అష్ట అమాత్యుల గుంపు నాలుగు దిక్కుల నుంచి ఏకోన్ముఖ దాడి సల్పుతున్నది. ద్యూతస్థలిలో హరీశ్‌ను అభిమన్యున్ని చేసి, తెలంగాణ బాపు కేసీఆర్‌ను దోషిగా చూపాలనే వ్యూహం వాళ్లది. కానీ ఆయన అర్జునుడై వాగ్బాణాలు ఇడుస్తున్నడు. కీలెరిగి వాతలు పెడుతున్నడు.
‘స్పీకర్ సార్.. స్పీకర్ సార్ మా గొంతు నొక్కకండి సార్’ అని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నడు. ‘ఆనాడు కాళేశ్వరం మీద కేసీఆర్ ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ మేం ప్రిపేరైరాలే అని పోయిండు’ అంటూ ప్రత్యర్థులను కవ్విస్తున్నడు. ‘మహారాష్ట్ర పరీవాహకం నుంచి సాంకేరి వాగు.. మట్టాపూర్ వాగు.. గొల్లపల్లి వాగు.. లంక చెరువు వాగు.. మేడారం వాగు’ అని ఒక్కొక్క వాగు లెక్క చెప్పుకొంటూ చుక్కలు చూపిస్తున్నడు. ‘ఉమాభారతి ఉత్తరం తప్పు సదివి సభను తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రి సభకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండు చేస్తున్నడు. అది కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ. మా అమ్మ రామతార టీవీలో తలపెట్టింది. పొద్దంత కాయకష్టం చేసి పొద్దుగూకంగనే ఇంత తిని మలుచుకొని పడుకునే మనుషులు. ఆదమరుపు యాళ్ల నిద్రకాచి హరీశ్‌రావు చెప్పే ముచ్చట వింటున్నది. బోరింగ్ దగ్గర నీళ్ల కొట్లాట, వెనుకటికి మా చిన్నాయిన పొంటె తప్పి పొలానికి నీళ్లు మలుపుకొన్నప్పుడు వచ్చిన లొల్లి తప్ప మరే నీళ్ల గొడవలు తెల్వని మా అమ్మకు కాళేశ్వరం ప్రాజెక్టు పంచాయితీ మీద మనసు పెట్టడం నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ పల్లె ప్రజల జీవధార. జన జీవనంతో ముడిపడిన జీవనాడి.
సూర్యాపేట జిల్లాలో ఓ మారుమూల పల్లె కర్విరాల కొత్తగూడెం మా ఊరు. అదేరోజు ఊరికి పోయిన. నన్ను చూసి ‘ఇప్పుడే వత్తున్నవ బిడ్డ’ అని పలకరించింది. ‘కాళ్లు కడుక్కో’ అని చెప్పి మళ్లీ టీవీ మీదికి మళ్లింది. హరీశ్‌రావు మాటలు అట్లనే ఉంటయి. అమ్మలక్కలు తీర్వాటుగా కూర్చొని ముచ్చట పెట్టినట్టు.. మర్మం ఎరిగిన మనిషి ఇగురం చెప్పినట్టు వినసొంపుగ ఉంటుంది. నేను కాళ్లు కడుక్కోను జాలారు దగ్గరకు పోయిన. గోలెం మంచి జలకళతో ఉన్నది. 50 ఏండ్ల కిందటి గోలెం అది. 7 బిందెల నీళ్లు పడుతయి. అప్పట్లో ఈ గోలెం నిండాలంటే పెద్ద జీవన పోరాటమే చేసేవాళ్లం. 2,800 ఓటర్లు ఉన్న మా ఊరికి గొంతు తడిపే బోరింగులు రెండో మూడో ఉండేవి.
ఒకటి బోరింగ్ యాదగిరి అన్న ఇంటి ముందర ఉండేది. సగం ఊరుకు ఈ బోరింగే ఆదెరువు. నిజానికి యాదగిరి అన్న ఇంటి పేరు వర్ధెల్లి. ఆయన ఇంటి ముందే బోరింగు ఉంది కాబట్టి ఆయన బోరింగు యాదగిరి అయిండు. కోడికూత పొద్దుకే మూడు నాలుగు వందల మంది బిందెలు పట్టుకొని బోరింగు చుట్టూ మూగేవాళ్లు. మనిషి వంతుకు ఒక్క బిందె. మా నాయన, అన్న, నేను కలిసి మేం ఐదు మందిమి. నాకు తెలిసి మా చెల్లె రమాదేవిది నీళ్లు మోసే వయసు కాదు కానీ.. వంతు కోసం మా అమ్మ ఆమెను నిద్ర మొఖం మీదనే లేపి తీసుకొచ్చి బోరింగు దగ్గర కూర్చోబెట్టేది. ఏగిలువారంగ లేసి, బువ్వలు ఉడికే యాళ్ల వరకు తన్లాడితే 10-12 బిందెల నీళ్లు దొరికేది. 7 బిందెల తోటి గోలెం నింపి, ఐదు నిండు బిందెలు ఓరకు దింపేవాళ్లం. నీళ్ల కోసం ఆత్రపడ్డోళ్లు జుట్లు జుట్లు పట్టుకునే సీన్లు రోజు రెండు మూడుకు తగ్గవు.
ఊరికి భూమి ఉంది. కానీ, సాగు నీళ్లు ఉండేవి కావు. ఊరంచుకు కొత్త చెరువు. ఊరెమ్మడి పెద్ద గుట్ట. గుట్ట దాటితే తాటివనం. వనం ఆవల కర్విరాల చెరువు. ఊరు బతుకంతా పెద్దగుట్టతోటే ముడిపడి ఉండేది. మలినం కడుక్కోవటానికి తప్ప ఆ చెరువులతో మాకేం పని పడదు. ఊరి ఒడ్డెర్లు పెద్ద గుట్టకు రాళ్లు కొట్టి అమ్ముకొని పొట్టబోసుకునే వాళ్లు. ఊర్లో యాదవ కుటుంబాలు ఎక్కువే. గొర్రెల మందలు పెద్దవే. వానకాలం గుట్టదడెకు గొర్రెలు మేపేవాళ్లు. కాలం మారితే మందలను తోలుకొని ఏండ్లకేండ్లు మన్యం పోయేటోల్లు. ఇతర జాతులు ఊరిడిసి బతుకపోయేవాళ్లు. నా తరం, నాకంటే ముందుతరం బతుకుదెరువు వెతుక్కుంటూ ఊరు విడిచి వచ్చిన వాళ్లమే. అటువంటి మా ఊరులో ఇప్పుడా పరిస్థితి లేదు. కృష్ణా బేసిన్‌లోని పాలేరు నది నుంచి మిషన్ భగీరథ నీళ్లొచ్చినయి. తెల్లారకముందే సంపు నింపుతున్నయి. మా అమ్మ కాళ్లను, మా ఇంటి ముంగిటిని తడుపుతున్నయి. కేసీఆర్ బాపు గోదావరి రెక్క పట్టుకొని మా పెద్దగుట్ట దాటించి ఊరి పొలిమేర్ల వదిలేసినట్టు తల్లి గోదావరి తరలివచ్చింది.
పంట పొలాలను తడిపింది. నిన్నామొన్నటి దాకా మా ఊరు కోనసీమను తలపించేది. కోనసీమలో కొబ్బరిచెట్లు పెరిగితే, మా ఊరుకు తాటివనం వన్నెలద్దింది. మా నాయిన చెరువులో గాలం వేసి కొరమీను పట్టడంలో దిట్ట. ఏడాదిలో కనీసం 200 రోజులు ఇంట్లే చేపల కూర ఉంటుంది. కాళేశ్వరం నీళ్లు వచ్చిన తర్వాత మా అయ్య గాలానికి తిరుగులేదు. మిషన్ భగీరథ వచ్చాక మా అమ్మ గోలెం ఖాళీ లేదు. సూర్యాపేట జిల్లా టెయిల్ ఎండ్ ప్రాంతం. కృష్ణానది ఉపనది పాలేరు పరీవాహకం కిందకు వస్తుంది. కానీ, పాలేరు నది దిగువకు ఉంటే సూర్యాపేట జిల్లా దాని గ్రామాలన్నీ ఎగువకు ఉంటాయి. భౌగోళికంగా పాలేరు నీళ్లు సూర్యాపేటకు అందవు. కేసీఆర్ ఈ ఆలోచన చెప్పే ఎస్సారెస్పీ నుంచి గోదావరి నీళ్లు మళ్లించి టెయిల్ ఎండ్ గ్రామాల వరకు సాగునీరు పారించిండు. 2.13 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందించిండు.
‘కాళేశ్వరం బ్యూటిఫుల్ ప్రాజెక్టు.. కేసీఆర్ సంకల్పానికి చెరగని సంతకం… ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నయి కాబట్టి ఘోష్ నివేదిక వచ్చింది. మనకు అర్థం కావటం లేదా? ఎవరు ఉసిగొల్పితే ఈ నివేదికలు వస్తున్నయో’ అని హరీశ్ నిప్పులు చెరుగుతున్నడు.
హరీశ్‌రావు చర్చ ముగిసింది. మా అమ్మ నా దిక్కు తిరిగింది. ‘కాళేశ్వరం పంచాతి ఏంది బిడ్డ’ అని అడిగింది. ‘ఇంతసేపు విన్నవు. మళ్లీ నన్ను అడుగుతున్నవ్. మరి నీకేం అర్థమైందని నిద్రగాచి టీవీ చూస్తున్నవు?’ అని ఎదురు ప్రశ్న అడిగిన. ‘అదేగాని.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పూలు కూలిపోయిందని రేవంత్‌రెడ్డి అంటున్నడు గనీ. ఎట్టయిందని సెన్నపట్నపోన్ని పిలిపించి సూయింస్తే.. ఆయన అన్ని తప్పుతప్పులు రాసిచ్చిండు అని అరిశ్రావు చెప్తున్నడు. (మా దగ్గరి గ్రామీణులు పొరుగు రాష్ట్ర వాసి ఎవరైనా సెన్నపట్నపోడు అనటం రివాజు) కాళేశ్వరం నీళ్లు పొయ్యలేదని ఆనికి ఈనికి సూపుడు ఎందుకు? సక్కగ కొత్త చెరువు కట్టమించి మనింటికి పట్టుకొచ్చి ఆ.. గోలెం, మీ అయ్య గాలం చూపిస్తే కాళేశ్వరం నీళ్లు పోసిందో? పొయ్యలేదో? తెలిసిపొద్ది’ అని అమాయకంగా చెప్పింది. నీళ్లు పారించాలే, రైతుకు తోడుండాలనే తపన ఉన్నవారికి అమ్మ తత్వం బోధపడుతుంది. కానీ, ఆనవాళ్లు చెరిపేయాలని, సారు గొంతు నొక్కి తెలంగాణ వనరులు గురుదక్షిణ కింద ఆంధ్రకు మళ్లించాలనే తలంపుతో ఉన్నవాళ్లకు ఏం అర్థమవుతుందనే నిర్వేదం ఆవహించగా.. ఇంత తిందామని కూర్చున్నం.
వర్ధెల్లి వెంకటేశ్వర్లు