భారతదేశం ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధాన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం. సువిశాలమైన ఈ భరత భూమి మీద వివిధ భాషలు, భావజాలాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారాలు, ఆహార్యాలు, విశ్వాసాలు స్వేచ్ఛగా ప్రకాశిస్తున్నాయంటే దానికి భిన్నత్వంలో ఏకత్వమే కారణం. ఏమిటి ఈ భిన్నత్వంలో ఏకత్వం అంటే? వైవిధ్యభరితమైన ప్రాంతీయ సంస్కృతుల కలయిక మనకున్న వారసత్వ సంపద.
భారతీయ సంస్కృతి అంటే వివిధ ప్రాంతాల, వివిధ భాషల, వివిధ విశ్వాసాల మేళవింపే. ఈ అంశాల కలయికే భారతీయ సంస్కృతి అంటే. అంతేగానీ, వీటికి అతీతమైనదిగాదు భారతీయ సంస్కృతి అంటే. ఉదాహరణకు భారతీయ భాష అంటే ఏ భాష అని అర్థం? భారతీయ భాష అనేదేమీ లేదు, భారతీయ భాషలున్నాయి. ఇది సత్యం. భారతీయ సంస్కృతి గూడా వివిధ సంప్రదాయాల కలయిక. అంతేకానీ, ఈ సంప్రదాయాలకు బయటిది కాదు.
మనకన్నా భిన్నమైన జీవనవిధానాన్ని గౌరవిస్తూ అందరినీ కలుపుకొని పోవటమే భిన్నత్వంలో ఏకత్వం అంటే. ఇది ఎన్నో వందల ఏండ్ల నుంచి భారతీయులు అపురూపంగా కాపాడుకుంటూ వస్తున్న అరుదైన సాంస్కృతిక సంపద. బలమైన ఉప సంస్కృతుల కలయిక భారతీయత. అంటే మన వైరుధ్యాలను బలహీనతగా కాకుండా బలంగా చూడటం ఇందులోని ముఖ్యమైన అంశం. మనకన్నా భిన్నమైన జీవన విధానంతో శాంతియుత సహజీవనం చేయటానికి ఈ సూత్రం దోహదపడుతుంది. రవీంద్రుని కలం నుంచి జాలువారిన మన జాతీయ గీతం జనగణమన ఈ వైరుధ్యాలనే అందంగా అభివర్ణిస్తుంది. ఈ భిన్నత్వం భారతీయులకు ఒక విశాల దృక్పథాన్ని అలవాటుచేసింది. వైవిధ్యంతో మనం కలసిపోతాం.
అందరూ ఒకలాగే ఉండవలసిన అవసరం లేదు. అది సాధ్యమూ కాదు. ఒక విశాలమైన ఐక్యతా భావంలో భిన్నమైన ఉప సంస్కృతులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి ఈ గడ్డమీద. దీనివలన మనకన్నా భిన్నమైన విధానాన్ని మనం చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. మనం ఎవరితోనైనా సులభంగా కలసిపోగలుతున్నాం. భిన్నత్వాన్ని గౌరవిస్తాం, ఏకత్వాన్ని చాటి చెప్తాం. అందువల్లనే వివిధ మతాలూ, వివిధ విశ్వాసాలూ స్వేచ్ఛగా భాసిల్లగలుగుతున్నాయి ఈ గడ్డ మీద. నమ్మకాలు వ్యక్తిగత వ్యవహారమని గుర్తించి ఒకరి నమ్మకాలను, ఆచార సంప్రదాయాలనూ ఇతరులు గౌరవిస్తూనే, మనం అందరం ఒక జాతికి చెందినవాళ్లమనే భావన మనం ఎన్నటికీ మర్చిపోం. మనందరం భారతీయులం. మనలో అనేక భాషలు మాట్లాడే వాళ్లున్నారు. అందరి సాహిత్యంలో, సంప్రదాయాల్లో గొప్పదనం ఉన్నది. అందుకే అందరినీ గౌరవించగలుగుతున్నాం. ఇదే ఐక్యతా భావమంటే. ఎవరి పద్ధతులు వారు అనుసరిస్తూనే ఒక జాతిగా అందరం ఒక తాటిమీద నిలుస్తున్నాం. ఇదే భారతీయతలోని ఔన్నత్యం. ఈ ఐక్యతను ఔన్నత్యాన్ని చేజేతులా పాడుచేసుకోరాదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అదే అన్న ఆందోళన చాలామంది ప్రజల్లో అంతర్లీనంగా ఉన్నది.
ఈ స్ఫూర్తిని ఏకీకరణ పేరుతో దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది నేడు. ఐక్యత వేరు, ఏకీకరణ వేరు అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఏకీకరణ ఏం చెప్తున్నది? అందరూ ఒకేలా ఉండాలని చెప్తుంది? అది ఈ గడ్డమీద సాధ్యమా? ఏ గడ్డమీదైనా అది సాధ్యమా? సమోసా తినేవాళ్లు సాంబారు తాగటం, సాంబారు తాగేవాళ్లు సమోసా తినటం అనేది వారి వారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అందరినీ చపాతి తినమనటం సాధ్యమా? అందరూ ఒకేవిధమైన వేషధారణలో ఉండాలంటే సాధ్యమా? కానీ ఏకీకరణ అదే కోరుతుంది. భిన్నత్వాన్ని సహించదు.
పాదం ఎంత పొడవున్నా అందరూ ఒకే సైజు చెప్పులు తొడుక్కోవడం సాధ్యమా? చట్టం ద్వారా దీన్ని సాధ్యం చేయగలమా? ఏకీకరణ అంటే అదే. ఏకీకరణ ఐకమత్యాన్ని ఆదరించదు. అందరూ ఒకేలా ఉంటేనే ముద్దు. భిన్నంగా ఉండటం వద్దు అంటుంది ఈ ఏకీకరణ భావజాలం. ఇది అసహనం అనే బీజం నుంచి పుట్టింది. ఇది లౌకికవాదానికి వ్యతిరేకి. మనకు ఎంతో చేటు చేసే శక్తి ఉన్నది దీనికి.
ఈ కోవకు చెందినదే ఇప్పుడు దేశం అంతా చర్చిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి అనే అంశం. మనిషి సాంఘిక జీవనంలో ముఖ్యమైన అంశాలైన వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం లాంటివి పౌరస్మృతి కిందకు వచ్చే విషయాలు. ఈ విషయాలు చాలావరకు మత విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశాలు. ఉదాహరణకు వివాహం హిందువుల్లో ఒకవిధంగా, ముస్లింల్లో మరోవిధంగా, క్రిస్టియన్లలో ఇంకోవిధంగా ఉండటం మనం చూస్తున్నాం. ఎవరి విధం వారిది. అది వారివారి ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకూ ఈ విధానమే కొనసాగుతూ వచ్చింది. ఉమ్మడి పౌరస్మృతి గనుక చట్టమైతే అన్ని విశ్వాసాల వారూ ఒకే విధమైన వివాహ సంప్రదాయాన్ని, విడాకుల పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. భిన్న సంస్కృతులు విరాజిల్లుతున్న ఈ గడ్డమీద అది సాధ్యమేనా? హిందూ మతంలోనే అనేక వైరుధ్యాలున్నాయి. శైవులని, వైష్ణవులని, ద్వైతమని, అద్వైతమని. ఇహ ఉత్తర దక్షిణ వైరుధ్యాలు సరేసరి. ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయులను మొన్నటిదాకా మద్రాసీలని సంబోధించేవారు. వారికి దక్షిణ భారతీయులందరూ ఒకటే. కానీ వాస్తవమేంటి? తెలుగు వారు తమిళులు వేరు, తమిళులు మలయాళీలు వేరు, మలయాళీలు కన్నడ వారూ వేరు, కన్నడ వారూ తెలుగు వారూ వేరు. మళ్లీ అందరూ ద్రవిడ తెగకు చెందినవారే. మెజారిటీ వర్గంలోనే ఇన్ని వైరుధ్యాలున్నప్పుడు, అల్పసంఖ్యాక వర్గాల్లో వైరుధ్యాలు ఉండటం సహజమే కదా. ఈ వైరుధ్యాల వల్ల దేశానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఈ వైరుధ్యాలు మన సాంస్కృతిక సంపదకు వన్నె తెచ్చేవే.
ఇక్కడ సమస్య ఏమిటంటే మత విశ్వాసాలతో ముడిపడి ఉన్న వివాహ పద్ధతి అందరికీ ఒకేవిధంగా ఉండాలంటే ఎవరిదో ఒకరి పద్ధతి పాటించాలి. అది ఎవరి పద్ధతి అయి ఉంటుంది? హిందువుల్లో ఏడు అడుగులు నడవటం ప్రధానం. ఇతర మతాలవారి వివాహంలో అది లేదు. మరి వారందరినీ ఏడు అడుగులు నడవమంటే ఎలా ఉంటుంది? వారికి సమ్మతిగా ఉంటుందా లేక మరొకరి విధానం మా మీద రుద్దుతున్నారేమిటి అనుకుంటారా? తప్పకుండా అనుకుంటారు. అక్కడితో ఆగదు. ఆందోళన చెందుతారు, అభద్రతాభావానికి గురవుతారు. మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులేం చెప్తున్నాయి? వ్యక్తి స్వేచ్ఛకు పెద్దపీట వేస్తున్నాయి. ఆర్టికల్-19 వ్యక్తిగత స్వేచ్ఛకూ సంబంధించిన అనేక అంశాలను పొందుపరిచింది. ప్రభుత్వం ఈ స్వేచ్ఛలను హరించే చర్యలు ఏవీ చేపట్టరాదూ అని చెప్తుంది. మరీ ముఖ్యంగా ఆర్టికల్-29 ఏమి చెప్తున్నది?
సమాజంలో ఏ వర్గమైనా వారివారి భాషను, సంస్కృతినీ కాపాడుకునే స్వేచ్ఛ కల్పించింది. ఎవరి సంస్కృతిని వారు కాపాడుకునే ప్రాథమిక హక్కు రాజ్యాంగం ద్వారా సంక్రమించినప్పుడు, వారి సంస్కృతికి భిన్నమైన రీతిలో వివాహం, విడాకులు లాంటి అంశాల్లో అందరూ ఉమ్మడిగా పాటించే విధమైన చట్టం ఎలా చేస్తారు? అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా?
ఇప్పుడు ఇంత అర్ధాంతరంగా ఈ ఉమ్మడి పౌర స్మృతిని తెరమీదికి తేవాల్సిన అగత్యం ఏమి వచ్చింది? కోట్లాదిమంది ప్రజలు కూడు, గుడ్డా, నీడా కరువై ఖాళీ కడుపులతో రోడ్డు పక్కన నిద్రిస్తుంటే వారి గోడు పట్టించుకోకుండా ఉమ్మడి పౌరస్మృతిని చర్చకు పెట్టడం, చట్టం చేయటం ముఖ్యమని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి? ఆలోచించేవారికి ఎవరికైనా అర్థమవుతుంది దీని ఉద్దేశం ఏమిటో. ఇది హిందూ మతానికి చెందినవారిని కూడగట్టి ప్రసన్నం చేసుకోవటమే. తద్వారా మత సామరస్యాన్ని దెబ్బతీయటమే. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నవి.
ఐదేండ్లలో ఏమి చేశారు అంటే ఆర్టికల్ 370ని రద్దు చేశాం, ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టామని తప్ప నిరుద్యోగ సమస్య ఏ మాత్రం పరిష్కారం చేశాం, రైతుల సమస్యలను ఎంతమేర పరిష్కరించాం, ఆర్థిక, సామాజిక అసమానతలను ఏ మేరకు తొలగించాం, సమాజం కోరుకునే అభివృద్ధిని ఏ మేరకు సాధించామనే ప్రశ్నల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ ఉమ్మడి పౌరస్మృతి.
ఇది కాదు నేటి సమాజం కోరుకునేది. అభివృద్ధిని కోరుకుంటుంది. అంటే పెట్టుబడులు, పరిశ్రమలు రావాలి, ఉద్యోగ కల్పన జరగాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, సాగునీరు తాగునీరు వసతిని బాగా అభివృద్ధి చెయ్యాలి, దవాఖానలు కట్టాలి, ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలి, విద్యుత్తు సమస్య తీర్చాలి, రోడ్లు మెరగవ్వాలి, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మెరుగుపడాలి, తద్వారా ప్రజలు మెరుగైన జీవితాన్ని అనుభవించాలి. ఇదే కావాలి ఏ ప్రభుత్వానికైనా ప్రధాన అజెండా. అంతేగానీ మతం ఆధారంగా పరిపాలించటమంటే జబ్బు ఒకటైతే మందు మరొకటి ఇవ్వడమే. హిందూ, హిందీ, హిందుత్వ అనేదే బీజేపీ నినాదం. రోటీ, కపడా, మకాన్ అనేది ప్రజల అవసరం. పరిపాలన ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలా లేక పాలకుల భావజాలానికి అనుగుణంగా ఉండాలా? ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ప్రజల అవసరాలూ, ఆకాంక్షలూ అర్థం చేసుకొని వాటిని నెరవేర్చే సుపరిపాలన అందించటమే కదా.
మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఉమ్మడి పౌరస్మృతిని సాధించాలని చెప్తున్న మాట వాస్తవం. దానితోపాటు ప్రజా సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలున్నాయి ఆదేశిక సూత్రాలలో. వాటిజోలికి పోకుండా చట్టం చేసి చేతులు దులుపుకొనే అంశమైన ఉమ్మడి పౌరస్మృతిని తెరమీదకు తేవడంలో ముఖ్య ఉద్దేశం పాలక పక్షం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చటమే అని చాలామందికి అనిపిస్తున్నది.
వివాదం లేని చోట వివాదాన్ని సృష్టిస్తే జనం మిగతా విషయాలు మరిచిపోయి వివాదంతో సతమతమవుతారు. పాలకులకు కావాల్సిందీ అదే కదా!
మన దేశంలో క్లిష్టమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై చట్టం చేసి చెయ్యి దులుపుకోవడం పాలకులకు పరిపాటి అయ్యింది ఎప్పటినుంచో. ఈ జాడ్యం కాంగ్రెస్ పాలనలో మొదలైంది. చట్టం మనిషి బాహ్య ప్రవర్తనను నియంత్రించగలదేమో గాని మనిషి ఆలోచనావిధానాన్ని మార్చలేదు. ఆలోచనలో మార్పు రావాలంటే మీడియా, అకాడెమియా, మేధావులూ, సాహితీవేత్తలూ, సంఘ సంస్కర్తలూ, స్వచ్ఛంద సంస్థ లు, చట్టసభలూ, చివరగా ప్రభుత్వ యంత్రాం గం కలసి పనిచేయాలి. సామాజిక మార్పు అనేది చాలా సమయం పట్టే ప్రక్రియ. ఎన్నో ఏండ్లు సహనంతో శ్రమించాలి. చట్టం ద్వారా సామాజిక మార్పు రాదు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గతి ఏమైంది నేడు? వరకట్న నిషేధ చట్టం, కుల వివక్ష నిషేధ చట్టం, గృహహింస నిషేధ చట్టం లాంటివి సమాజాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయగలిగినవి? ప్రజల అంగీకారం అవసరం లేదా? ఇప్పుడున్న ఆచార, సంప్రదాయాల్లో అభివృద్ధికి అవరోధంగా ఉన్న వాటిని తొలగించటానికి చట్టం చెయ్యొచ్చుగానీ మూకుమ్మడిగా మార్పులు చేస్తే ప్రజలు వాటిని ఆచరిస్తారా? వరకట్న నిషేధాన్ని ఏ మాత్రం గౌరవిస్తున్నారో మనకు తెలియదా? ఎన్నికలకు ముందు ఇంత హడావుడిగా ఎందుకు ఈ చట్టం చేయతలపెట్టారో ప్రజలు తెలుసుకోవాలి. ఇది చాలా సునిశితమైన అంశం. రాజకీయ నాయకుల స్వప్రయోజనాలకు గట్టిగా నో చెప్పాల్సిన సమ యం ఇదే. ఇప్పుడు నో చెప్పకపోతే, చట్టసభల్లో బలం ఉంటే ఏమైనా చేయగలమనే అహం పాలకుల్లో వేళ్లూనుతుంది. అది దేశానికి ప్రమాదం.
ఆర్టికల్-370ని రద్దుచేశాం; దానివల్ల సాధించినదేమిటి అంటే ఏమీ లేదు. ప్రజలు పేదరికంలో అలమటిస్తున్నప్పుడు మనకు సింబాలిజం ముఖ్యమా లేక సబ్స్టాన్స్ ముఖ్యమా? ప్రజలకు సబ్స్టాన్స్ కావాలి, పాలకులకు సింబాలిజం కావాలి. ఒక దేశం ఒక ఎన్నిక, ఒకదేశం ఒక పన్ను, ఒక దేశం ఒక భాష, ఒక దేశం ఒకే వాతావరణం; ఇవికాదు ప్రజలు కావాలంటున్నది. ఉదాహరణకు లా కమిషన్ కూడా చెప్పింది ఉమ్మడి పౌరస్మృతి అనవసరమైన అంశం అని. ఇప్పుడు దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు అని. ప్రజల అవసరాలకు పాలకుల ప్రయారిటీలకు మధ్య వ్యత్యాసం ఉండటం ప్రజాస్వామ్యానికి విజయం కాదు. ప్రజలకు మెరుగైన జీవన విధానం ఇష్టం. పాలకులకు ప్రీతి ధర్మ సంస్థాపన’! కానీ, ఏది ధర్మం? ఆకలిగా ఉన్నవానికి అన్నం పెట్టడమా లేక మతాన్ని బోధించటమా? ఇది ఆధునిక భావాలకు పూర్తిగా భిన్నమైన వాదన. ప్రభుత్వం ప్రజల నిజమైన అవసరాలు గుర్తించి ఆ అవసరాలు తీర్చే చర్యలు తీసుకోవాలి. అంటే అనుత్పాదక అంశాలను పక్కనపెట్టి ఉత్పాదక అంశాలనే పరిపాలనకు ప్రధాన అజెండాగా చేసుకోవాలి. లేకపోతే ఈ నాడు ఎన్నికల్లో ఎలాగోలా నెగ్గినా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అన్నివేళలా చరిత్రను తిరగరాసే అవకాశం రాదు. రాకూడదు కూడా!
(వ్యాసకర్త: లోక్సభ సచివాలయంలో విశ్రాంత సంచాలకులు)
-గుమ్మడిదల రంగారావు