హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రికార్డుల మోత మోగిస్తున్నది. ఈ నెల 9న (బుధవారం) ఏకంగా 19,543 మోగావాట్ల గరిష్ఠ డిమాండ్‌తో ఆల్‌టైమ్ రికార్డు నమోదైంది. ఈ డిమాండ్ గురువారం 19,467 మెగావాట్లుగా, శుక్రవారం 18,954 మోగావాట్లుగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధిక గరిష్ఠ డిమాండ్. ఎండలు మండిపోతుండటం, వర్షాలు లేకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ఠ డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ పెరుగుదల కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. జాతీయ స్థాయిలోనూ అదనంగా దాదాపు 100 గిగావాట్ల మేర డిమాండ్ పెరిగినట్టు విద్యుత్తు సంస్థల అధికారులు చెప్తున్నారు.
సాధారణంగా ఏటా ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత వల్ల విద్యుత్తు డిమాండ్ అధికంగా ఉంటుంది. కానీ, ఈసారి వానకాలంలోనే పరిస్థితులు వేసవిని తలపిస్తున్నాయి. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగి ఉకపోత అధికమవడం, వ్యవసాయ డిమాండ్ నేపథ్యంలో విద్యుత్తు వినియోగం ఒకసారిగా పెరిగింది. వారం క్రితం వరకు రాష్ట్రంలో పీక్ డిమాండ్ 18 వేల మెగావాట్లలోపే ఉన్నప్పటికీ సెప్టెంబర్ 9న అది ఏకంగా 19,543 మెగావాట్లకు చేరింది. గత గరిష్ఠ స్థాయితో పోలిస్తే ఇది దాదాపు 1,000 మెగావాట్లు అధికం.
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున 310 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతున్నది. కానీ, ఇందుకు అవసరమైనంత ఉత్పత్తి లేకపోవడంతో బయటి నుంచి విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. టీజీ జెన్కో నుంచి రోజుకు సుమారు 90 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే అందుతుండటంతో సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు (సీజీఎస్ ), ఇతర మార్గాల ద్వారా 140 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొనుగోలు చేస్తున్నారు. వచ్చే వేసవిలో డిమాండ్, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
