హైదరాబాద్ ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ)/కవాడిగూడ : రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సాగు యంత్రాలపై సబ్సిడీ పత్తాలేదని, అదునుకు అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా జమకావడం లేదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత విధానాలతో అన్నదాతలు ఆర్థికంగా కుదేలయ్యే ప్రమాదమున్నదని స్పష్టంచేశారు. శనివారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ‘రైతుబడి యూట్యూబ్’ చానల్ నిర్వాహకుడు రాజేందర్‌రెడ్డి ఏర్పాటు చేసిన అగ్రి షోకు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వ్యవసాయ ప్రదర్శనతో వేలాది మంది రైతులకు మేలు చేకూరుతుందని, ప్రభుత్వం చేయాల్సిన పనిని రాజేందర్‌రెడ్డి చేస్తున్నారంటూ ఆయనను అభినందించారు. అనంతరం సందర్శకులు, అతిథులను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకప్పుడు తీర ప్రాంతాల్లో మాత్రమే పండించే ఆయిల్‌పామ్ తెలంగాణలోనూ విస్తరించిందని, రైతుల ఆదాయం పెంచేందుకు గత కేసీఆర్ సర్కార్ ఈ పంటను ప్రోత్సహించిందని గుర్తుచేశారు. కేంద్రం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలతో పామాయిల్ రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నదని, పామ్ క్రూడాయిల్‌పై 25 శాతం ఉన్న దిగుమతి పన్నును 16 శాతానికి తగ్గించడాన్ని తప్పుబట్టారు. పన్ను తగ్గింపుతో రూ.25వేలు ఉన్న పామాయిల్ టన్ను ధర రూ.21వేలకు పడిపోయిందని పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో తాగు, సాగునీటికి అరిగోస పడ్డ తెలంగాణ కేసీఆర్ పాలనలో సాగు సస్యశ్యామలమైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి దేశంలోనే ధాన్యం ఎక్కువ పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో అన్నదాతలకు ఆర్థిక దన్ను కల్పించారని చెప్పారు. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత సాగురంగం తిరోగమనం వైపు పయనిస్తున్నదని విమర్శించారు. సాగు యంత్రాలపై సబ్సిడీ, పెట్టుబడి సాయానికి దిక్కులేకుండా పోయిందని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ నుంచి కార్మికులు వస్తే తప్ప తెలంగాణలో నాట్లుపడటం, కల్లాల్లో ధాన్యం ఎత్తి మిల్లుల్లో దించే పరిస్థితి లేదని చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో అద్భుతమైన టెక్నాలజీని వినియోగిస్తున్నారని ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు.
అమెరికా-భారత్ సాగు ఒప్పందంతో మన దేశ రైతులకు తీరని నష్టం జరుగుతుంది. రూ.45లక్షల కోట్ల విలువైన సోయా, మక్క, పత్తి ఉత్పత్తులను అమెరికా నుంచి పన్ను లేకుండా దిగుమతి చేసుకొంటే సోయా ఎక్కువగా పండించే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ రైతుల పరిస్థితి ఏంటి? ఈ సీజన్లో మక్కను అధికంగా పండిస్తున్న రైతులకు నష్టం రాదా? మన రైతులు ఏం కావాలి?
– హరీశ్‌రావు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాలపై యూరియా యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని హరీశ్‌రావు ఆరోపించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా, కేవలం రైతుల ఎరువుల క్యూ కనిపించకుండా చేసేందుకే అసంబద్ధమైన నిర్ణయం తీసుకున్నదని ఆక్షేపించారు. పాస్బుక్కుకు రెండు సంచుల యూరియా బస్తాలిస్తే.. కొత్తగా భూములు కొనుగోలు చేసిన పాస్బుక్కు ల్లేని రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నిరక్షరాస్యులైన రైతులు స్మార్ట్‌ఫోన్ వినియోగించే అవకాశం ఉంటుందా? వారు ఎలా యూరియా తీసుకోవాలని మండిపడ్డారు. ప్రభుత్వం రైతు కోణంలో ఆలోచించాలని సూచించారు. ఫిబ్రవరి చివరి వారం వచ్చినా రైతుభరోసా ఇవ్వలేదని, వెంటనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రైతుబడి అగ్రి షోను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టాళ్లల్లో కలియదిరిగారు. అధునాతన టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన సాగు పరికరాలను పరిశీలించారు. స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడి వ్యవసాయం పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. పల్లెలకే పరిమితమైన వ్యవసాయాన్ని నగరం నడిబొడ్డుకు తీసుకొచ్చిన రాజేందర్‌రెడ్డిని ఆయన అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. ఈ అగ్రి షో నేటి తరం రైతులకు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు.