Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలన ప్రజల చుట్టూ తిరిగితే..రేవంత్‌రెడ్డి పాలన భూముల చుట్టూ పరిభ్రమిస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. హైడ్రా, మూసీ, ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్టు ఏదైనా భూ దోపిడీ కేంద్రంగానే సాగుతున్నదని నిప్పులు చెరిగారు. అసిఫాబాద్ నుంచి హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ దాకా ఎవరి నోట విన్నా 22 ఏ మాటే వినిపిస్తున్నదని, కాంగ్రెస్ సర్కార్ కోటికి పైగా ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. ఒక్క గీతతో లక్షలాది మంది ఆస్తులను జీరో వాల్యూ చేసిందని, 22ఏ ముసుగులో ప్రభుత్వం భారీ స్కామ్‌కు తెరలేపిందని, ప్రజల నుంచి 30 శాతం కమీషన్ల పేరిట నిలువునా దోచుకుంటున్నదని విరుచుకుపడ్డారు.
కట్నం కింద ఇచ్చిన భూములను కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంతో అల్లుండ్లు తీసుకోలేని పరిస్థితి ఉన్నదని, ఉన్న భూములను కొడుకులకు పంచలేని దుస్థితి నెలకొన్నదని వాపోయారు.. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణలేదు.. పాలనపై సోయిలేదు’ అని తూర్పారబట్టారు. 22ఏ నిషేధిత భూముల స్కామ్‌పై శుక్రవారం తెలంగాణ భవన్లో హరీశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 1908లో 22ఏ ప్రకారం ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్, ల్యాండ్ సీలింగ్ భూములను కాపాడాలనే ఉద్దేశంతో నిషేధిత జాబితా తెచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం 22ఏను దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్పై నెపం నెడుతూ తప్పించుకొనేందుకు యత్నిస్తున్నదని ధ్వజమెత్తారు.
హెచ్‌సీయూలో 400 ఎకరాల భూమిని కబ్జా పెట్టే కుట్ర చేశారని, కానీ విద్యార్థులు, బీఆర్ఎస్ ప్రతిఘటించడంతో వెనక్కితగ్గారని హరీశ్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఆ భూములను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదువపెట్టి 9.5 శాతం వడ్డీకి రూ.10 వేల కోట్ల అప్పుతెచ్చాడని.. అప్పు ఇప్పించిన బ్రోకర్‌కు రూ. 200 కోట్ల లంచం ఇచ్చాడని సంచలన విషయాలు వెల్లడించారు. మేడ్చల్ జిల్లాలో 8 వేల ఎకరాలను బీఎస్ఈలో కుదువపెట్టి, మరో రూ. 10 వేల కోట్ల అప్పులు తెచ్చాడని, అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు తీసుకున్నాడని, అల్లుడికి, అన్నదమ్ములకు వందల ఎకరాలు కట్టబెట్టాడని చెప్పారు.
ఇప్పుడు పాలిటెక్నిక్ భూములపై ముఖ్యమంత్రి కన్నుపడిందని, వాటి కోసమే పాలిటెక్నిక్ కాలేజీలపై కత్తిగట్టిండని సంచలన ఆరోపణలు చేశారు. హిల్ట్ పాలసీ, హైడ్రా, మూసీ వెనుక ఉన్నది భూ దోపిడీ కుట్రేనని దుయ్యబట్టారు. హైడ్రాకు బడాబాబుల ఇండ్లు కనిపించవని, పేదల గూళ్లు కూల్చడం మాత్రం తెలుసని దెప్పిపొడిచారు. ‘మూసీ సుందరీకరణకు అటు వంద, ఇటు వంద ఎకరాలు ఎందుకు రేవంత్‌రెడ్డీ? మల్లన్న సాగర్ నీళ్లు తెచ్చి మూసీలో పోస్తే సరిపోదా? కేటీఆర్ ప్రారంభించిన ఎస్టీపీలను పూర్తిచేసే సోయిలేదా? ఇందుకు రూ.లక్ష కోట్లు తగలెయ్యాలా?’ అని ప్రశ్నలవర్షం కురిపించారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 3 వేల ఎకరాల లూటిఫికేషన్ కుట్ర దాగి ఉన్నదని ధ్వజమెత్తారు.
22ఏ ముసుగులో భూములను కొల్లగొట్టే కుట్ర దాగి ఉన్నదని, అందుకే ప్రజలకు వారసత్వంగా వచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారని హరీశ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ది ముమ్మాటికీ 30 శాతం కమీషన్ల గవర్నమెంటేనని రాష్ట్రమంతా కోడై కూస్తున్నదని దెప్పిపొడిచారు. ఊర్లకు ఊర్లు, ప్రజల నివాసాలు, అపార్ట్మెంట్లు, కాలనీలు అడ్డగోలుగా 22ఏలో చేర్చారని చెప్పారు. పాత ఇల్లు కూలగొట్టి కొత్తది కట్టుకుందామన్నా, బ్యాంకుల్లో లోన్లు తీసుకుందామన్నా వీలు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కొత్తగా 22ఏలో ఒక్క గుంట కూడా పెట్టలేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి బొంకుతున్నాడని హరీశ్ మండిపడ్డారు. ‘ఇంతకన్నా పచ్చి అబద్ధం ఉంటుందా? ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఉన్నది ఆయన వ్యవహారం’ అని తూర్పారబట్టారు. కేసీఆర్ పాలనలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి రాలేదని గుర్తుచేశారు. ‘సమస్యలను బీఆర్ఎస్ పరిష్కరించింది.. కాంగ్రెస్ సర్కార్ సమస్యలను సృష్టించింది’ అంటూ విమర్శించారు. ‘డిసెంబర్ 31, 2025 నాడు జీవో 179 జారీ చేశారు. 22ఏ కోసం భూముల లెక్కలు చెప్పాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. కొత్త ప్రొహిబిషన్ భూముల లిస్ట్ తయారు చేయాలని 2025, సెప్టెంబర్ 11న ఆర్డర్లు ఇచ్చారు. 2025 నవంబర్ 11న జనగామ కలెక్టర్ లిస్ట్ తయారు చేశారు.. తర్వాత భూములను నిషేధిత జాబితాలో పెడుతూ గెజిట్ ఇచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఇలాగే గెజిట్లు విడుదల చేశారు.
సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారు. అదీ ట్రైబల్ ఏరియా.. వారి పరిస్థితి ఏంది? మంచిర్యాల నియోజకవర్గంలో 11 వేల ఇండ్లు నిషేధిత జాబితాలో పెట్టారు’ అంటూ పీపీటీ ద్వారా ఆధారాలతో ఎండగట్టారు.. ‘పొంగులేటీ.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తవ్? ఎంతసేపు బీఆర్ఎస్ను తిట్టుకుంటూ బతుకుతవ్?.. దమ్ముంటే రాజీనామా చెయ్’ అని సవాల్ విసిరారు. ‘నువ్వు అసెంబ్లీలో తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో తప్పించుకోలేవు’ అని హెచ్చరించారు.
రాజ్యమంటే భూమి కాదు.. భూమిపై బతికే మనుషులనే విషయాన్ని కాంగ్రెస్ మరచిపోయింది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టు.. భూమి చుట్టూ రేవంత్‌రెడ్డి పరిభ్రమిస్తున్నడు. లగచర్ల నుంచి హిల్ట్ పాలసీ వరకు అన్నీ కుంభకోణాలే. రేవంత్‌రెడ్డి ప్రతి నిర్ణయం వెనుక భూమి.. భూమి! ఒక్క గీతతో ప్రజల ఆస్తులను జీరో వాల్యూ చేసిండు.
-హరీశ్‌రావు
నిషేధిత జాబితా పేరిట కాంగ్రెస్ సాగిస్తున్న స్కామ్ బట్టబయలవుతుందనే భయంతోనే బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిందని హరీశ్ విమర్శించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వమే భక్షిస్తున్నదని ధ్వజమెత్తారు. ‘భూమి అనేది ప్రభుత్వం దృష్టిలో నాలుగు గజాల స్థలం కావొచ్చు.. కానీ అదే ఒక రైతుకు జీవనాధారం.. పేదవాడికి జీవిత కాలం పొదుపు.. తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం పెట్టుకున్న భరోసా.. ఒక తండ్రి కూతురు పెండ్లి కోసం దాచుకున్న ఆస్తి.. ఒక పేద కుటుంబానికి వైద్యం కోసం చివరి ఆధారం’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రజల భూములపై ప్రభుత్వం అనిశ్చితి అనే కత్తిని వేలాడదీసింది.. భూమిని మార్కెట్ వస్తువుగా చూస్తున్నది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ముమ్మాటికీ 30 శాతం కమీషన్ల గవర్నమెంటే. ఇది నేను చెప్పడంలేదు. రాష్ట్రమంతా కోడై కూస్తున్నది. ఊర్లకు ఊర్లు, ప్రజల నివాసాలు, అపార్ట్మెంట్లు, కాలనీలను అడ్డగోలుగా 22ఏలో చేర్చిండ్రు. నిన్నటి వరకు నీ భూమి. పొద్దున నిషేధిత భూమి! ఒక్క కలం పోటుతో నిషేధిత భూమిగా మార్చిండ్రు. పాత ఇల్లు కూలగొట్టి కొత్తది కట్టుకుందామంటే 22ఏలో చేర్చిండ్రు. బ్యాంకుల్లో లోన్లు తీసుకుందామంటే రాకుండా చేసిండ్రు.
-హరీశ్‌రావు
హెచ్‌సీయూ భూములను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదువపెట్టి రేవంత్‌రెడ్డి 9.5 శాతం వడ్డీకి రూ.10 వేల కోట్ల అప్పుతెచ్చిండు.. రుణం ఇప్పించిన బ్రోకర్‌కు రూ. 200 కోట్ల లంచమిచ్చిండు.. మేడ్చల్ జిల్లాలో 8 వేల ఎకరాలను బీఎస్ఈలో కుదువపెట్టి, మరో రూ. 10 వేల కోట్ల అప్పు తెచ్చిండు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు తీసుకున్నడు. అల్లుడికి, అన్నదమ్ములకు వందల ఎకరాలు కట్టబెట్టిండు. ఇప్పుడు పాలిటెక్నిక్ భూములపై కన్నేసిండు.
-హరీశ్‌రావు
రియల్ ఎస్టేట్ వ్యాపారులైన రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ప్రజల భూములపై గద్దల్లా వాలుతున్నరు. పాలకులుగా ప్రజల ఆస్తులను రక్షించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా ప్రజా ఆస్తులను కొల్లగొడుతున్నరు.
-హరీశ్‌రావు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తమ బాధ్యతలు విస్మరించారని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత ఆస్తులు, రెవెన్యూ పెంచుకోవడమే లక్ష్యంగా భారీ దోపిడీకి తెరతీశారని మండిపడ్డారు. హామీ ఇవ్వకున్నా కొత్త పథకాలు తెచ్చిన నాయకుడు కేసీఆర్ అయితే, ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టిన మోసగాడు రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టారు. ‘కేసీఆర్‌కు ఓటేయకుండా తప్పు చేశామని ఓ రైతు చెప్తున్నడు’ అని గుర్తుచేశారు.