రైతును రాజును చేస్తామని, అన్నదాతల వల్లనే దేశం సుభిక్షంగా ఉందని మన దేశంలో పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ,వాస్తవికంగా రైతుల సంక్షేమం విషయానికి వచ్చేటప్పటికి పాలకులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. రైతులకు మేలు కలిగించే పథకాలను, ఆలోచనలను అమలు చేయడానికి ఏండ్లకేండ్లు కాలయాపన చేసే ప్రభుత్వాలు.. ఆంక్షలు, కొర్రీల విషయంలో మాత్రం క్షణకాలంపాటు కూడా ఆలోచించడం లేదు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఇటీవల తీసుకువచ్చిన కొత్త నిబంధనలే అందుకు తాజా నిదర్శనం.
పత్తి కొనుగోళ్ల విషయంలో నూతన నిబంధనలు తీసుకురావడానికి సీసీఐ చెప్పిన కారణం అత్యంత హాస్యాస్పదంగా, అసహ్యంగా నూ తోస్తున్నది. పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లు లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయని, వాటిని అరికట్టడానికే నూతన నియమాలు, నిబంధనలను తీసుకొచ్చినట్టు సీసీఐ చెప్తున్నది. తప్పొకరు చేస్తే శిక్ష మరొకరికి వేసినట్టుగా ఉన్నది సీసీఐ తీరు. మన దేశంలో పత్తి కొనుగోళ్లు, పత్తికి మద్దతు ధర కల్పించడం, ధరల స్థిరత్వం, పత్తి పరిశ్రమలను బలోపేతం చేయడం కోసం 1970లలో భారత ప్రభుత్వం సీసీఐని ఏర్పాటు చేసింది. రైతులకు మేలు చేయడానికే దీన్ని స్థాపించారని అందరూ భావిస్తారు. కానీ, వాస్తవానికి ఆ సంస్థ ఎన్నడూ రైతులకు లాభం చేకూర్చే పనికి నిజాయితీగా పూనుకోలేదు. తద్విరుద్ధంగా రైతులకు నష్టాలు చేసే ప్రతిపాదనలనే ఎక్కువసార్లు ప్రవేశపెట్టి రైతుల నడ్డి విరగ్గొడుతున్నది. ప్రభుత్వాలు తప్పించుకోవడానికి, తమపై నిందరాకుండా చూసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఓ అధికార దళారి వ్యవస్థనే ఈ సంస్థ.
జూలైలో 2025-26 (అక్టోబర్ – సెప్టెంబర్) సీజన్ కోసం పత్తి పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని ఇటీవల సీసీఐ ప్రకటించింది. వివిధ రకాలుగా పత్తి నాణ్యతను వర్గీకరించి మద్దతు ధరలను నిర్ణయించింది. దీంట్లో ప్రధానంగా మీడియం స్టాప్ కాటన్‌కు క్వింటాలుకు రూ.7,710, లాంగ్ స్టాప్ కాటన్‌కు రూ.8,110 మద్దతు ధరను ప్రకటించింది. అయితే, గతంలో ఒక ఎకరాకు 12 క్వింటాల కంటే ఎక్కువ పత్తిని కొనుగోలు చేయలేమని చెప్పిన సీసీఐ.. ఇప్పుడు తీరా మార్కెట్లకు పత్తి చేరుకుంటున్న సమయంలో ఏకంగా ఎకరాకు ఏడు క్వింటాళ్లకు మించి పత్తి కొనుగోలు చేయబోమని కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. జిన్నింగ్ మిల్లుల అవినీతి కథ చెప్తూ రైతుల మెడకు ఉరితాళ్లు పేనుతున్నది. అంతేకాదు, పత్తిలో 8 లేదా అంతకంటే తక్కువ శాతం తేమ ఉంటేనే మద్దతు ధర లభిస్తుందని అంటున్నది. లేదంటే తక్కువ ధర వస్తుందని సెలవిచ్చింది. ఈ నిబంధనలను సమర్థించుకోడానికి సీసీఐ కొత్త పాట పాడుతున్నది. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ప్రకారం.. రైతుల దగ్గర మిల్లర్లు తక్కువ ధరకు పత్తి కొని, సీసీఐకి ఎక్కువ ధరకు అమ్మి లాభాలు గడిస్తున్నాయని సాకులు చెప్తున్నది. సగటున ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుబడి వస్తుందని, అందుకే ఆ పరిమితి పెట్టామని అంటున్నది.
నిజానికి ఒక ఎకరాకు సగటున 8-12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. కరువు ప్రభావిత లేదా అధిక వరద ప్రభావిత ప్రాంతాల్లో 6-8 క్వింటాళ్ల సగటు దిగుబడి వస్తుందనేది రైతులు, వ్యవసాయ నిపుణుల మాట. నిజానికి సీసీఐ చెప్పిందే నిజమనుకుంటే, నిన్నమొన్నటి వరకు ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలు చేస్తామని ఎట్లా చెప్పింది? జిన్నింగ్ మిల్లులను కట్టడి చేయడానికి కాదు, రైతులను ముంచడానికే ఈ నిబంధనలు తెచ్చినట్టు తెలుస్తూనే ఉన్నది. జిన్నింగ్ మిల్లుల వద్ద అవినీతి, అక్రమాలు జరగకుండా పర్యవేక్షించడం సీసీఐకి పెద్ద కష్టమేమీ కాదు. ప్రభుత్వం తలుచుకుంటే రైతులు తమ ఉత్పత్తులను అమ్మిన ప్రతీచోట మద్దతు ధర పొందేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. జిన్నింగ్ మిల్లులు, దళారుల వల్ల అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనుకుంటే నేరుగా అవి కొనకుండా అడ్డుకోవాలి. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను (ఐకేపీ) ఏర్పాటు చేసినట్టు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తద్వారా రైతులకు లాభం జరుగుతుంది. అవినీతి కూడా కట్టడవుతుంది. ఇవన్నీ చేయడం చేతకాక, రైతులకు మంచి చేయడం ఇష్టం లేక సీసీఐ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది.
ఇంకొక కొత్త సమస్యను రైతుల మెడకు కట్టింది సీసీఐ. అది ‘కపాస్ కిసాన్’ యాప్. ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్నవారే పత్తి అమ్ముకోగలరు. అది కూడా రైతులు ఏ రోజు అమ్ముకోవాలని ముందుగా చెప్తే, ఆ రోజే పత్తి కొంటారు. కానీ రైతు లు తమ వీలును బట్టి తీసుకుపోతే కొనరనే కొర్రీ రైతులకు ఏ విధంగా లాభదాయకమో సీసీఐ సమాధానం చెప్పాలి? అకాల వర్షాలతో నిండా రైతులను ముంచే వాతావరణం కలిగిన ఈ దేశంలో చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం చేయడమంటే సాహసమే కాదు, ప్రాణాలను పణంగా పెట్టడం కూడా. అటువంటిది రైతులు తాము అనుకున్న రోజు పత్తిని అమ్ముకునే అవకాశం కూడా లేకపోవ డం శోచనీయం. ఆ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రోజునే పత్తి కొంటామని సీసీఐ అంటున్నది. ఒకవేళ స్లాట్ బుక్ చేసుకున్న రోజున హఠాత్తుగా వర్షం పడితే ఎటుపోవాలి? నూటికి 90 శాతం నిరక్షరాస్యులైన రైతులు యాప్ ద్వారానే తమ ఉత్పత్తులను అమ్మాలంటే ఎట్లా సాధ్యమవుతుంది?
అయితే, ఇందులో అత్యంత అన్యాయానికి గురవుతున్నది కౌలు రైతులే. వ్యవసాయదారుల్లో నూటికి 50 శాతం ఉన్న వీరిని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. కౌలు రైతులు వారి పంటలను ఎట్లా అమ్ముకోవాలి? భూ యజమాని దయాదాక్షిణ్యాలపై ఆధారపడే వీరికి మద్దతు ధర కూడా అందట్లేదు.
నకిలీ విత్తనాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కల్తీ పురుగుమందుల వల్ల దిగుబడి రాక అప్పుల్లో కూరుకుపోతున్నా సదరు కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదు. మేలైన పత్తి విత్తనం గురించి రైతులకు అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. ఎలాంటి విధానాలు అవలంబిస్తే అధిక దిగుబడి వస్తుందన్న శిక్షణ ఇవ్వడం లేదు. కానీ, తాము చెప్పిన ప్రమాణాలతో లేకుంటే పత్తి కొనుగోలు చెయ్యబోమని, మద్దతు ధరలు ఇవ్వబోమని నిబంధనలు మాత్రం తీసుకొస్తున్నది.
దేశంలోని వాతావరణ పరిస్థితులు పాలకులకు పట్టవు. వాతావరణం వల్ల దెబ్బతిన్న పంటలు, రైతుల కష్టాలు వారికి కనపడవు. కానీ, మేలైన పతి కే మద్దతు ధర ఇస్తామంటారు. అసలు సీసీఐ ఉన్న ది రైతుల కోసమా లేకా దళారీల కోసమా, కార్పొరే ట్ శక్తుల కోసమా? సమాధానం చెప్పాలి.
ఇటీవల తెలంగాణలో అకాల వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పత్తి ఆగమైంది. ఇలాంటి పరిస్థితుల్లో 8 శాతం తేమ ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తామంటే ఎలా? ఇప్పుడు ఆ పత్తి రైతులంతా విధిలేక అగ్గువసగ్గువకు దళారీలకు అమ్ముకోక తప్పని పరిస్థితి కల్పించింది ఈ సీసీఐ కాదా? సీసీఐని ముందుపెట్టి పత్తి రైతులతో ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమే ఇదంతా. పెద్ద పెద్ద కాటన్ పరిశ్రమలకు లాభాలు చేకూర్చేందుకు చేస్తున్న ఉపాయాలే ఇవి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిజానికి పత్తి పరిశ్రమను బలోపేతం చేయడానికే ఉద్దేశించినదైతే, అది ముందుగా బలోపేతం చేయాల్సింది పత్తి రైతులను. అందుకు నిత్యం నూతనంగా వస్తున్న మార్పులను రైతులకు వివరించాలి. వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు ఏవో ప్రచారం చేయాలి. ప్రకృతి ప్రకోపించినప్పుడు తేమ తదితర విషయాలను పక్కనపెట్టి కొనుగోళ్లు చేయాలి. తద్వారా రైతు నష్టాలపాలు కాకుండా చూడాలి. రైతుకి స్థిరంగా మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే పత్తి పరిశ్రమను బలోపేతం చేసినట్టు అవుతుంది.
ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఏమీ ఎరుగనట్టు గమ్మునుండటం విషాదకరం. కార్పొరేట్ కంపెనీలకు నష్టాలు వచ్చాయని, కట్టలేని స్థితిలో ఉన్నాయని ఎంతో ఉదారంగా రూ.వేల కోట్ల రుణాలను రైటాఫ్ చేసే ప్రభుత్వం రైతుల కష్టాల గురించి ఇసుమంతైనా పట్టించుకోకపోవడం పక్షపాత ధోరణికి నిలువుటద్దం. దీన్నిబట్టి పాలకులు పనిచేస్తున్నది ఎవరికోసమో తేటతెల్లమవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని పత్తి రైతుల మెడలపై పెట్టిన నూతన రూల్స్ కత్తిని తొలగించాలి. ఇందుకు సమాజం మొత్తం ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. లేకుంటే తమ అనుయాయుల కోసం ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు తమ ఇష్టానుసారం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాయి. సామాన్యుల నెత్తి మీద మోయలేని భారం పడుతూనే ఉంటుంది. పేదలు పరోక్షంగా ధరాఘాతానికి బలవుతూనే ఉంటారు.
(వ్యాసకర్త: ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రెటరీ, మానవ హక్కుల వేదిక)
-దిలీప్.వి
84640 30808