కాంగ్రెస్ పాలనలో అసంతృప్తి అనేది సాధారణం. వైఎస్ హయాంలోనూ అసంతృప్తి వర్గం ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుకొని, చివరి ప్రభుత్వం దాకా అసంతృప్తి వర్గం ఉండేది. ఎన్టీఆర్ టీపీని ఏర్పాటు చేసేదాకా కాంగ్రెస్‌లోని అసంతృప్తి వర్గమే ప్రతిపక్ష పాత్ర పోషించేది. అప్పటి అసంతృప్తి వర్గం తీరు వేరు, ఇప్పు డు, తెలంగాణలో ఏర్పడిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలోని అసంతృప్తి వర్గం తీరు వేరు.
గతంలో సీఎం కోసం, మంత్రి వర్గంలో స్థానం కోసం అసంతృప్తి వర్గాలు ఏర్పడేవి. కానీ, ఇప్పుడు మంత్రుల్లోనూ అసంతృప్తి ఉంటున్నది. తమ వాటా తమకు దక్కడం లేదనే అసంతృప్తి మంత్రుల్లో ఉండగా, ‘మేం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులం, బతకడానికి వచ్చినవాడు మమ్ముల్ని వెనక్కి నెట్టి అధికారంలో సంపాదించేస్తున్నాడు’ అనేది మొదటినుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారి అసంతృప్తి. సీఎం మొదలుకొని, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ అసంతృప్తితోనే గడుపుతున్నారు. సీఎం రేవంత్, అయన సోదరులు, మంత్రుల మధ్య బహిరంగ పోరు జరుగుతున్నది. ఇటీవలి పరిణామా లను చూస్తుంటే కాంగ్రెస్ అధిష్ఠానం సైతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు వదులుకున్నట్టు కనిపిస్తున్నది.
కాంగ్రెస్ నాయకుల బృందం ఒకటి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలవగా, రేవంత్‌ను ఖర్గే విమర్శించినట్టు తెలుస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని ఆయన వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. ఇదేమీ ఆశ్చర్యకరమైన వ్యాఖ్య కాదు. తెలంగాణలో గ్రామీణులకు సైతం తెలిసిన విషయమే. ఎవరికైనా అనుమానం ఉంటే తెలంగాణలో ఏదో ఒక గ్రామానికి వెళ్లి గ్రామస్థులను పలకరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ అభిప్రాయాన్ని చక్కగా వివరిస్తారు. అయితే, ఖర్గే ఒప్పుకోవడమే విశేషం. అలా అని ఉండకపోతే ఖర్గే ఖండించేవారు. లేకుంటే, ఖర్గేను కలిసిన కాంగ్రెస్ నాయకుల బృందమైనా ఖండించేది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మూడేండ్ల సమయం ఉన్నది. కానీ, అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తున్నా బాగు చేసుకుందామనే ఆలోచన ఆ పార్టీ నాయకత్వంలో కనిపించడం లేదు. కాంగ్రెస్ బలహీనపడితే అది ప్రయోజనమనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో బీజేపీ సహకరిస్తున్నది. బీజేపీ సహకరిస్తేనే కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉన్నదంటే, ఇక బీజేపీ కూడా వెంటపడితే ఎలా ఉండేదో. ఖమ్మం, నల్లగొండ జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను పనిచేయనివ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే కాంగ్రెస్ నాయకుల కన్నా రేవంత్‌కు బీజేపీ సహకారమే ఎక్కువ ఉన్నదని దీన్నిబట్టి స్పష్టమవుతున్నది.
ఎలాంటి ఆధారాల్లేకుండానే మద్యం కేసు అంటూ హడావుడి చేసి సీఎంలను సైతం జైల్లో వేసిన బీజేపీ.. తెలంగాణలో ముడుపుల కోసం మంత్రులు, సీఎం వీధి పోరాటాలు చేసుకుంటున్నా, గన్ పెట్టి బెదిరిస్తు న్నా మౌనం వహిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ప్రాజెక్టులు ప్రకటించడం, నిధులు కేటాయించడంలో ఉదారత చూపక పోయినా, ముడుపుల కోసం మంత్రులు వీధి పోరాటాలకు దిగుతున్నా బీజేపీ చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. పైగా సీఎంకు సహకరించడం లేదని కాంగ్రెస్ శాసనసభ్యులపై మండిపడుతున్నది. ముడుపుల కోసం ఓ మంత్రి ఓఎస్డీ డెక్కన్ సిమెంట్ యజమానులను గన్‌పెట్టి బెదిరించా రు. ఆ ఓఎస్డీని ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. మంత్రి సురేఖ ఇంట్లో సదరు ఓఎస్డీ తలదాచుకుంటే అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లారు. మంత్రి కుమార్తె ఈ సందర్భంగా సీఎంపై, సీఎం సోదరులపై తీవ్ర ఆరోపణలు చేశారు. చివరికి పోలీసులను ఎదిరించి ఓఎస్డీని మంత్రి తన కారులో తీసుకొనిపోయారు. ఈ వ్యవహారం సీఎం వర్సెస్ మంత్రి వివాదంగా రాజుకున్నది. రెండు రోజులు గడిచాక కాంగ్రెస్ పెద్దలు రాజీ కుదిర్చి మంత్రి సురేఖ, సీఎం రేవంత్‌ల భేటీ ఏర్పాటుచేశారు. ఇక రిజ్వీ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి మద్యం టెండర్ల వ్యవహారం లో సీఎం వర్గం, మంత్రి జూపల్లి వర్గం ఒత్తిడి తట్టుకోలేక వీఆర్ఎస్ తీసుకున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం చట్టబద్ధ పాలనలా కాకుండా మాఫియా పాలనలా నడుస్తున్నది!
ఎరువులు దొరకడం లేదని ఫేస్బుక్లో రాసినా, ప్రభుత్వంపై చిన్న విమర్శ చేసినా సరే అన్నం తింటున్నా ఉన్నపళంగా ఎత్తుకెళ్లే పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ముడుపులు ఇవ్వాలని గన్‌తో బెది రించడం వంటింటి ముచ్చటా? అది తీవ్ర నేరం కాదా? ఇది కాంగ్రెస్ కుటుంబ వ్యవహారం అన్నట్టుగా వ్యవస్థలు మౌనంగా ఉంటున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన చట్టబద్ధ ప్రభుత్వంలో ఇలా ఉం డదు. మాఫియా గ్రూప్‌ల మధ్య గొడవలా ప్రభుత్వ వ్యవహారం సాగుతున్నది. ఇలాంటి నేరపూరిత వ్యవహారాలపై మౌనంగా ఉండటా నికి బీజేపీ రాజకీయ కారణాలు బీజేపీకి ఉన్నాయి. దేశంలో ప్రజా స్వామ్యం గురించి రోజూ మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ రాష్ట్రంలోని తమ ప్రభుత్వ అరాచకపాలన గురించి మౌనంగా ఎందుకు ఉంటు న్నారు? చివరికి రేవంత్ మీడియా సైతం గాడితప్పిన పాలన గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నది. కేసీఆర్‌పై గుడ్డి వ్యతిరేకతతో రేవంత్‌ను భుజాన మోసిన అనుకూల మీడియా సైతం దారితప్పిన రేవంత్ పాల నపై పెదవి విరుస్తున్నది. ‘మీకు నేను అండగా ఉన్నాను’ అని ఎన్నికల ముందు ప్రకటించిన రాహుల్ సైతం తెలంగాణను గాలికి వదిలేశారు. అన్నిరంగాల్లోనూ విఫలమైన కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవ ర్గం ఉప ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటున్నది. అర్ధ బలం, అంగబలం ఉన్న అభ్యర్థిని రంగంలో నిలిపి గెలవాలని ప్రయత్నిస్తున్నది.
మహా మహా ఐపీఎస్ అధికారులు సైతం ‘మా పోలీసులను నమ్మ కండి. పలానా నమ్మండి’ అని చెప్తారు. అంతటి మహా నుభావుడు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్నాడని కాంగ్రెస్ మీడియా నిస్సిగ్గుగా టీవీల్లో చట్టబద్ధమైన పాలన కన్నా రౌడీషీటర్లను నమ్ముకోవడం బెటర్ అని కాంగ్రెస్ పాలన ప్రత్యేకతను మీడియా చెప్పకనే చెప్తున్నది. 1980 ప్రాంతంలో హైదరాబాద్‌లో రౌడీషీటర్ల హవా కనిపించేది. హోంమంత్రి కన్నా అప్పట్లోని ఒక రౌడీ శక్తివంతు డనే ప్రచారం ఉండేది. అతను 1980 ప్రాంతంలో ఎంఐఎం నుంచి పోటీ కూడా చేశారు. నాటి రోజులను తిరిగి హైదరాబాద్‌లో ప్రవేశపె ట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఇదేం పాలన అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ‘మాకు ఓటు వేసినందుకు అనుభవించండి’ అన్నట్టుగా ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ తీరు.
-బుద్దా మురళి