సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో పాలన పూర్తిగా పడకేసింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కొన్ని నెలలుగా అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటుండగా.. సంబంధిత ఆఫీసుల్లో ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న సుమారు 6000 మంది శాశ్వత ఉద్యోగులతో పాటు వేలాది మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఎన్నికల విభాగం విధులు కేటాయించింది.
టౌన్ ప్లానింగ్, ప్రాపర్టీ టాక్స్, శానిటేషన్ వంటి కీలక విభాగాల అధికారులు కార్యాలయాలకు రాకపోవడంతో ఆయా సెక్షన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, సెక్షన్ ఆఫీసర్లు ఓటర్ల సర్వేలోనే నిమగ్నమవ్వడంతో కొత్త భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు , అక్రమ నిర్మాణాల ఫిర్యాదుల పరిశీలన పూర్తిగా నిలిచిపోయింది. ఒక్కో జోన్లో వందలాది నిర్మాణ రంగ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్‌లో పెండింగ్‌ల జాబితా రోజురోజుకు పెరిగిపోతుండడంతో భవన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంది. వారం రోజుల వ్యవధిలో చేతికి అందాల్సిన బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు రెండు వారాలుగా సకాలంలో అందడం లేదు. ఫలితంగా ఈ సర్టిఫికెట్ల కోసం అటు తల్లిదండ్రులు, ఇటు డెత్ సర్టిఫికెట్లకు బాధిత కుటుంబ సభ్యులు మీ సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పది రోజులు గడిచిన బర్త్ డే సర్టిఫికెట్ ఆన్లైన్లో రావడం లేదని బన్సీలాల్‌పేటకు చెందిన మహాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. 60 సర్కిళ్ల పరిధిలోని దాదాపు 2500 సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ధ్రువీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఫ్రంట్ లైన్ సిబ్బంది అయిన టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లను ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల నుంచి తప్పించి ఇంటిం టి సర్వేకు పంపడంతో జీహెచ్ ఎంసీ ఖజానాకు గండి పడింది. రోజుకు రావాల్సిన రూ.50 లక్షల నుంచి రూ. కోటి వరకు పన్ను రాబడి నిలిచిపోవడంతో కార్పొరేషన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటోంది. ఆదాయం పడిపోవడంతో పారిశుధ్య, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, విశ్రాం త సిబ్బంది పెన్షన్లు చెల్లించలేక యంత్రా ంగం చేతులెత్తేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ చొరవ తీసుకుని పౌర సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.