ముంబై, ఫిబ్రవరి 27 : గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 20తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.119 బిలియన్ డాలర్లు కరిగిపోయి 723. 608 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితంవారంలో రిజర్వులు 8.66 బిలియన్ డాలర్లు పెరిగి రికార్డు స్థాయి 725.727 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. గతవారాంతానికిగాను విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 1.039 బిలియన్ డాలర్లు తరిగిపోయి 572. 564 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని తన వారాంతపు సమీక్షలో సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
డాలరేతర కరెన్సీలు అయిన యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడం వల్లనే విదేశీ మారకం నిధులపై ప్రతికూల ప్రభావం చూపాయని వెల్లడించింది. అలాగే గోల్డ్ రిజర్వులు కూడా 977 మిలియన్ డాలర్లు తరిగిపోయి 127.489 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ వద్ద ఉన్న నిధులు కూడా 84 మిలియన్ డాలర్లు తగ్గి 18.84 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా, ఐఎంఎఫ్ వద్ద నిధులు కూడా 18 మిలియన్ డాలర్లు తగ్గి 4.716 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేర్కొంది.