.
మొత్తంగా అన్ని రంగాల్లో ప్రగతిని సాధించి, పదేండ్ల పాలనలో సబ్బండ వర్ణాలకు సంక్షేమ పథకాలను అందించి, రాష్ర్టాన్ని అభివృద్ధి దిశలో దూసుకువెళ్లిన తెలంగాణ ఇప్పుడు ఆగమైపోతున్నది. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 16 లక్షల పైచిలుకు ప్రైవేటు ఉద్యోగాలు కల్పించి, యువత బతుకుల్లో భరోసా నింపిన బాపు లేక తెలంగాణ తల్లడిల్లుతున్నది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అయిపోతుందా? ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకోవడం అంటే మామూలు ముచ్చటనా? అందరికీ అబ్బే విద్య కాదు. ముఖ్యంగా రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలను ఆప్యాయతగా చూసుకునే దమ్ము ఉండాలి. నోటికి ఎంతవస్తే అంత మాట్లాడుతూ పోయే నాయకులు ఈ జన్మలో కాదు, ఇంకో రెండు జన్మలెత్తినా అంతటి అభిమానాన్ని చూరగొనలేరనేది ముమ్మాటికీ నిజం.