Congress Scam | హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో స్కామ్ వెలుగు చూసిందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సంచలన వివరాలు వెల్లడించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కోసం కట్టే చలాన్లో ఈ స్కామ్ బయటకు వచ్చిందని చెప్పారు. రూ.లక్ష కట్టాల్సిన చోట రూ.10 వేలు, రూ.10 లక్షల చలాన్ కట్టాల్సిన చోట రూ. లక్ష చలాన్లు కడుతున్నారని తెలిపారు. జనగామ, యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో 2024 నుంచి 2026 మధ్య 1,390 డాక్యుమెంట్లకు ఇలానే చలాన్లు కట్టారని చెప్పారు. ఇంత పెద్ద స్కామ్‌పై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఏమిటని నిలదీశారు. కేవలం ఇద్దరు మీ సేవ ఆపరేటర్లను అరెస్ట్ చేసి వదిలిపెట్టారని, ఎమ్మార్వోలు, వారి కింద ఉండే ఆఫీసర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు.
బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే సిట్ వేసే ప్రభుత్వం ఈ అంశంపై ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ‘10 శాతం డబ్బులు ప్రభుత్వానికి చెల్లించి మిగిలిన డబ్బులను మధ్యలో వాళ్లు నొక్కేసిండ్రు. ఇప్పుడు మీరు చలాన్లు కట్టలేదని కొంత మంది రైతులకు నోటీసులు జారీ చేసిండ్రు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మొత్తం స్కామ్‌లో ఎంత మంది ఉన్నారు? ఎన్ని జిల్లాల్లో స్కామ్ జరిగిందో బయటకు తీసి బాధ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూభారతి, 22 ఏను అడ్డం పెట్టుకొని రూ. వేల కోట్ల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇంటిని 22 ఏ నుంచి ఎలా తొలగించారో అలాగే సామాన్యుల భూములను తొలగించాలని డిమాండ్ చేశారు.
గచ్చిబౌలిలో డైమండ్ హిల్స్ ఇష్యూలో రూ.1,000 కోట్ల స్కామ్ జరిగినట్టు హరీశ్ ఆరోపించారు. ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టిన, సుప్రీం కోర్టు స్టేటస్ కో ఉన్న 10 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయిపోయిందని తెలిపారు. 22ఏలో ఉంటే రిజిస్ట్రేషన్ చేసేది లేదని చెప్తున్న అధికారులు మరి 22ఏలో ఉన్న ఈ 10 ఎకరాలకు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు. ఈ అంశంపై కాలనీ వాసులు ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఫిర్యాదు చేసినా రిజిస్ట్రేషన్ రద్దు కావడం లేదని, సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పీపీటీలో హరీశ్ ప్రదర్శించారు. రాందాస్‌పల్లిలో 400 ఎకరాల భూమి ఉన్నదని, అందులో 100 ఎకరాలను 50 ఏండ్ల కింద ఆనాటి ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిందని చెప్పారు.
100 ఎకరాల పట్టా భూమిని రైతుల వద్ద కొని పేదలకు బాండెడ్ లేబర్ కింద పంచినట్టు వివరించారు. ఇందులో 100 ఎకరాలను నిషేధిత జాబితాలో పెడితే ఎలాంటి అభ్యంతరం లేద ని, కానీ మిగిలిన 300 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని మండిపడ్డారు. ఈ విషయంలో రైతులు ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ భూములు పట్టా భూములని.. పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చామని ఆర్డీవోనే కలెక్టర్‌కు లేఖ రాసినట్టు వెల్లడించారు. అయినా డీల్ సెటిల్ కాకపోవడంతో నిషేధిత జాబితాలోంచి తొలగించడం లేదని మండిపడ్డారు.
రాఘవ కన్స్ట్రక్షన్స్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని హరీశ్ విమర్శించారు. ఫిబ్రవరి 18న ఫినిక్స్ సంస్థకు 45 అంతస్తులు, రెసిడెన్షియల్ నిర్మాణాలు చేపట్టవచ్చని టీజీఐఐసీ అనుమతి ఇచ్చిందని, మరుసటి రోజే రాఘవ సంస్థతో ఫినిక్స్ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు వెల్లడించారు. వేల కోట్ల విలువ కలిగిన 7.19 ఎకరాల భూమి ఫినిక్స్ సంస్థ నుంచి రాఘవ సంస్థకు అప్పగించినట్టు చెప్పారు. ఈ అగ్రిమెంట్‌తో ఒక్క రోజులోనే రూ.వేల కోట్ల భూమి చేతులు మారిందని తెలిపారు. ఐరిస్ రెరా నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. రెవెన్యూ శాఖ మంత్రి, వారి అనుయాయులు లక్షల స్కేర్ ఫీట్లను అండర్ వాల్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, ఏడాదిలోపూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో వాటన్నింటినీ క్లియర్ చేసుకుంటున్నారని సంచనల విషయాలు బయటపెట్టారు. కొంపల్లిలో ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ అయి, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత ఆఫీసుకు వెళ్లాక ‘మీ భూమి 22ఏలో ఉంది’ అని చెప్పారని వెల్లడించారు.
ఈ విషయంలో పైన మాట్లాడుకోవాలని అధికారులు చెప్పారని, పై వాళ్లతో మాట్లాడి డీల్ సెట్ కాగానే నాలుగు నెలలకు 22 ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. రావిర్యాలలో టీజీఐఐసీ, మామిడిపల్లిలో 426 ఎకరాలు, గోపన్‌పల్లి భూములు, బుద్వేల్‌లో సర్వే నంబర్ 282, 283, 284లో 30 ఎకరాల భూములు, పుప్పాలగూడలో 14 ఎకరాల భూములు, పటాన్చెరులో శిల్పామోహన్ రెడ్డి పేరు మీద జరుగుతున్న వ్యవహారం, నోవా భూములు, వట్టినాగుల పల్లిలో భూముల వ్యవహారంలో అవకతవకలపై సందర్భం వచ్చినప్పుడు ఆధారాలతో బయట పెడుతామని పేర్కొన్నారు.
ఖానామెట్‌లో ఉన్న విలువైన భూములు నేటికీ నిషేధిత జాబితాలో ఉన్నాయని హరీశ్ వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో నాటి రంగారెడ్డి కలెక్టర్, నాటి రెవెన్యూ సెక్రటరీ సోమేశ్‌కుమార్ ఖానామెట్ 41/12, 41/ 13లను ప్రభుత్వ భూములుగా తేల్చారని తెలిపారు. ఆ భూమి నిషేధిత జాబితాలో ఉన్నా ఆక్రమించుకొని క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూముల్లో పనులు చేపడుతున్నారని మండిపడ్డారు. త్వరలోనే ఈ స్థలంలో పొంగులేటికి చెందిన రాఘవ లేదా అపర్ణ బోర్డు వెలుస్తుందని.. ఈ విషయంలో డీల్ నడుస్తున్నదని వివరించారు. పేదలపై విరుచుకుపడే హై డ్రాకు ఇది కనిపించడం లేదా? అని నిలదీశారు.
ఖాజాగూడ జంక్షన్లో ఉన్న సర్వే నంబర్ 20/1లో 1.17 గుంటల భూమిని కన్స్ట్రక్షన్ స్టోరేజ్ కోసం ‘సాస్ ఇన్ఫ్రా’ లీజుకు తీసుకున్నదని హరీశ్ వెల్లడించారు. అయితే మొత్తం 3.17 ఎకరాల భూమిని సంస్థ వాడుతున్నదని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాటి రంగారెడ్డి కలెక్టర్ వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని ఎమ్మార్వోను ఆదేశించినట్టు తెలిపారు. ఈ భూమిని బీఆర్ఎస్ హయాంలో బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చినట్టు వెల్లడించారు. 2025లో నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములు 2026కు వచ్చే సరికి నిషేధిత జాబితాలో మాయమయ్యాయని, దీని వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. కోర్టులో పెండింగ్‌లో ఉండగానే సాస్ ఇన్ఫ్రా పేరుపై రిజిస్ట్రేషన్ జరిగిందని వెల్లడించారు.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 80 ఏండ్ల విఠల రాధకు గజ్వేల్ నడిబొడ్డున 2 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నదని హరీశ్ వెల్లడించారు. ఆమె భర్త బాలకృష్ణ చనిపోయాక ఆ భూమి ఆమె పేరు మీద ఉండాల్సిందని, స్లాట్ బుక్ చేయకుండా, థంబ్ వేయకుండా, ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లకుండానే విఠల రాధ భూమి సాధు నర్సమ్మ అనే పేరు మీదికి మారిందని చెప్పారు. ఆ సాధు నర్సమ్మ ఈ ఏడాది ఆగస్టు 13న ఎకరం 5 గుంటలను తన కొడుకు సాధు లివాన్ రెడ్డికి, మరో ఎకరం 5 గుంటలను కూతురు వంగ స్వప్నకు ఆగస్టు 14న రిజిస్ట్రేషన్ చేసిచ్చినట్టు వెల్లడించారు. ఇదే విషయమై ఎమ్మార్వోను కలిస్తే ‘సారీ’ అని చెప్పి సైడ్ అయి పోయారని, దీంతో కలెక్టర్‌కు బాధితురాలు ఫి ర్యాదు చేసినట్టు వివరించారు. ప్రజల ఆ స్తులను ఎలా కొల్లగొడుతున్నారనే దానికి ఇది మరో ఉదాహరణ అని చెప్పారు.