మాడల్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అస్సాం బ్యూటీ కాయాదు లోహర్. ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా సెన్సెషన్ సృష్టించిన కాయాదు.. ‘అల్లూరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన ‘ఫంకీ’తో మరో హిట్ కొట్టింది. ఈ సందర్భంగా అస్సాం ఆసమ్ బ్యూటీ కాయాదు పంచుకున్న కబుర్లు ఇవి..
మాది అస్సాం. నేను అక్కడే పుట్టాను. మహారాష్ట్రలో పెరిగాను. ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. ఆ క్రమంలో కొన్నాళ్లు మాడలింగ్ చేశాను. సినిమాల మీదే
ఫోకస్ చేయాలని మాడలింగ్ వదిలిపెట్టాను.
‘కష్టపడాలి, చిత్తశుద్ధితో ఉండాలి, బాధ్యతగా వ్యవహరించాలి’ నాకు తెలిసిన ఫార్ములా ఇదే! ఇండస్ట్రీలో పరిచయాలు లేకపోవడంతో ప్రతి ఆడిషన్లో నన్ను నేను నిరూపించుకోవాల్సి వచ్చేది. ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి.
ఫంకీ షూట్ మొత్తం ఫన్నీగా జరిగింది. డైరెక్టర్ అనుదీప్ చలాకీ మనిషి. నవ్వుతూనే యాక్షన్ చెప్పేస్తాడు. షాట్ ఒకే అవ్వగానే మళ్లీ నవ్విస్తాడు. విశ్వక్సేన్ కూడా మంచి వ్యక్తి. మొత్తంగా ‘ఫంకీ’ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశా. తెలుగులో ఇది నా రెండో సినిమానే అయినా, భాష పరంగా పెద్దగా ఇబ్బంది
అనిపించలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటా. నాకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేస్తుంటా. వాటివల్ల కొన్నిసార్లు ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాను. సోషల్ మీడియాలో పుట్టుకొచ్చే పుకార్లు, ట్రోల్స్ చూసినప్పుడు ఒక్కోసారి చిరాగ్గా అనిపిస్తుంది. కానీ, ఆ కామెంట్లకు నేను బాధపడటం ఏమిటని ఇగ్నోర్ చేస్తా.
గతంలో కొన్ని సినిమాలు చేసినా డ్రాగన్ సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా విజయం సాధించడంతో ప్రస్తుతం పది సినిమాలకు సైన్ చేశా. నాని నటిస్తున్న ప్యారడైజ్, సింబు హీరోగా వస్తున్న ఎస్టీఆర్-49 ఈ లిస్టులో ఉన్నాయి.
వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నది నా ఆలోచన. అందుకే ప్రతి కథలో నన్ను నేను ఊహించుకొని చేస్తున్నా. పారడైజ్‌లో కొత్తగా కనిపిస్తా. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నా.