Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 22ఏను అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ నాయకులు, రేవంత్‌రెడ్డి సోదరులు అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారని విమర్శించారు. 22ఏ స్కామ్‌లో రేవంత్‌రెడ్డి ఏ 1 అయితే, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి ఏ2 అని నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్ నేతలకు తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే.. మాకు పోరాటం తెలుసు.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినోళ్లం’ అని గుర్తుచేశారు. దరఖాస్తులు లేకుండా.. బాధితులు ఆఫీసుల చుట్టూ తిరుగకుండా 22ఏ భూములను విడిపించాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 22 ఏ బాధితుల సమస్యలు పరిష్కరిస్తరా? లేక ప్రజల పాదాల కింద నలిగి చస్తరా? అనేది కాంగ్రెస్ నేతలు తేల్చుకోవాలి’ అని హెచ్చరించారు.
బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రెండేండ్లలో కేసీఆర్ సీఎం అవడం ఖాయమని, ఇలాంటి భూ సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడూ నాదర్గుల్ భూముల స్కామ్‌ను బీఆర్ఎస్సే బయటపెట్టిందని గుర్తుచేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని 373 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు హర్షారెడ్డి డైరెక్టర్‌గా ఉన్న కంపెనీకి ధారాదత్తం చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.
ప్రైవేట్ సెక్యూరిటీని ఆ భూములకు రక్షణగా పెట్టి పోలీసులు, అధికారుల సాయంతో భూములు కాజేసేందుకు మంత్రి పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ భూముల్లోకి తమను పోనిస్తలేరని బాధిత రైతులు ఇప్పుడు తెలంగాణభవన్‌కు వచ్చారని చెప్పారు. ‘తాతముత్తాల నుంచి చెరువుల్లో చేపలు పట్టుకొని బతికినం. వ్యవసాయం చేసుకొని బతుకుతున్నం. ఇప్పుడు ప్రైవేట్ సైన్యం వచ్చి చుట్టూ రేకులు పాతి భూముల్లోకి వెళ్లకుండా బెదిరిస్తున్నరు’ అని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. క్రషర్లతో అక్కడి గుట్టలను పిండి చేస్తున్నారని, కాలువలు, చెరువులను ధ్వంసం చేసుస్తున్నారని, బీఆర్ఎస్ నేతలు హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇది ముమ్మాటికీ 30 శాతం కమీషన్ సర్కారే. ఇదే విషయాన్ని రాష్ట్రమంతా కోడై కూస్తున్నది. ఊర్లకు ఊర్లు, పొలాలు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, కాలనీలను అడ్డగోలుగా 22ఏలో చేర్చిండ్రు. నిన్నటివరకు నీ భూమి.. పొద్దున నిషేధిత భూమి! ఒక్క కలం పోటుతో నిషేధిత భూమిగా మార్చిండ్రు. ఇల్లు కట్టనీకి లేదు. అమ్ముకోవడానికి లేదు. బ్యాంకు లోన్లూ రాకుండా చేసిండ్రు.
– పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా హరీశ్
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రూ.10 వేల కోట్ల విలువైన సీలింగ్ ల్యాండ్‌ను కూడా మంత్రి పొంగులేటి బినామీ కంపెనీలతో కాజేయాలని చూస్తున్నారని హరీశ్ ఆక్షేపించారు. సీలింగ్ నిర్దేశించేది ఆర్డీవో అని, సీలింగ్ ల్యాండ్‌ను నిర్ధారించకముందే బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని విమర్శించారు. దానికి క్రయవిక్రయాలు చేయకూడదని చట్టం చెప్తున్నదని చెప్పారు. ప్రభుత్వ భూమిగా ఆర్డీవో చేతిలో ఉండాల్సి ఈ అగ్రికల్చర్ సీలింగ్ ల్యాండ్‌ను ‘ఏక్యూ స్వేర్ కోహినూర్ గ్రూప్’ రిజిస్టర్ చేయించుకున్నదని చెప్పారు. సీలింగ్ డిక్లేర్ కాకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. అందులోని క్రిస్టల్ మాన్షన్ కంపెనీలో హర్షారెడ్డి, పొంగులేటి, సింగిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. బినామీ కంపెనీ పేర్లతో ప్రభుత్వ సీలింగ్ భూమిని కాజేయాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల్లో కోహినూర్ గ్రూప్ అని బోర్డు పెట్టారని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ బయటకు తీసిందని, ఏప్రిల్ 5న ప్రెస్‌మీట్ పెట్టిందని, ఏప్రిల్ 10న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 12న బోర్డును మార్చారని తెలిపారు.
ఆగస్టు 28న మళ్లీ కోహినూర్ గ్రూప్ పేరుతో బోర్డు నెలకొల్పారని తెలిపారు. పాత సర్వే నంబర్ 119 (కొత్త సర్వేనంబర్ 613)లోని 373 ఎకరాలు ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చినట్టు భూభారతిలో పేర్కొన్నారని చెప్పారు. కానీ, క్షేత్రస్థాయి లో వెళ్లి పరిశీలిస్తే ఆ భూమి ప్రైవేట్ వ్యక్తు ల ఆధీనంలో ఉన్నదని వివరించారు. కా నీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అది ప్రైవే ట్ భూమి అని చెప్తున్నారని విమర్శించా రు. ఈ భూమికి సంబంధించిన వివాదం సుప్రీంకోర్టులో నడుస్తుండగా, 2025 మార్చి 17న ఆర్డీవో అది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో కూడా పేర్కొన్నారని తెలిపారు.
ఇక్కడ భూములు కొనుగోలు చేసిన వారు అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్తే అది ప్రభుత్వ భూమి అని ఆర్డీవో దగ్గరే తేల్చుకోవాలని గత నెలలోనే ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. 373 ఎకరాలు ప్రభుత్వ భూమి అని అ ప్పిలేట్ అథారిటీ స్పష్టంగా చెప్పినా కలెక్ట ర్ అక్కడి వెళ్లి ఆ భూమిని ఎందుకు స్వా ధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. హైడ్రా కమిషనర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల ని డిమాండ్ చేశారు. రెవెన్యూశాఖ మం త్రి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి ప్రైవేట్ సైన్యం, బినామీ కంపెనీ ఆధీనంలో ఉన్న ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి నకిలీ సేల్ డీడ్‌తో భూములు కాజేయాలని చూస్తున్నాడని హరీశ్ మండిపడ్డారు. ‘రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాములలో 1967లో లక్షీనారాయణ అనే వ్యక్తి లీలాబాయికి భూమి విక్రయించారు. లీలాబాయి 1985 శెట్టిలింగం అనే వ్యక్తికి అమ్మారు. శెట్టిలింగం ఆ భూమిని 86 ప్లాట్లుగా చేసి పలువురికి విక్రయించారు. భూమి ఇద్దరి చేతులు మారింది. అయితే, మొదటి భూ యజమాని లక్షీనారాయణ మనవడితో పాత డేట్లో ఎనుముల తిరుపతిరెడ్డి రెండో సేల్ డీడ్ చేసుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రంగారెడ్డి కోర్టుకు వెళ్తే ఆ సేల్ డీడ్ చెల్లదని కొట్టివేసింది. భూమి అసలు పట్టాదారులదే అని పేర్కొంటూ తిరుపతిరెడ్డి క్లెయిమ్‌ను కొట్టివేసింది. దానిపై హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లగా స్టేటస్ కో పెండింగ్‌లో ఉన్నది. ఈ క్రమంలో తిరుపతిరెడ్డి నాలా కన్వర్షన్‌కు రెండుసార్లు దరఖాస్తు చేస్తే తిరస్కరణకు గురైంది.
అర్బన్ పట్టా కావాలని దరఖాస్తు చేశారు. భూమి అతనిది కాదని నాడు అధికారులు తిరస్కరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో ఆ భూమి తీరు మారిపోయింది. అప్పటికే ప్లాట్లు అయ్యి ఇండ్లు కూడా కట్టుకున్న భూమి మీద ఉన్న కేసులను కూడా చూడకుండా 2025, మేలో నాలా కన్వర్షన్ చేసిండ్రు. ఇప్పుడు నాలా కన్వర్షన్ అయింది సెటిల్మెంట్ కావాలని అంటున్నరు. ఓపెన్‌గా కబ్జా పెడుతున్నరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇండ్లు కట్టుకున్నోళ్లతో సెటిల్మెంట్లకు దిగుతుండ్రు’ అని హరీశ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇల్లును ఎట్లయితే 22ఏ నుంచి రిలీజ్ చేశారో ప్రజల ఆస్తులను కూడా అట్లనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.