హైదరాబాద్, సెప్టెంబర్11 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ సహా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్లను కో ఆప్షన్ సభ్యులుగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2018 సవరణ బిల్లును అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరపున బిల్లును మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కో ఆప్షన్ సభ్యులుగా నియమితులు కావాలంటే సంబంధిత మున్సిపాలిటీలో ఓటరుగా నమోదై ఉండడంతోపాటు, 21 ఏండ్లు నిండినవారై ఉండాలని తెలిపారు.
అదేవిధంగా ప్రజావిశ్వాసం పేరిట అటవీ, ఆబ్కారీ తదితర చట్టాల సవరణకు సంబంధించి బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఆయా చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భంలో ఇప్పటివరకు విధిస్తున్న జరిమానాలు, శిక్షలను సవరించేందుకు ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. కోర్ అర్బన్ రీజియన్ బిల్లును సైతం ప్రవేశపెట్టారు. మున్సిపాలిటీల చట్టం సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు శాసనమండలిలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.