KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూ బాగోతాలను అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేస్తామనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు గెంటేసిండ్రు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ముఖ్యమంత్రి భూములను హారతి కర్పూరంలా కాజేస్తున్నరు. తమ్ముడూ.. లెట్స్ కుమ్ముడూ అన్న చందంగా అనుముల బ్రదర్స్ అడ్డగోలుగా దోపిడీకి తెగబడుతున్నరు.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ రాజ్యంలో యథేచ్ఛగా ల్యాండ్ చోరీ జరుగుతున్నదని, సీఎం రేవంత్‌రెడ్డి సమాంతర రెవెన్యూ వ్యవస్థను నడుపుతూ నిషేధిత జాబితాలో కోటీ పదహారు లక్షల ఎకరాలను చేర్చి కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. గజానికో గజదొంగ మోపై ఇష్టారాజ్యంగా భూ దోపిడీకి తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అనుయాయులు, ఆయన అన్నదమ్ములు కలిసి ప్రజల ఆస్తులను చెరబడుతున్నారని విరుచుకుపడ్డారు. శుక్రవారం నిషేధిత భూములపై హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ముందు తెలంగాణ భవన్లో కేటీఆర్ మాటాడుతూ భూ పంపకాల వాటాలో తేడాలు రావడం వల్లే రేవంత్‌రెడ్డి తన క్యాబినెట్ మంత్రిని బర్తరఫ్ చేశారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండేవని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఏకంగా కోటీ పదహారు లక్షల ఎకరాలను 22-ఏలో పెట్టి ప్రజల ఆస్తులను చెరబట్టే కుట్రకు తెరలేపారని విమర్శించారు. తన నియోజకవర్గమైన సిరిసిల్ల పరిధిలోని గంభీరావుపేట మండలం సముద్రాలింగాపూర్‌లో 800 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
‘కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంగరకలాన్‌లో కలెక్టరేట్ నిర్మించారు. విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టడంతో అక్కడి భూముల విలువ విపరీతంగా పెరిగింది. దీంతో ఆ భూములపై కాంగ్రెస్ పెద్దల కన్నుపడింది’ అని కేటీఆర్ వివరించారు. ఓ అంతర్జాతీయ కంపెనీకి ఎకరం రూ.15 కోట్లకు ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. గతంలో తాను ఐటీ మంత్రిగా పనిచేశానని, సదరు అంతర్జాతీయ కంపెనీకి లేఖ రాస్తానని స్పష్టంచేశారు.
కేసీఆర్ పాలనలో ప్రజల భూములకు భద్రత కల్పించారని కేటీఆర్ గుర్తుచేశారు. ధరణిని తెచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులువు చేశారని, రైతు వేలిముద్ర లేకుండా విక్రయించేందుకు అవకాశం లేకుండా చేశారని తెలిపారు. 2014కు ముందు భూములు కొనేందుకు ప్రజలు భయపడే పరిస్థితులు ఉండేవని చెప్పారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కేసీఆర్ పాలనలో భూముల విలువ విపరీతంగా పెరిగిందని, రూ. 5 లక్షలుంటే ఎకరా భూమి రూ.50 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. దీంతో పిల్లల పెండ్లిళ్లు, చికిత్స, ఇతరత్రా అత్యవసర ఖర్చుల కోసం ఇబ్బందులు లేకుండా ఉండేవారని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయని, భూముల విలువ పడిపోవడంతో ప్రజలు విలవిలలాడుతున్నారని వాపోయారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, రెండేండ్లలో తిరిగి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. 22ఏ జాబితాలో చేర్చిన ప్రతి భూమిని కాపాడుతామని భరోసా ఇచ్చారు. ఈ దుర్మార్గ, పరమ నికృష్ట సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వెయ్యి రోజుల పాలన, హామీల అమలులో వైఫల్యాలు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ, కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటనపై విస్త్రతంగా చర్చించారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ కార్యకాలపాల విస్తరణ, పార్టీ కార్యక్రమాలకు ఎన్నారైల మద్దతు కూడగట్టాలని నిర్దేశించారు. ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ బలోపేతంలో కాసర్ల నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు, పార్టీ శ్రేణులు చేస్తున్న కృషిని అభినందించారు. కాగా, రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రజాసమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఆస్ట్రేలియాలోనూ పార్టీ కార్యక్రమాలను విస్రృతంగా నిర్వహించి బీఆర్ఎస్ వాణిని బలంగా వినిపిస్తామని కాసర్ల స్పష్టంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌సిటీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న పారిశ్రామిక భూములను హిల్ట్ పాలసీ పేరిట తెగనమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్త చేశారు. ఫ్యూచర్ సిటీలో రూ.200 కోట్ల విలువచేసే భూములను తన సోదరుడి కంపెనీ టెస్సెరాక్ట్కు రూ.7 కోట్లకే కట్టబెట్టారని ఆరోపించారు. తన అల్లుడి కోసం లగచర్ల గిరిజన భూములను గుంజుకునేందుకు యత్నించారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు ఆర్టీఐని అడ్డంపెట్టుకొని, 40 మంది రిటైర్డ్ రెవెన్యూ అధికారులను నియమించుకొని బ్లాక్ మెయిల్ చేసి భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
రేకుర్తి గ్రామంలో 6 వేల ఇండ్లు ఉంటాయి. కరీంనగర్ కార్పొరేషన్లో 4 డివిజన్లలో ఉన్న ఈ రేకుర్తిలోని 10 వేల కుటుంబాలు నిషేధిత జాబితాలో పెట్టారు. కలెక్టర్‌కు చెప్పినా పట్టించుకోవడంలేదు. 2025 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో వేలాది కుటుంబాలు వీధినపడ్డయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నీ సక్రమంగా నడిచినయ్. రైతుబంధు వచ్చింది. ఇప్పుడు రేకుర్తి గ్రామస్తులను చూస్తేనే రిజిస్ట్రేషన్ అధికారులు కిలోమీటరు దూరం తరుముతున్నారు. అన్ని అనుమతులున్నా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారో ప్రభుత్వమే చెప్పాలి.
పాశం మోహన్‌రెడ్డి, రేకుర్తి గ్రామం, కరీంనగర్ జిల్లా
గతంలో 2003లో తహసీల్దార్‌గా 1,000 ఎకరాలు మ్యుటేషన్ చేసిన అధికారే ఇప్పుడు ఆర్డీవోగా వచ్చి.. అవే భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టాడు. టోల్‌ఫ్రీ నంబర్‌కు రేకుర్తి నుంచి 800 మంది ఫోన్ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. రేకుర్తి నుంచి ఫోన్ చేయొద్దని చెప్పారు స్వయంగా వెళ్లి పొంగులేటిని కలిసి మా బాధలు చెప్పినం. న్యాయం చేస్తా అని ఉత్తరం ఇచ్చిండు. దాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. పొన్నం ప్రభాకర్‌ను, బండి సంజయ్‌ను కలిసినం. కలెక్టర్‌కు అయితే ప్రతి సోమవారం ప్రజావాణికి వెళ్లి అడిగితే మా భయానికి ఆమె అక్కడికి రావడమే మానేశారు. మాకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు.
– ఎదుల రాజశేఖర్, రేకుర్తి గ్రామం, కరీంనగర్ జిల్లా
కొండాపూర్ డెవలప్మెంట్ బ్లాక్‌లో 1985లో లేఅవుట్ అయింది. మా కాలనీలో ఐదువేల ఇండ్లున్నాయి. రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఎల్ఆర్ఎస్ చేస్తున్నారు. యూఎల్సీ ప్రకారం డబ్బులు కట్టారు. కమిషనర్ ధ్రువీకరించారు. కానీ ఈ మధ్యన 22-ఏలో పెట్టారు. రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ను అడిగితే.. సార్ మాకెన్నో ఉంటాయి. పైవాళ్లకు ఇచ్చేది ఉంటదని అన్నడు. ఒక్క ఫ్లాట్ రిజిస్ట్రేషన్‌కు రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల దాకా వసూలు చేస్తున్నరు. ఎందుకని అడిగితే..మీరు ఏ మినిస్టర్తోనో ఎవరితోనైనా చెప్పించుకోండని అంటున్నడు. ఫిర్యాదు చేసినా అభ్యంతరమేంలేదు. డబ్బులు ఇవ్వాల్సిందే అంటున్నడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు రాలేదు..
– వెంకటేశ్వర్రావు, కొండాపూర్, శేరిలింగంపల్లి
మంచిర్యాలలోని రెడ్డికాలనీలో 545 ఇండ్లు 22ఏలో చేర్చారు. మొత్తం మున్సిపాలిటీలో 11 వేల ఇండ్లు ఈ నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చింది. బిడ్డ పెండ్లికి డబ్బు అవసరమై 191 సర్వేనంబర్‌లో ఉన్న ఇంటిని అమ్ముదామంటే.. అమ్మడానికి వీల్లేదని చెప్పారు. తహసీల్దార్‌ను అడిగితే, ఆర్డీవోను అడుగమన్నారు. నేను సింగరేణి ఉద్యోగిగా రూపాయి, రూపాయి కూడబెట్టి కొన్న భూములని ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యాక ఈ గోస ఏంది. కేసీఆర్ హయాంలోనే బాగుండే.12 వేలకు గజం అమ్మిన. ఇప్పుడు 8 వేలకు కూడా అడుగుతలేరు. ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులు యాదికొత్తున్నయి. కొడుకును అమెరికా పంపిన. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్ని అవస్థలే.
-సురేందర్, రెడ్డికాలనీ, మంచిర్యాల
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు 4,880 ఇండ్లు నామినల్ రిజిస్ట్రేషన్ చార్జీలతో ఇచ్చారు. ఇప్పుడు అందులో నుంచి మా ప్రాంతంలో 13,00 ఇండ్లు 22ఏ కింద చేర్చారు. అధికారుల వద్దకు వెళ్లి అడిగితే ఎవరూ పట్టించుకోవడం లేదు. మొత్తం మంచిర్యాల జిల్లాలో 11 వేల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో పెట్టారు. నాడు మంచి చేసిన కేసీఆర్ ప్రభుత్వం మళ్లా రావాలె. మాకు న్యాయం చేయాలె. మా భూములను 22ఏ నుంచి తొలగించాలి.
-బాధితుడు, శ్రీరాంపూర్ కాలనీ మంచిర్యాల జిల్లా
మాది కూకట్‌పల్లిలోని 140 సర్వేనంబర్‌లో 220 ఎకరాలు. 1980లోనే లే అవుట్ అయ్యాయి. 2008లో ఎల్ఆర్ఎస్ అన్నీ చెల్లించి రెగ్యులరైజ్ చేశారు. ఇందులో 7 కాలనీలు ఉన్నాయి. ఇందులో ఒక కాలనీ 33 ఎకరాల 33 గుంటలు. ఇప్పటికే మ్యుటేషన్ కూడా జరిగింది. ఈ కాపీని కలెక్టర్‌కు అందిస్తే చూసి అది పక్కకు పడేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు మాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. క్రయవిక్రయాలు ఏవైనా సజావుగా జరిగాయి. కానీ ఇప్పుడు 22ఏ పేరుతో మాపై భారం మోపారు. రిజిస్ట్రేషన్లన్నీ నిలిపివేశారు. మా భూములున్నా బ్యాంకు నుంచి అప్పుతెచ్చుకునే స్థితి లేదు. పిల్లల చదువులు ఏం కావాలి.
– కృష్ణారెడ్డి, కూకట్పల్లి
1962లో మా ఊరి అల్లుడు కొండా రంగారెడ్డి మాకు పట్టాభూములు ఇచ్చారు. మా ఊర్లో 231 ఇండ్లు ప్రొహిబిషన్‌లో పెట్టారు. అందులో హైస్కూల్ కూడా ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా రిజిస్ట్రేషన్లు అయిన భూములు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిషేధాజ్ఞలు జారీ చేసింది. అమ్ముతామంటే అమ్మస్తలేదు. కొందామంటే కొనస్తలేదు. ఎమ్మెల్యే దగ్గరకు పోతే మీ ఇల్లు ఏడికి పోదంటుండు. మా ఊళ్లో ఒకాయన బిడ్డ పెండ్లికి 5 లక్షలు అవసరమైతే భూమి అమ్ముదామంటే ఇబ్బంది అయింది. ఊరోళ్లంతా కలిసి మాట్లాడి పెండ్లి చేసినం. మాకు న్యాయం చేయాలె. పనికిరాని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇబ్బందులే. దీనికోసం ఏ ఉద్యమం చేసినా మేం ముందుంటాం.
-రచ్చ రాందాసు, సారాజీపేట, ఆలేరు మండలం, యాద్రాది జిల్లా
మాది కుత్బుల్లాపూర్. పద్మానగర్ ఫేజ్-1 సర్వేనంబర్ 128. 1968లోనే 41 ఎకరాలతో లే అవుట్ జరిగింది. అప్పటి నుంచి మాకు ఎలాంటి బాధలు లేవు. బ్యాంక్ లోన్లు, అనుమతులు అన్నీ వచ్చాయి. ఎప్పుడైతే 2004లో కాంగ్రెస్ వచ్చిందో అప్పుడు ఈ భూములన్నీ తీసుకెళ్లి నిషేధిత జాబితాలో చేర్చారు. ఆ తర్వాత మా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ వచ్చాక ఆ సమస్య తీరింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పాలనొచ్చింది. మళ్లీ తీసుకెళ్లి 22ఏ పేరుతో నిషేధిత జాబితాలో పెట్టారు. కాంగ్రెస్ ఎప్పుడొచ్చినా మాకు ఇబ్బందులు తప్పడం లేదు. మేము నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. మా ఎమ్మెల్యేను తీసుకెళ్లి అధికారులను అడిగితే ఆ సర్వేనంబర్‌లోని కొంత భాగాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించారు.
– సత్తిరెడ్డి, కుత్బుల్లాపూర్
సీఎం రేవంత్‌రెడ్డి ఏదో విదేశీ యూనివర్సిటీలో చదువుతున్నడంట. ఆయనకు కనీసం పిడికిలంతనైనా తెలివి ఉన్నదా? ఏ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలో తెలియదా? ఇది కేవలం మీ కుటుంబ సభ్యుల స్వలాభం కోసం 22ఏను తెరమీదికి తెచ్చారు. పటాన్‌చెరులోని సర్వేనంబర్ 352 నుంచి 402 వరకు 50 ఎకరాలకు సంబంధించిన సమస్య మాది. 2013లో మాకు అన్నీ అనుమతులు వచ్చాయి. 2016లో 955 విల్లాలు నిర్మించుకున్నాం. 5వేల మంది జనాభా ఉంటుంది. ఇప్పుడు మా గ్రేటర్ కమ్యూనిటీని 22ఏలో పెట్టారు. మాకు ఇప్పుడు ఎలాంటి లోన్లు రావడం లేదు. మా స్నేహితుడి కొడుక్కి యాక్సిడెంట్ అయితే మెడికల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే రాలేదు.
-ఎం విజయరాజు, పటాన్చెరు
వారసత్వంగా 9.20 ఎకరాల భూమి ఇప్పుడు మా కొడుకుల పేరున రిజిస్ట్రేషన్ చేద్దామని పోతే అయితలేదు. భూమి పోతదని అంటున్నరు. కేసీఆర్ కాలంలో మంచిగా రైతుబంధు పడ్డది. కాంగ్రెసోళ్లు వచ్చినంక రెండెకరాలకు రైతుబంధు ఇచ్చి మిగతావి ఎగవేసిండ్రు. అయినా బాధపడలేదు. కానీ మొదటికే మోసం వచ్చినట్టు మా భూమే మాకు కాదని అంటున్నారు. నేనైతే మళ్ల కేసీఆర్ సార్కే ఓటేస్త.. మళ్లా ఆయనే రావాలె. అప్పుడే మనకు న్యాయం జరుగుతది. మీరు కూడా మా భూములు మాకు వచ్చేట్టు చేయాలె.
-కావడి జయరాం, రైతు బొడపల్లి గ్రామం, ఆసిఫాబాద్ జిల్లా
మాది గాజులరామారం. మాది 329/2, 329/10 వరకు మా సర్వేనంబర్‌లో 140 ఎకరాల భూమి ఉన్నది. 1,960 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఇండ్లు, అపార్ట్మెంట్లు అయ్యాయి. చాలావరకు జీప్లస్2 నిర్మాణాలు జరిగాయి. సుమారు 2,500 మంది జనాభా నివసిస్తున్నాం. ఇప్పుడు 22ఏ పేరుతో మేం కొనుగోలు చేసిన భమూలపై మాకే హక్కులేదంటున్నరు. గాజులరామారం మున్సిపల్ కార్యాలయం కూడా 22ఏలోనే ఉన్నదంటున్నారు. కొత్తగా ఇండ్లు కొనుగోలు చేసేవారికి ఎలాంటి అనుమతులు లేవంటున్నారు. ఉన్నవారు అమ్మడానికి హక్కు లేదంటున్నారు. ఇదెక్కడి పాలన. మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం.
-బాలరాజు, గాజులరామారం
మాది పట్టా భూమి. కేసీఆర్ సీఎంగా ఉన్నన్నాళ్లు రైతుబంధు పడేది. దక్కన్ బ్యాంకుల లోన్ తెచ్చుకున్న. మొన్న 3 రూపాయల మిత్తికి రూ.19 వేలు అప్పు తెచ్చి లోన్ కట్టిన. రెన్యువల్ చేయమంటే మేనేజర్ చేత్తలేడు. కొత్త లోన్ ఇత్తలేడు. ఇందేందని అడిగితే నీ భూమి అసైన్మెంట్ల పడ్డది. మొత్తం లోన్ కట్టాలంటున్నడు. ఇదేంది సార్ పెద్దోళ్లే మోసంజేత్తే ఎట్ల? అని అడిగితే, నేనేం చేయాలంటున్నడు. మూడు రూపాయల వడ్డి తెచ్చి క్రాప్‌లోన్ మిత్తిగడితిని. ఒక్క యూరియా బత్తా అత్తలేదు. మేం ఎవుసం ఎట్టా జేసుకోవాలె. ఎట్ల బతకాలె.
– బీంబాయి, కౌటలా (కాగజ్‌నగర్)
నాకు 1.26 ఎకరాల భూమి ఉన్నది. బ్యాంకు లోన్ తీసుకున్న. రెన్యువల్ చేయించుకొనేందుకు పాస్ బుక్కు పట్టుకొని బ్యాంకుకు పోయి మేనేజర్‌ను కలిసిన. నీకు రెన్యువల్ కాదు. కొత్త లోన్ ఎట్లిస్తమంటున్నడు. ఇప్పటికిప్పుడు ఇట్లంటే ఎట్లసార్ అని అడిగితే. నీ భూమి ఆన్లైన్ల చూపుతలేదమ్మా. కబ్జాల పడ్డదని చెప్పిండు. మా తాతాల తండ్రుల నాటి భూమి కబ్జాల ఎట్లపడ్తదని అని అడిగిన. మేం ఎవుసం జేసుకొని బతుకుతున్నం. ఇప్పుడు కబ్జాల పడ్డదని అంటే ఎట్లసార్ అంటే నాకేం తెలియదంటున్నడు..
– బొల్లబోయిన విజయలక్ష్మి, డబ్బా (చింతలమానేపల్లి )
మా ఊర్లోని 518 సర్వేనంబర్‌లో 467 ఎకరాల భూదాన్ భూమి అని 2025 డిసెంబర్లో 22-ఏలో పెట్టారు. గ్రామంలోని 400 ఇండ్లు హనుమాన్, దుర్గమ్మ గుడిని, బుగ్గపోచమ్మ, స్కూల్, గ్రామ పంచాయతీ ఆఫీస్‌ను కూడా చేర్చారు. అప్పటి నుంచి భూములు రిజిస్ట్రేషన్లు కావడమే లేదు. ఆ 467 ఎకరాల్లో 380 ఎకరాల్లోనే 10 వేల ప్లాట్లు ఉంటాయి..14 లక్షల చదరపు గజాలను నిషేధిత జాబితాలో పెట్టారు. సర్పంచ్‌ను వెంటబెట్టుకొని కలెక్టర్, మంత్రి పొంగులేటిని కలిసినం. ఆయన లోకేశ్కుమార్ను పిలిచి చెప్పి నంబర్ ఇచ్చిండు. తెల్లారి ఎత్తిండు కానీ ఏమీ చెప్పలేదు. అప్పటి నుంచి అక్కడికి రానిత్తనేలేడు. కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే ఎత్తడంలేదు.
– నీలం ఓంప్రకాశ్‌గౌడ్, వడాయిగూడెం, భువనగిరి జిల్లా
మాది ఎల్బీనగర్. 1974లో సుమారు 70 ఎకరాలున్న మా భూమి లేఅవుట్ అయింది. ప్రాపర్టీ, ఎల్ఆర్ఎస్ లాంటి అన్ని పన్నులు చెల్లించాం. సుమారు 10 వేల జనాభా ఉన్నది. ఇప్పుడు మా భూములన్నీ తీసుకెళ్లి 22ఏలో పెట్టారు. ఇప్పటికే రోడ్లు, అభివృద్ధి అంతా జరిగింది. ఉన్నట్టుండి 22ఏ అంటూ మాపై భారం మోపారు. కలెక్టర్‌ను కలిసినా ఫలితం లేదు. అన్ని పన్నులు కట్టించుకొని ఇప్పుడు 22 ఏ అనడం ఏంది? ధరణి ఉన్నప్పుడు మాకెలాంటి సమస్యలు లేవు. భూ భారతి వచ్చాకే మా భూమికి నోటీసులిచ్చారు. మా పాప పెండ్లి చెయ్యాలంటే కష్టంగా ఉన్నది. ఆత్మహత్య చేసుకోవడమే దారిలా కనిపిస్తుంది. మా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు.
-సీతారాంరెడ్డి (ఎల్బీనగర్)
నా కుమారుడు అమెరికాలో ఉన్నాడు. అక్కడే ఇల్లు కొందామన్నడు. అక్కడి ట్రంప్ పెట్టే ఇబ్బందులకు నేనే అక్కడ కొనొద్దని చెప్పిన. కానీ ఇక్కడ రేవంత్‌రెడ్డి ఆ ట్రంప్‌నే మించిపోయిండు. 1981లో శ్రీనగర్, శాంతినగర్ కాలనీ లేఅవుట్ ఏర్పాటుచేశారు. అక్కడ దాదాపు 2 వేల ప్లాట్లు ఉన్నాయి. 2025 నవంబర్లోఅగ్రిమెంట్ చేసుకున్నాం. రూ.1.40 కోట్లు చెల్లించాను. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాం. రెండుసార్లు స్లాట్ బుక్ చేస్తే రిజెక్ట్ అయింది. మా రెండు కాలనీల స్థలాలను 22ఏలో చేర్చారు. 50 ఏండ్ల పహాణీలు కూడా ఉన్నాయి. అధికారులు మాత్రం నిజాం ప్రభుత్వ భూమి అంటున్నారు. ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేరు.
– సంజీవరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు, పటాన్చెరు
మా గ్రామంలో 1,500 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో ఉంచారు. దాదాపు 3 వేల ఇండ్లు ప్రొబేషనరీలో ఉంచారు. ప్రజలంతా అధికారుల చుట్టూ తిరిగి కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మార్చే అధికారమే మాకు లేదని తహసీల్దార్ అంటున్నారు. కలెక్టర్ వద్దకు వెళ్తే స్పందించడమే లేదు. నిషేధిత జాబితాలో ఉన్న మా ఇండ్లు, భూములను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్లియరెన్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా ఇండ్లు మొత్తం నిషేధిత జాబితాలోకి మార్చారు. రిజిస్ట్రేషన్లు మొత్తం ఆగిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ ఎమ్మార్వో ఎన్వోసీ తీసుకురావాలంటున్నరు.
– దాసు, అమీన్పూర్, పటాన్చెరు మండలం
మా తాత నుంచి సంక్రమించిన భూమి. మా నాయిన వ్యవసాయం చేసిండు. నేను చేసిన. ఇప్పుడు మా కొడుకులకు ఇద్దామంటే పట్టా పాస్ బుక్కు పనికిరాదంటున్నారు. 22ఏ కింద భూమి పోయిందంటున్నారు. రెండు లక్షల లోన్ తీసుకొని పత్తి వేసిన. అది కూడా కొనరంటున్నారు. మొత్తం మా ఊర్లో 29,000 ఎకరాల భూమి పోయింది. రైతులు అరిగొస పడుతున్నరు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధ సహా అన్నీ మంచిగుండె. కానీ మారాత మంచిగలేక కేసీఆర్‌కు ఓటెయ్యలే. ఇప్పుడు అనుభవిస్తున్నాం. మీరే మాకు న్యాయం చెయ్యాలె. గడీల మల్లయ్య, రైతు బొడపల్లి గ్రామం, ఆసిఫాబాద్ జిల్లా
మాది నాగోల్ డివిజన్లోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో 14 ఎకరాల భూమి. ఇది 1965లోనే ల్యాండ్ కన్వర్షన్ చేసి లేఅవుట్ చేశారు. 1968లో మా ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఆ తర్వాత క్రయవిక్రయాలు కూడా జరిగాయి. మొత్తం 1,200 జనాభా ఉన్నది. భూములకు జాతీయ బ్యాంకులు సైతం లోన్లు ఇచ్చాయి. మాకు. బీఆర్ఎస్ పాలనలో ఏ చిన్న ఇబ్బందీ కలుగలేదు. 2022లో ఎస్బీఐలో మా అమ్మాయికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా 14 ఎకరాలు 22ఏలో పెట్టారు. కాలనీ వాసులందరూ భయపడుతున్నారు. కలెక్టర్‌ను కలిసినా పట్టించుకోవడం లేదు. తలలు వంచుకుంటున్నారే కానీ జవాబు చెప్పే దిక్కులేదు.
-గోపాల్ రావు, శ్రీనివాస్‌నగర్ కాలనీ, నాగోల్
మాకు కౌటాల మండలం చీపురు గ్రామ శివారులో సర్వే నం.3/62/1లో 1.14 ఎకరాల భూమి ఉంది, మాది బందోబస్తు పట్టా భూమి.. మాకు తాత ముత్తాల నుంచి వస్తున్నది. ఇప్పుడు ఈ భూమిని 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. పట్టా భూమిని ఎలా పెడతారు. మా భూమి మాకు వచ్చే వరకూ పోరాటం చేస్తాం. తిరిగి సాధించుకుంటాం.
– ఆదే భీంబాయి