ఔను ఇప్పుడు మనందరి మదిలో మాట, తెలంగాణ ముచ్చట ఒక్కటే.. కేసీఆర్ సార్ మూడోసారి ముఖ్యమంత్రి కావలసిన చారిత్రాత్మక అవసరం ఏమిటి? తెలంగాణ తొలి ఉద్యమం జరిగినప్పుడు నేను ఏడాది పోరన్ని. మలిదశ ఉద్యమంలో పోరాటాల గడ్డ వరంగల్‌లో పిల్లల డాక్టర్‌గా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా, మెడికల్ జేఏసీ ఆవిర్భావ ముఖ్య నాయకుల్లో ఒకడిని. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధనలో నేను సైతం అంటూ నడిచినవాడిని…
అమరవీరుల త్యాగాల సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నా జీవిత పుటల్లో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. తెచ్చిన తెలంగాణకు దశా దిశ ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమని గట్టిగా నమ్మినవాళ్లలో నేనూ ఒక్కడిని. అనుకున్నట్టుగానే ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తిరుగులేని సంక్షేమ పథకాలు, అభివృద్ధి, దూరదృష్టితో 2014 కంటే ఎక్కువ మంది ప్రజల ఆశీర్వాదంతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి 360 డిగ్రీల ఆల్‌రౌండ్ డెవలప్మెంట్తో ప్రపంచపటంలో ‘మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్’గా తెలంగాణను నిలిపారు. ఈ తరుణంలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండవలసిన అవసరం, అనివార్యత తెలంగాణకు ఉన్నది. ముఖ్యం గా సుస్థిరత, ఒక నిర్దేశించిన దిశలో పాలన సాగుతున్నప్పుడు మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా కోరుకోవటం సరైనదే కదా?
నిరంతర విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్యం, ఆసరా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, దళితబంధు వంటి ఎన్నో ఫ్లాగ్షిప్ పథకాల అమలుతో తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయంగా, జాతీయస్థాయిలో ఒక సుస్థిరమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రంగా పేరు గడించింది. సుస్థిర, సమగ్రాభివృద్ధిని కొనసాగిస్తూ మరింత విస్తృత స్థాయిలో దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే మన కేసీఆర్ తెలంగాణ రాష్ర్టానికి మూడోసారి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉన్నది. తెగువతోపాటు స్పృహ ఉన్న తెలంగాణ ప్రజలకు ఇవన్నీ తెలుసు.
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన విధానాలతో మాతాశిశు సంక్షరణ (ఎన్ఎంఆర్, ఎంఎంఆర్)లో తెలంగాణ దేశంలోనే ఉత్తమస్థాయి లో నిలుస్తున్నది. ఈ రెండు విభాగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో మూడోస్థానంలో ఉన్నది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) ప్రమాణాల ప్రకారమే తెలంగాణ మాతాశిశు వైద్యంలో ఉత్తమంగా ఉంటున్నది. 2015లో నవజాతశిశు మరణాల రేటు 34 ఉంటే ఇప్పుడది 21కి తగ్గింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న కేసీఆర్ కిట్ పథకంతో మహిళా, శిశు ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్‌లో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా నిలిచింది. కాన్పులు వందకు వందశాతం దవాఖానాల్ల్లోనే జరుగుతున్నాయి. వీటిలో 80 శాతం ప్రభుత్వ దవాఖానాల్లోనే, అవీ సాధారణ కాన్పులు జరుగుతున్నాయి. ఇదీ కేసీఆర్ కిట్ ఘనత. సమగ్ర, సుస్థిరాభివృద్ధి (360 డిగ్రీల) అంటే ఇదే మరి.
ఒక సామాజిక ఇంజినీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇలాంటి సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. వైద్య సంస్కరణల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనేది విప్లవాత్మక విధానం. 1986లో నేను ఎంబీబీఎస్‌లో జాయిన్ అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ ఉండేది. అప్పుడు తెలంగాణ ప్రాంతంలో మూడు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆ ర్ ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. కాలేజీకి అనుబంధంగా కనీసం 300 పడకల నుంచి 500 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా పేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం వారికి దగ్గర్లోనే ఉచితంగా అందుతున్నది. వైద్యం, విద్యతో పాటు ఒక హెల్త్ సెంటర్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ప్రతి జిల్లాలకు దోహదపడుతున్నది. ఆరోగ్యమే మహా భాగ్యం అనేది ఎప్పటికీ వాస్తవమైన మాట. నాణ్యమైన, ఆధునిక అల్లోపతి వైద్యం పేదలకు అందుబాటులోకి రావడంతో వారి ఆరోగ్య స్థితితోపాటు వైద్యానికి చేసే ఖర్చులు మిగిలి వారి ఆర్థిక ప్రమాణాలు పెరుగుతాయి. ఇలాంటి ఆలోచన చేసి, దాన్ని వేగంగా అమలుచేసిన కేసీఆర్ ఒక రెవల్యూషనరీ సోషల్ సైంటిస్ట్.
ఏటా వెయ్యి మంది క్వాలిఫైడ్, ఎంబీబీఎస్ డాక్టర్లు ప్రజల ఆరోగ్యసేవలకు అంకితమవుతున్నారు. ఇది నిజంగా వైట్ కోట్ రెవెల్యూషన్. దీనివెనుక పింక్ హార్ట్ కేసీఆర్ పట్టుదల ఉన్నది. అందుకే మళ్లీ మన కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి. వేరే ఎవ్వరు వచ్చినా మంద మీద తోడేలు పడ్డట్టే అయితది. వంద, నూటాయాభై స్పీడులో క్రూయిజ్ కంట్రోల్ మోడ్‌లో పోతున్న తెలంగాణ సమగ్ర, సుస్థిర ప్రగతికి స్పీడ్ బ్రేక్ పడ్డట్టయితది. అప్పుడు సున్నా నుంచి మళ్లీ మొదలు కావాల్సిందే.
అందుకే తెలంగాణ ప్రజలకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. మనకు కేసీఆరే దిక్సూచి. ఆయనే మనకు శ్రీ రామరక్ష. కేసీఆర్ గ్లోబల్ థింకింగ్‌తో లోకల్ డెవలప్మెంట్ చేసి చూపించారు. పొరపాటున వేరే ఎవరైనా వస్తే వాళ్లు ఢిల్లీ, గల్లీ థింకింగ్‌తో మన తెలంగాణను నాన్‌లోకల్ డెవలప్ మెంట్‌గా చేస్తారు. తెలంగాణ ప్రగతిని నిరాటంకంగా కొనసాగించేందుకు ఉద్యమస్ఫూర్తితో మనమందరం మళ్లీ కేసీఆర్‌ను ఆశీర్వదించాలె. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలె. తెలంగాణ రాష్ట్ర సాధన కలను పూర్తిగా సాకారం చేసుకోవాలె.(వ్యాసకర్త: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్)
-డాక్టర్ మాగంటి శేషుమాధవ్