తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినిపించిన, ఆ తర్వాత కూడా రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘అప్పులు’. ఇంకా చెప్పాలంటే ఎన్నికల్లో ఈ అంశమే కీలకపాత్ర పోషించింది. కేసీఆర్ రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారని అప్పట్లో కాంగ్రెస్ గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ లీడర్ల దాకా ఊదరగొట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు. అయితే, గతంలో అప్పుల గురించి నానా యాగీ చేసిన కాంగ్రెస్ నాయకులు.. తీరా అధికారంలోకి వచ్చాక అప్పులు చేయకుండా పాలన ఎట్లా సాగుతదని చెప్తుండటం గమనార్హం.
అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే ఏకంగా రూ.75 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. పైగా వాటికి లెక్కాపత్రమూ లేదు. ఆ సొమ్మంతా ఎటుపోతుందో ఎవరికీ తెలియదు. కేసీఆర్ తాను చేసిన అప్పులతో రాష్ట్ర సంపదను పెంచారు, ఆస్తులను కూడబెట్టారు. కానీ, అటు సంపదను పెంచకుండా, ఇటు హామీలను అమలు చేయకుండా ఆ అప్పుతో కాంగ్రెస్ పాలకులు ఏం చేస్తున్నట్టు? ఆర్థిక విశ్లేషకులు, మేధావుల మదిని తొలచివేస్తున్న ప్రశ్నలివీ. రోజురోజుకు కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విధానాలు, హస్తం పార్టీ పాలకులు చేసిన అప్పుల గురించి ఇప్పుడు ప్రస్తావించుకుందాం.
Congress Govt | తెలంగాణ అప్పులమయం అయిందని చెప్పడం ఒక అబద్ధం. అప్పుల కుప్పగా మారిన రాష్ర్టాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టారని, ఖాళీ ఖజానా అప్పగించారని అనడం పచ్చి అబద్ధం. అబద్ధమని ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. రాష్ట్ర ఖజానా అనేది ఎప్పుడూ ఖాళీగా ఉండదు. రాష్ట్ర ఖజానా అంటే..మన ఇంట్లో ఉండే బీరువా లెక్కన కాదు. అందులోని డబ్బులన్నీ వాడుకొని ఖాళీ చేయడానికి. ఇంటి ఖజానాకు, రాష్ట్ర ఖజానాకు చాలా వ్యత్యాసం ఉంటుంది. రాష్ట్ర ఖజానాలో నిరంతరంగా లావాదేవీలు జరుగుతుంటాయి. పన్నులు, ఇతర రూపాల్లో నిత్యం ఆదాయం వస్తుంటుంది, ఖర్చులు అవుతుంటాయి. అసలు ఖాళీ ఖజానా చేతికివ్వడానికి రాష్ట్ర ఖజానాలో నిల్వ అనేది ఉండదు.
అప్పులు, ఆస్తులు అనేవి ఎంతో కీలకమైనవి. చేసిన అప్పులతో ఏం చేస్తున్నారనేది ప్రధానం. రాష్ట్రమైనా, దేశమైనా అప్పులతో ఆస్తులు, సంపదను గనుక కూడబెట్టుకుంటే.. ఆ అప్పులు రాష్ట్ర, దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. అలా కాకుండా చేసిన అప్పులను విందు భోజనంలా వాడుకుంటే మాత్రం అది నష్టదాయకమే. అందుకే, అప్పులను ఎందుకు తీసుకుంటున్నారు, ఎలా వినియోగిస్తున్నారనేది అత్యంత ప్రాధాన్యం.
కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులపై గతంలో కాంగ్రెస్ నేతలు ఎక్కువగా విష ప్రచారం చేశారు. కానీ, కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థిక నిర్వహణ చాలా బాగుందని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (ఈపీడబ్ల్యూ) ఇటీవల కొనియాడింది. ఆర్థిక నిర్వహణ, ఉత్పాదకత తదితర అంశాల్లో దేశంలోని ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఈపీడబ్ల్యూ పొగిడింది. వాస్తవానికి, స్వరాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణ మిగులు రాష్ట్రమే. తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ చెప్పింది నిజమే. అయితే, అంతకుముందు ఉమ్మడి ఏపీలో ఆ నిధులు వేరే ప్రాంతాలకు తరలిపోయాయి. స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడి నిధులు, వనరులను ఇక్కడే వాడుకునే వెసులుబాటు కలిగింది. దాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడి నిధులతో పాటు అప్పులు చేసి రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారు.
ఆస్తులను పెంచారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, విద్యుత్తు ఉత్పత్తి పెంపు, విద్యుత్తు ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అందుకు నిదర్శనం. మరీ ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన జరిగింది. మన కండ్లముందు కనిపిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్లు, ఇతర నిర్మాణాలే అందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే కేసీఆర్ పాలనలో అంతర్జాతీయంగా ఒక అభివృద్ధి నమూనాగా తెలంగాణ గుర్తింపు పొందింది. తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి ఈపీడబ్ల్యూ మాత్రమే కాదు, గతంలో అనేక సంస్థలు కూడా ప్రస్తావించాయి. ‘కేసీఆర్ ఉద్యమకారుడు మాత్రమేనని అనుకున్నాం. రాష్ర్టాన్ని ఆయన పాలించగలరా? అని మొదట్లో అనుమానపడ్డాం. కానీ, అడ్మినిస్ట్రేటర్‌గా, నిర్మాణదక్షుడిగా కేసీఆర్ నిరూపించుకున్నారు. ఎవరూ ఊహించని రీతిలో పరిపాలకుడిగా విజయవంతమయ్యారు’ అని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చెప్పినట్టు కూడా నేను విన్నాను.
తెలంగాణ అప్పులమయం అయిందని చెప్పడం ఒక అబద్ధం. అప్పుల కుప్పగా మారిన రాష్ర్టాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టారని, ఖాళీ ఖజానా అప్పగించారని అనడం పచ్చి అబద్ధం. అబద్ధమని ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. రాష్ట్ర ఖజానా అనేది ఎప్పుడూ ఖాళీగా ఉండదు. రాష్ట్ర ఖజానా అంటే.. మన ఇంట్లో ఉండే బీరువా లెక్కన కాదు. అందులోని డబ్బులన్నీ వాడుకొని ఖాళీ చేయడానికి. ఇంటి ఖజానాకు, రాష్ట్ర ఖజానాకు చాలా వ్యత్యాసం ఉంటుంది. రాష్ట్ర ఖజానాలో నిరంతరంగా లావాదేవీలు జరుగుతుంటాయి. పన్నులు, ఇతర రూపాల్లో నిత్యం ఆదాయం వస్తుంటుంది, ఖర్చులు అవుతుంటాయి. అసలు ఖాళీ ఖజానా చేతికివ్వడానికి రాష్ట్ర ఖజానాలో నిల్వ అనేది ఉండదు. పైగా డిసెంబర్ 3 వరకే ఖజానాలోని నిధులు వాడుకోవడానికి కేసీఆర్‌కు వీలుంటుంది. డిసెంబర్ 4 తర్వాత కూడా ఖజానాకు ఆదాయం వస్తూనే ఉంది. ఒక్కసారిగా ఆదాయం ఆగిపోలేదు కదా. ఈ నేపథ్యంలోనే అప్పులపై కాంగ్రెస్ చేసిన విష ప్రచారం ఉత్త అబద్ధమని, ఆ పార్టీ ట్రాప్‌లో పడ్డామని ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారు.
కొంతమంది అమెరికా అప్పులతో కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులను పోలుస్తుంటారు. అది సరికాదు. అమెరికాది అప్పు చేసి పప్పు కూడు వ్యవహారం. కేసీఆర్ అప్పులు చేసి ఆస్తులు నిర్మించారు. కానీ, అమెరికాకు సొంత ఆదాయ మార్గాలేమీ లేవు. ఒక్క ఆయుధాల అమ్మకం తప్ప. ఆ దేశం అన్ని సరుకులు దిగుమతి చేసుకోవాల్సిందే.
కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులను పోల్చడం మూర్ఖత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను కేసీఆర్ ఒక ప్రణాళిక ప్రకారం వినియోగించారు. సంపదను పెంచారు. కానీ, కాంగ్రెస్ చేస్తున్న అప్పులు అలా కాదు. వాటికి జవాబుదారీ ఎవరు? ఇప్పటి వరకు తెచ్చిన రూ.75-80 వేల కోట్లకు పైగా అప్పులతో ఏం చేశారనేది ఎవరికీ తెలియదు. దానిగురించి ప్రభుత్వం తరఫున ఎవరూ వివరించడం లేదు. అంతేకాదు, ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో రూ.75 వేల కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి ఆ సొమ్మంతా ఎటుపోయింది? ప్రభుత్వం ఆ నిధులను ఏం చేసింది? ఒక్క పథకం కూడా అమలుచేయడం లేదు. రైతుభరోసా సంగతేమో కానీ, రైతుబంధే ఇవ్వడం లేదు. ఆసరా పింఛన్లు సరిగ్గా ఇవ్వట్లేదు. రుణమాఫీ ఫెయిలైంది. మొదట రూ.41 వేల కోట్ల దాకా రుణాలున్నట్టు చెప్పి.. రూ.18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ఉచిత బస్సు పథకం మాత్రమే ఏదో ఉందా అంటే ఉందన్నట్టు నడుస్తున్నది.
రేవంత్ సర్కార్‌కు అసలు ఒక విధానమంటూ లేదు. ప్రత్యేకించి, ఆర్థికపరమైన విషయాల్లో. గతేడాది ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.85 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. కానీ, ఈ ఏడాది అది రూ.75 వేల కోట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని, రేవంత్ సర్కార్‌ను పోల్చడమంటే కేసీఆర్‌ను, నాటి ప్రభుత్వాన్ని అవమానించడమే. ఏ కేజ్రీవాల్ ప్రభుత్వంతోనో, ఇతర ప్రభుత్వాలతోనో కేసీఆర్ సర్కార్‌ను పోల్చాలే గాని రేవంత్ సర్కార్‌తో పోల్చడం సరికాదు. అసలు ఏ విషయంలోనూ రెండింటికి పోలికే లేదు. పాలనాపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. వాస్తవానికి, అక్టోబర్ 1 నాటికి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవ్వాలి. ఆ సమయం మించిపోయి ఇప్పటికే నెల రోజులైంది. అయినా రాష్ట్రంలో కొనుగోళ్లు జరగడం లేదు. పంజాబ్‌లో ఇప్పటికే 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. కానీ, మన దగ్గర కనీసం కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడం లేదు. కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షాలకు తడిసి ముద్దవుతున్నది. అసలు కొంటారా? కొనరా? అని చెప్పే నాథుడే లేడు. దీంతో ప్రైవేట్ వ్యాపారులకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పాలకులు చేతులు దులుపుకొన్నారు. ఆ కేంద్రాల్లో కొనుగోళ్లు అసలు జరగడం లేదు.
కొంతమేరకు కొనుగోలు చేసిన వాటికి డబ్బులు ఇవ్వడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో రెండు మూడు నెలల కిందట సోయాబీన్ పంట అమ్మిన రైతులకు ఇప్పటికీ నగదు అందలేదు. వాస్తవానికి వరి క్వింటాలుకు రూ.2,300కు పైగా ఎంఎస్పీ ఉన్నది. క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ లెక్కన క్వింటాలుకు రూ.2,800 దాకా ధర రావాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో క్వింటాలు వరి రూ.1800కే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంటే, ఒక క్వింటాలుకు రూ.1000 చొప్పున రైతన్నలు నష్టపోతున్నారు. ఇప్పటికే నాలుగింట ఒక వంతు ధాన్యం తక్కువ ధరకే విక్రయించేసినట్టు సమాచారం. అయినా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవడం లేదు. కోతలు మొదలై, ప్రైవేటు వ్యాపారులకు తెగనమ్ముకుంటున్న ఈ సమయంలో ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకో ప్రత్యేక అధికారిని నియమించడం విడ్డూరం.
నవంబర్ 29న ప్రభుత్వం ఒక ఆశ్చర్యకరమైన ఆర్డర్‌ను పాస్ చేసింది. క్వింటాల్ ధాన్యానికి సుమారుగా 67 కిలోల బియ్యం మిల్లర్లు ఇవ్వాలనేది దాని సారాంశం. క్వింటాలు ధాన్యం మిల్లులో ఆడిస్తే అంత బియ్యం రాదని, సుమారుగా 50-55 కిలోల వరకు మాత్రమే వస్తుందని మిల్లర్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. అంతేకాదు, బ్యాంకు గ్యారంటీలంటూ కొర్రీలు పెట్టి కొనుగోళ్లు జరగకుండా చేశారు. పైన చెప్పిన ఆర్డరు, బ్యాంక్ గ్యారంటీల లొల్లి ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం కొనుగోళ్లు జరగకుండా చేసేందుకే వీటిని తెరపైకి తెచ్చారేమో!
కాంగ్రెస్‌కు తెలంగాణ పట్ల గాని,ప్రజా సంక్షేమం పట్ల గాని ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఇటీవల రాష్ర్టానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చారు. ఎన్నికల సందర్భంగా గతంలో ఆయన ఎన్నో హామీలిచ్చిన సంగతి తెలిసిందే. మరీ ఆ హామీల అమలు గురించి ఆయన కనీసం పట్టించుకుంటున్నారా? గంటకు పైగా రాష్ట్రంలో ఉన్న ఆయన ఎవరినీ కలవకుండానే వెళ్లిపోయారు. ప్రజల వద్దకు వెళ్లేందుకు ఆయనకు మొహం చెల్లకపోవడమే అందుకు కారణం. రేవంత్ పాలనలో అరిగోస పడుతున్న నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ఆటోడ్రైవర్లు.. ఇలా ఏ వర్గం వద్దకైనా ఆయన వెళ్లగలరా? ఆఖరికి పోలీసుల దగ్గరికి కూడా వెళ్లలేని పరిస్థితి.
తెలంగాణను కాంగ్రెస్ అధిష్ఠానం ఒక పాడి ఆవులా వాడుకుంటున్నది. ఇక్కడినుంచి ఢిల్లీకి సూట్‌కేసులు వెళ్తున్నాయనేది ప్రధాన ఆరోపణ. ఆ తతంగం జరిగినంత కాలం రాష్ట్రంలో ఏం జరిగినా వాళ్లు పట్టించుకోరు. అందుకే, ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా మిన్నకుంటున్నారు. తెలంగాణలో అసలు ప్రభుత్వమే లేదు. రాష్ట్రంలో ఫ్రీ ఫర్ ఆల్ నడుస్తున్నది. ఎవరికి ఇష్టమొచ్చింది వాళ్లు చేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలో, ఏమని విమర్శించాలో కూడా తెలియడం లేదు. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు.. పనిచేసే ప్రభుత్వంపైనే విమర్శలు వస్తాయి. పనిచేసే ప్రభుత్వం కాబట్టి, కేసీఆర్ సర్కార్‌ను అప్పట్లో కొందరు విమర్శించారు. అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏముంది? ఏదైనా పనిచేస్తేనే కదా విమర్శించేది. విమర్శించి.. విమర్శించి.. విమర్శ మీద మనకు విసుగొచ్చింది, ప్రభుత్వం మీద ప్రజలకు విసుగొచ్చింది.
రాష్ర్టాల ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఇష్టమొచ్చినట్టు గ్యారెంటీలు ఇచ్చుకుంటూపోతే కాంగ్రెస్‌కే నష్టం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు గ్రహించారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో మళ్లీ గ్యారెంటీలు ప్రకటించారు. ఇది ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పతనం ఖాయం. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలవదు, తెలంగాణలో అసలే గెలవదు.
(వ్యాసకర్త: ప్రముఖ ఆర్థిక నిపుణులు)
‘మానవాళికి మహోదయం’ పుస్తకం గురించి…‘మానవాళికి మహోదయం’ పుస్తకం వ్యాసాల సంకలనం. 1999లో నేను జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రాసిన వ్యాసాలు అందులో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా గుండెకాయ లాంటిది. అందుకే అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ, విధానాలపై ఎక్కువ వ్యాసాలు రాశాను. సంక్షోభం దిశగా అమెరికా ఆర్థికవ్యవస్థ వెళ్తుందనే అంశంపై మొదటి వ్యాసం రాశాను. అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్రాజ్యవాదం, అమెరికా అప్పులు, దివాళా తదితర అంశాలపై ఆ తర్వాత అనేక వ్యాసాలు నా కలం నుంచి జాలువారాయి. ఆ వ్యాసాల సమాహారమే ఈ పుస్తకం. 1999-2003 వరకు రాసిన వ్యాసాలతో అప్పట్లో చిన్న పుస్తకం విడుదలైంది. 2003-2007 వరకు రాసిన వ్యాసాలతో మరో పుస్తకం వచ్చింది. 2007-12 వరకు రాసిన వ్యాసాలు, గత పుస్తకాల్లోని కొన్ని వ్యాసాలను కలిపి తాజాగా ఈ కొత్త పుస్తకం తీసుకొచ్చా.
-డి.పాపారావు