ముంబై , ఫిబ్రవరి 27 : ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మరోసారి భారీ నిధులను సేకరించడానికి సిద్ధమైంది. వచ్చే నెల 4న గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేయడంతో రూ.10 వేల కోట్ల వరకు నిధులను సమీకరించాలనుకుంటున్నది. ఇష్యూ సైజ్ రూ.5 వేల కోట్లు కాగా, ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ ద్వారా మరో రూ.5 వేల కోట్లను సేకరించాలనుకుంటున్నది. ఏడేండ్ల కాలపరిమితి కలిగిన ఈ బాండ్లు మార్చి 5, 2033న మెచ్యూరిటీ కానున్నాయి.
వచ్చే బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ బాండ్ల కోసం బిడ్డింగ్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ బాండ్లకు కేర్ రేటింగ్, ఇక్రా ఏజెన్సీలు ఏఏఏ ఇచ్చాయి. ఈ బాండ్లపై వడ్డీరేటును వార్షికంగా చెల్లింపులు జరపనున్నది. కనీసంగా లక్ష రూపాయలు, గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చునని బ్యాంక్ తెలిపింది.