న్యూఢిల్లీ : నీట్-యూజీ పేపర్ లీకేజీపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం.. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణా లోపాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం బుధవారం వివరణ ఇచ్చింది. ఇక నుంచి నీట్-యూజీ పరీక్షను సీబీటీ (కంప్యూటర్ టెస్ట్ బేస్డ్) విధానంలోనే నిర్వహిస్తామని తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఒకే సెషన్లో కాకుండా పలు దశల్లో పరీక్షను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరించింది. ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ప్రధానమైన ఎనిమిది పేపర్లలో ఇప్పటికే ఏడు కంప్యూటర్ బేస్డ్లో జరుగుతున్నాయని.. మిగిలిన నీట్-యూజీని కూడా ఇదే విధానంలో నిర్వహిస్తామని వెల్లడించింది. కాకపోతే ప్రస్తుతం నీట్-యూజీ పరీక్షను గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా రాస్తున్నారని.. అందులోనూ అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి కంప్యూటర్ ఆధారిత విధానంపై చర్చలు జరుపుతున్నామని కేంద్రం వివరించింది.
ప్రశ్న పత్రాల తయారీలోనూ కఠిన నిబంధనలు అమలు చేస్తామని కేంద్రం వివరించింది. ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన నిపుణులు అత్యంత రహస్యమైన ప్రాంతంలో వీటిని తయారు చేస్తారని.. పేపర్ తయారీ నుంచి పరీక్ష నిర్వహణ దాకా వారికి ప్రపంచంతో సంబంధం ఉండకుండా అక్కడే ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది
. ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకుండా.. 24 గంటల సాయుధ దళాల భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఒక పేపర్ మాత్రమే కాకుండా ఐదు రెట్లు ఎక్కువ ప్రశ్నలు తయారు చేస్తారని.. ఒక పేపర్ లీక్ అయితే మరో పేపర్‌తో నిర్వహించవచ్చని కేంద్రం సుప్రీంకోర్టు ముందు వివరించింది. నందన్ నీలేకని నేతృత్వంలోని కమిటీ ఇచ్చే సూచనల ఆధారంగా మార్పులు చేపట్టనున్నట్టు వెల్లడించింది.