వాతావరణ మార్పులు భారతీయ మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యం.. వారిని మెనోపాజ్‌కు దగ్గర చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 15 కోట్ల మంది మహిళలను బాధితులుగా మార్చేశాయి.
మెనోపాజ్ అంటే కేవలం ఒక బయోలాజికల్ ప్రక్రియ మాత్రమే కాదు. ఇది శరీరం, పర్యావరణం, సామాజిక అసమానతల ప్రభావాల కలయిక కూడా! వైద్యపరంగా.. వరుసగా 12 నెలల పాటు పీరియడ్స్ రాకపోవడాన్ని మెనోపాజ్‌గా ధ్రువీకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మెనోపాజ్ సగటు వయసు సుమారు 51 సంవత్సరాలు. అయితే, ఇండియన్ మెనోపాజ్ సొసైటీ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారతీయ మహిళలు చాలా ముందుగానే, అంటే సుమారు 46 ఏండ్ల వయసులోనే దీనిని ఎదుర్కొంటున్నారని తేలింది. దీనికి కొన్నేండ్ల ముందుగానే.. అంటే దాదాపు 40 ఏండ్ల ప్రారంభంలోరే ‘పెరిమెనోపాజ్’ మొదలవుతుంది. ఈ దశలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి.
దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తాయి. శరీరంలో అకస్మాత్తుగా సెగలు రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం, గుండె దడ, బ్రెయిన్ ఫాగ్, ఆందోళన, మూడ్ స్వింగ్స్, కీళ్ల నొప్పులు, ఎముకల సాంద్రత తగ్గడం, అలసట, బరువులో మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఇండియన్ మెనోపాజ్ సొసైటీ సర్వే ప్రకారం.. దాదాపు 70 శాతం మంది మహిళలకు పెరిమెనోపాజ్, దాని లక్షణాల గురించి కనీస అవగాహన లేదట. చాలామంది ఈ మార్పులను కేవలం సహజ వృద్ధాప్యం, మానసిక ఒత్తిడి, సాధారణ బలహీనతగానే భావిస్తున్నారట. దాంతో, వారికి సరైన సమయంలో సరైన చికిత్స అందడం లేదని నిపుణులు అంటున్నారు. ఇక మెనోపాజ్ ఒక శారీరక మార్పే అయినప్పటికీ.. దానిపై పర్యావరణ ప్రభావం కూడా ఎక్కువగానే ఉన్నది. వడగాలులు తీవ్రరూపం దాల్చడం, సగటు ఉష్ణోగ్రతలు పెరగడం, గాలి నాణ్యత క్షీణించడం లాంటివి మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తూ.. మెనోపాజ్ అసౌకర్యాన్ని మరింత పెంచుతున్నాయి.
బయటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మహిళల శరీరంలో సెగలు రావడం మరింత తీవ్రమవుతాయి. డీహైడ్రేషన్, తీవ్ర అలసట, నిద్రలేమి సమస్యలు ఎక్కువవుతాయి. ఇక వాయు కాలుష్యం ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నది. సూక్ష్మ ధూళికణాల ప్రభావంతో హార్మోన్ల అసమతుల్యత, శరీరంలో ఇన్ఫ్లమేషన్, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్త విశ్లేషణ ప్రకారం.. తీవ్రమైన వేడి వల్ల ప్రమాదంలో పడేవారిలో 55 శాతం మంది మహిళలే ఉన్నారు. అంతేకాకుండా, దేశంలో చేపట్టే ఆరోగ్య సర్వేలన్నీ.. 15 నుంచి 49 ఏండ్ల మధ్య వయసు గల మహిళలపైనే దృష్టి పెడతాయి. దీనివల్ల ఎక్కువ వయసున్న మహిళలు గణాంకాల్లో కనిపించకుండా పోతున్నారు. ఫలితంగా వారి అవసరాలకు సంబంధించిన విధాన రూపకల్పన మందగిస్తున్నది. ఈ క్రమంలో మెనోపాజ్ విద్యను ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో అనుసంధానించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. లక్షణాలను గుర్తించి, మహిళలకు సరైన వైద్య మార్గదర్శకత్వం చేసేలా ఆశ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలనీ, కార్యాలయాల్లో వెసులుబాటుతో కూడిన విధానాలు, సదుపాయాలు కల్పించాలని సూచిస్తున్నారు.