రేవంత్‌రెడ్డికి తాను ముఖ్యమంత్రి అన్న సోయి లేనట్టుంది! కాబట్టే మనలో ఎంతోమందికి ఆయన ముఖ్యమంత్రి అనిపించడం లేదు. ‘మీ స్థాయి దిగజారవద్దు’ అని మనం ఆయనకు చెప్పినా లాభం లేదు. తన స్థాయి ఏదో తెలుసు గనుకనే ఆయన అత్యంత వేగంగా పతనం చెందుతున్నడు, మనిషితనంలో!వివేక భ్రష్టత ఎన్ని ఇక్కట్లు తెచ్చిపెడుతుందో వివరిస్తరు కదా భర్తృహరి, ‘ఆకాశంబున నుండి, శంభుని శిరం బందుండి…’ పద్యంలో. రేవంత్‌రెడ్డిలో వివేకం నశించిపోయిన దృశ్యాన్ని అసెంబ్లీ వేదికగా రాష్ట్రమంతా నేడు చూస్తున్నది. అయితే ఈ చీప్ బుద్ధి ఆయనకు సీఎం అయినాక వచ్చింది కాదు, మొదటి నుంచీ ఆయన క్యారెక్టర్ అంతే. అసలు క్యారెక్టర్ లేని వారిని కూడా ‘ఆయన క్యారెక్టర్ అంతే’ అని అనాల్సి రావడం భాష చేసుకున్న దురదృష్టం!
రేవంత్ వాచాలతకు అడ్డూ అదుపూ ఉండదు. పితృస్వామ్యం, ఫ్యూడల్ మనస్తత్వం సహా వ్యక్తిగత లంపెనిజం కూడా తోడైతే వచ్చే మాటలు ఇవిగో ఇట్లా ఉంటయి.తినడానికి పాలకోవా లేదు గానీ ఉంచుకోవడానికి మియామాల్కోవా కావాలన్నడంట.ఇసుమంత అందం లేదు కానీ సమంత సోకులా?ఆలుగడ్డలు అమ్మేటోళ్లు, కల్లు గీసుకునే వారికి రాజకీయ భిక్ష పెట్టినం.శశిథరూర్ గాడిద.మంత్రి శ్రీధర్‌బాబుది మేనేజ్మెంట్ కోటా.లాగులో తొండలు ఇడుస్తా, డ్రాయర్ ఊడబీకుతా.చెట్టుకు కట్టేసి కొట్టి, ఉరి తీస్తా.నీకు హాఫ్ నాలెడ్జ్, పెద్దాయనకు ఫుల్ నాలెడ్జ్ (అసహ్యమైన హావభావాలతో) ఇవీ రేవంత్ మాటలు. ఇందులో వ్యక్తులను, పార్టీలను టార్గెట్ చేసుకొని మాట్లాడినవి నీచంగా ఉన్నయి. మరీ ముఖ్యంగా మహిళలు, బహుజన వర్గాలను ఉద్దేశించి చేసిన ‘వల్గర్’ వ్యాఖ్యలు ఎన్నో! తాజాగా మొన్న అసెంబ్లీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలను ఉద్దేశించి ‘ఈ అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుంది’ అన్నరు రేవంత్! ఆయనకు ఒళ్లంతా అహంకారమే ఉన్నది. మాట్లాడితే జడ్పీ స్థాయి నుంచి ఎదిగిన నాయకుడిని అని చెప్పుకుంటరు. కానీ, ఆయన రాజకీయం మొత్తం బ్లాక్మెయిల్, కుట్రలు, కుతంత్రాలు, అక్రమార్జనయే. జడ్పీటీసీగా ఉన్నప్పటి రేవంత్‌కు, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌కు కొంచెం కూడా తేడా లేదు. ఆయన వ్యక్తిత్వంలో పతనమే తప్ప ఏ మాత్రం పరిణతి లేదు. కాబట్టే మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, సహచర రాజకీయ నాయకులు అన్న విచక్షణ కూడా లేకుండా నిండుసభలో ఆనాడు దుర్యోధనుడిలా వదిరిండు! పైన చెప్పినట్టు ఆయన ఎవరినైనా ఏ మాటైనా అనగలడు. సామాజికంగా ఎన్నోరకాల అణచివేతలకు గురయ్యే వర్గాలపై కూడా ఆయన వెటకారంతో మాట్లాడిన మాటలు చరిత్ర రికార్డు చేసుకున్నది.
మనిషికి ఉండాల్సిన సున్నితత్వం లుప్తమై, అత్యంత అవమానకరమైన భాషలో తరచూ మాట్లాడే రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా? కాంగ్రెస్‌కు వేరే దిక్కు లేదా? 139 ఏండ్ల పార్టీకి ఇంత దౌర్భాగ్యమా? రాజకీయ ఉత్థాన పతనాలు ఎట్లున్నా, ఒక మనిషిగా రాహుల్‌గాంధీకి సంస్కారి అనీ, సున్నిత మనస్కుడనీ పేరున్నది. బీజేపీని ఎదుర్కోవడంలోనూ, ఆ పార్టీకి వ్యతిరేకంగా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి చూపడంలోనూ రాహుల్ పరిణతి చూపారని జనాంతికంగా అనుకునే మాట. మరి పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ, ఒక వ్యక్తి కారణంగా భ్రష్టు పట్టిపోతూ ఉంటే, ఎందుకు ఊరుకుంటున్నట్టు? రాహుల్‌ను అభిమానించే యువతకు ఎలాంటి స్ఫూర్తి ఇస్తున్నది రేవంత్ నేతృత్వంలోని పార్టీ, ప్రభుత్వమూ? రాహుల్ గురించి అసోం ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడితే ఖండించిన కేసీఆర్ నుంచి ఏమైనా విలువలు గ్రహించగలరా కాబోయే ప్రధానమంత్రి అభ్యర్థి?
‘నమస్తే తెలంగాణ’ పత్రికలో వచ్చింది కాబట్టి, ఈ వ్యా సం రేవంత్‌కు, కాంగ్రెస్‌కు నష్టం చేసి, బీఆర్ఎస్కు లాభం చేయడానికి ఉద్దేశించినదే అని మీలో ఎవరికైనా అనిపిస్తే, దయచేసి కాసేపు ఆ ఆలోచన పక్కనపెట్టి ఆలకించండి!
ఎట్లాంటి తెలంగాణ ఎట్లయింది ఇపుడు? పార్టీల గోల వదిలేసి, తెలంగాణ బిడ్డలుగా చెప్పండి! మీ ఇంట్లో, మీ ఊర్లో, మీ ప్రాంతంలో ఈ ఎనిమిది నెలల్లో వచ్చిన మార్పులు మీరు కోరుకున్నవేనా? మీకు సంతోషం ఇస్తున్నవేనా? అభివృద్ధి-సంక్షేమం ఎటూ అటకెక్కింది. ఇపుడు తెలంగాణ అనాదిగా నిలుపుకొన్న సంస్కారయుత విలువలు పూర్తిగా మాయమవుతున్నయి కదా? కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, అధికారుల ఆలోచన, ఆచరణ, నడవడిక రోజూ కథలుగా చదువుతూనే ఉన్నం కదా? బూతులు మాట్లాడే మంత్రులు, ఎవరికీ బాధ్యత వహించని అధికారులు, జనంపై జులుం చేస్తున్న పోలీసులు… ఇంకా అన్యాయం ఏమంటే, మాటల్లో చెప్పలేని నీచత్వంతో కథనాలు వండి వారుస్తున్న యూట్యూబ్ చానెళ్లు… జర్నలిస్టులు కానివారు, అధికార పార్టీ ప్యాకేజీకి అమ్ముడుపోయి జనానికి నిజాలు తెలియనివ్వని మీడియా, ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ?
అణువణువునా కులపిచ్చి, బ్లాక్మెయిల్ రాజకీయాలు, అక్రమార్జన, మితిమీరిన స్వార్థం మూర్తీభవించిన వారు అధికార పార్టీ ప్రతినిధుల్లో ఎందరో ఉన్నరు. వారందరి ముఠా నాయకుడు రేవంత్‌రెడ్డి. తెలంగాణ ఎటు పోతేనేమి, కాంగ్రెస్ ఎట్లా మునిగితేనేమి అనుకుంటున్నడు ఆయన. కాంగ్రెస్ రక్తం లేని పచ్చ నాయకులను తనచుట్టూ పెట్టుకొని రేపటి కోసం కుటిల వ్యూహం పన్నుతూ ఉన్నడు. కాబట్టే, టీడీపీ మద్దతుదారులు ఇరు రాష్ర్టాల నుంచి కూడా రేవంత్‌ను వెనకేసుకు వస్తూ ఉంటరు. నాకు ఒక ఆంధ్రావాసితో ఈ మధ్య జరిగిన సంభాషణ ఉత్సుకత రేకెత్తించేది మాత్రమే కాక వారి రాజకీయ వ్యూహాలను ప్రస్ఫుటం చేసేదిగా ఉంది.
నేను: ‘సీమాంధ్ర పాలకులైన వైఎస్సార్, చంద్రబాబులు వివక్ష చూపిన్రు అనే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం’ అన్నరు కదా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి. చంద్రబాబును అంత మాట అన్నా కూడా మీరు ఆయనను మిత్రుడిగా భావిస్తారు ఎందుకు?
అతను: సార్, ఆయన మనస్ఫూర్తిగా ఆ మాట అనలేదని మాకు తెలుసు, ఆయనకు తెలుసు, చంద్రబాబుకూ తెలుసు. మరి చంద్రబాబు వల్లనే హైదరాబాద్‌కు 24 గంటల కరెంటు, తద్వారా అభివృద్ధి సాధ్యమైంది అని అదే సభలో అన్నరు. పదేండ్ల తన లాయల్టీ చెక్కు చెదరదని కూడా ఢంకా బజాయించి చెప్పారు. రాజకీయ అవసరాల కోసం ఆయన చంద్రబాబుపై ఎపుడైనా ఒక మాటన్నా ఆయన మా మనిషని ప్రపంచమంతా తెలుసు.
నేను: అవును…
అతను: అసలు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పని కులసంఘం సభకు హాజరవడం, వారికోసం ఏమైనా చేస్తామనడం. మొన్న మా సీఎం ఆ పనిచేశారా లేదా?
నేను: గుడివాడ నుంచి మాట్లాడుతూ మా సీఎం అంటారేమి?
అతను: ఊర్కొండి సార్… ఆంధ్రా-తెలంగాణ ఇపుడు రెండూ మావే. ముందుముందు ఇంకా చూస్తారు మీరు!
అదీ మిత్రులారా, వారి దిలాసా!
పోయినేడాది మరో ఆంధ్రావాసి అన్నరు రాష్ట్ర విభజన రాజ్యాంగ వ్యతిరేకం అని. ఆ మేరకు ఉండవల్లి అరుణ్ కుమార్, నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి వేసిన కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. ఇరు రాష్ర్టాలు ఎప్పటికైనా కలిసిపోతాయనేది కేవలం ఆశ కాదు, వారి ఆకాంక్ష.
‘హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో పదేండ్లు పొడిగించాలని మీరంతా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి’ అంటూ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయపక్షాలకు విజ్ఞప్తి చేశారు జేడీ లక్ష్మీనారాయణ. హైదరాబాద్ మాదాపూర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘అన్న క్యాంటీన్’ వెలిసింది, ‘తెలంగాణలో పలుచోట్ల ఇంకా తెరుస్తాం’ అన్నారు నిర్వాహకులు. చంద్రబాబునాయుడు సీఎం అయినాక హైదరాబాద్ వచ్చినపుడు ఆయనకు లభించిన స్వాగత సత్కారాలు ‘మీరు మా నుంచి తప్పించుకోలేరు, మేము మళ్లీ వచ్చాం, మీ సంగతి తేలుస్తాం’ అన్నట్టు ఉంది. ఆయన అనుంగు అనుచరుడు రేవంత్‌రెడ్డి ‘జీ హుజూర్’ అంటూ ఎప్పుడైనా, దేనికైనా సిద్ధంగా ఉంటారు కాబట్టి!
De omnibus dubitandum (అన్నిటినీ సందేహించు) అంటారు ఫ్రెంచ్ తాత్వికుడు రెనే కార్టే. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రం, పదేండ్ల కాలంలోనే ఎన్నో రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం ఈనగాచి నక్కల పాలు కావొద్దు. కాబట్టే, మనకు జాగరూకత అవసరం. బీఆర్ చోప్రా మహాభారత్ సీరియల్లో ‘కాలం’ లాగా మనం నిర్మోహంగా, నిర్మొహమాటంగా చూడగలిగితే ఎన్నో విషయాలు అర్థమవుతయి.
చంద్రబాబుపై తన లాయల్టీని గొప్పగా చెప్పుకుంటరు రేవంత్ రెడ్డి. పదేండ్లు పనిచేసిన కదా, వారి పట్ల గౌరవం చూపాలా వద్దా అంటూ అదేదో గొప్ప విలువలా మాట్లాడుతరు! చంద్రబాబు ఎవరి ప్రతినిధి? ఎవరి పాలకుడు? రెండు వారాల కిందనే కదా, సీఎం అయినాక ‘రాష్ట్ర విభజన జరుగుతుందని అనుకోలేదు’ అన్నరు విజయవాడలో! ఆయన తెలంగాణ వ్యతిరేకత జగమెరిగిన సత్యం కదా? రేవంత్‌కు తెలంగాణ ఆత్మ లేకపోవచ్చు, కనీసం ఈ నేల మీద పుట్టినందుకు కొంచెమైనా ప్రేమ ఉండాలి కదా? ఇక్కడి మట్టి పట్లా, ఇక్కడి మనుషుల పట్లా? ఇక్కడ సీఎంగా ఉండి, పక్క రాష్ట్ర సీఎంకు విధేయత న్యాయమా? పైగా అదొక విలువా?
‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్యాయపు హామీలకు మోసపోయి అధికారం ఇచ్చినం. ఇపుడు ఫలితాలు అనుభవిస్తున్నాం’ అంటూ లెక్కకు మిక్కిలిగా జనం తమ గోడు సోషల్ మీడియాలో వెళ్లబోసుకుంటున్నరు. గ్రామీణులు, అందునా మహిళలు అయితే జంకూ గొంకూ లేకుండా తమ ఆక్రోశాన్ని బూతుల రూపంలో వెలిబుచ్చుతున్నరు. కడుపు మండినపుడు niceties కుదరవు కదా!
అసెంబ్లీ ఎన్నికల్లో మోసం అట్లుండగా, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఎనిమిదేసి ఎంపీలు గెలుచుకున్న కాంగ్రెస్, బీజేపీ నేడు తెలంగాణ అన్న రాష్ట్రం ఉందన్న విషయమే మరిచిపోయి బడ్జెట్లో మొండి చేయి చూపిస్తే ఉసూరుమంటున్నం. పోనీ, కేసీఆర్ అన్నీ చేసి పెట్టిండు కదా, సవ్యమైన పాలన అందించవచ్చు కదా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తన అసమర్థతతో, అరాచకపు అలవాట్లతో, అవినీతి నాయకులతో తెలంగాణను వందేండ్లు వెనక్కి తీసుకుపోతున్నది. ఇందుకు కంకణబద్ధుడైన గుంపు మేస్త్రీయే అసలు దోషి. ఒక కాంగ్రెస్ మాజీ ఎంపీ చెప్పినట్టు ‘రేవంత్‌రెడ్డి లాంటివాడు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, రాజకీయాల్లోనే ఉండొద్దు, అన్నిటికీ అంటే మకిలి ఆయన’!
రేవంత్‌రెడ్డి దిగజారుడుతనాన్ని ఖండించడం ఒక్క బీఆర్ఎస్ పార్టీ పని మాత్రమే కాదు, మహిళా నాయకుల బాధ్యత మాత్రమే కాదు. మొత్తం తెలంగాణ సమాజం ఛీత్కరించాలి. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పి, తన ప్రవర్తన మార్చుకోవడమో, లేదా పదవి నుంచి దిగిపోవడమో, లేదా రాహుల్‌గాంధీ అయినా ఆయనను దించేయడమో జరిగేంతవరకు ఒత్తిడి తేవాలి!ఇది విలువల విషయం!
సంక్షోభ సమయం!!
-శ్రీశైల్‌రెడ్డి పంజుగుల
90309 97371