నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి బెయిల్ వ్యవహారంలో సైఫాబాద్ పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. వారికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను వాపస్ చేస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. తమపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ ఆ ఎమ్మెల్సీలు మీడియా సమావేశంలో మాట్లాడారని, తద్వారా ఇటీవల బెయిల్ మంజూరు సందర్భం గా 1వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని సైఫాబాద్ జోన్ ఏసీపీ మత్తయ్య కోర్టుకు తెలిపారు.
ఈ నేపథ్యంలో తాతా మధు, నవీన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, వారి బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. దీంతో బెయిల్‌ను రద్దుచేసే అధికారం తనకు లేదని జడ్జి స్పష్టం చేస్తూ.. ఉన్నత న్యా యస్థానాన్ని ఆశ్రయించాలని ఏసీపీ మత్తయ్యకు సూ చించారు. ఈ కేసును సికింద్రాబాద్ కోర్టుల ప్రాంగణంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశామని, అక్కడ అప్పీల్ చేసుకోవాలని జడ్జి చెప్పడంతో ఏసీపీ మత్తయ్య తమ పిటిషన్‌ను వాపస్ తీసుకుని వెనుదిరిగారు.