హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్నిప్రమాదంలో సుమారు 1,100 కేసులకు సంబంధించిన ఫైళ్లు దగ్ధమయ్యాయన్న విష యం బయటకొచ్చింది. అవి ఏయే కేసులు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు రిఫర్ చేశారు? ఆ కేసుల్లో నేరాల తీవ్రత ఎంత? అన్న విషయా లూ బయటకు పొక్కడం లేదు. ‘పక్షం దాటినా ఫోరెన్సిక్ ప్రశ్నలెన్నో’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
ఈ ప్రత్యేక కథనంతో వచ్చిన కదలికతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ఫోరెన్సిక్ విభాగం ఉన్నతాధికారులు కొందరు తమ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చారు. దీంతో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో కేవలం 1,100 కేసులకు సంబంధించిన ఆధారాలు మాత్రమే కాలిపోయాయంటూ ఆయా మీడియాల్లో కథనాలు వండి వార్చారు. దీనిపై ఫోరెన్సిక్ ఉన్నతాధికారులను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా.. ఆ ప్రమాదం జరిగిన తీరు, ఎన్ని ఫైళ్లు కాలిపోయా యి? అవి ఎన్ని కేసులకు సంబంధించినవి? అన్న విషయాలపై మాట్లాడేందుకు విముఖత వ్యక్తం చేశారు.
‘మీడియాలో వస్తున్న సమాచా రం నిజమేనా?’ అని వాట్సాప్ ద్వారా సందేశం పంపగా.. ‘నో’ అన్న సమాధానమే ఇచ్చారు. అంతకుమించి ఆ విషయం గురించి మాట్లాడేందుకు ససేమిరా అన్నారు. ఇదే విషయంపై నాగ్‌పూర్‌కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులను సంప్రదించగా.. వారు కూడా రాష్ట్ర అధికారులనే అడిగి తెలుసుకోవాలని, దాని గురించి ఇప్పుడు తామేమీ చెప్పలేమని తేల్చి చెప్పారు.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ప్రమాదం ఎ లా జరిగింది? అన్న అంశంపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. దీనిపై ఏ అధికారిని అడిగినా సమాధానాన్ని దాటవేస్తున్నారే తప్ప.. ఫలానా కారణం వల్లనే అది చోటుచేసుకున్నదని.. లేదంటే కుట్ర కోణంలేనే ఈ ప్రమాదం జరిగిందని మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఒకవైపు పోలీస్‌శాఖ, మరోవైపు ఎఫ్ఎస్ఎల్లోని రెండో శ్రేణి అధికారులు మీడియాకు ఇచ్చిన లీకుల్లో 1,100 కేసుల ఆధారాలు, ఫైళ్లు కాలిపోయినట్టు బయటకొచ్చింది.
ఆ 1,100 కేసులకు సంబంధించిన సమాచారాన్ని తిరిగి సంపాదించే అవకాశమే లేదని, రిట్రైవ్కు కూడా ఎలాంటి అవకాశం లేదని ఏకంగా నాగ్‌పూర్‌కు చెందిన నిపుణులు చెప్పినట్టు లీకులిచ్చారు. మరోవైపు ప్రమాద తీవ్రతను ప్రత్యక్షంగా చూసిన ఫైర్, హై డ్రా సిబ్బంది వేల కేసుల్లో ఆధారాలు ధ్వంసమై ఉంటాయని అనుమానాలు వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగిన మరుసటే రోజే మీడియాతో మాట్లాడిన ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖా గోయెల్ ఆధారాలు రిట్రైవ్ చేస్తున్నామని చెప్పారు.
ఆ తర్వాత వారంలో ఏకంగా డీజీపీ శివధర్‌రెడ్డి సర్వర్లనే రిట్రైవ్ చేస్తున్నామని చెప్పారు. ఎవరూ దీనిపై ఓ స్పష్టత ఇచ్చేలా మాట్లాడకపోవడం, ఆ ప్రమాదం ముమ్మాటికీ కుట్ర కోణంలోనే జరిగిందని ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కాగా, 1,100 కేసు ల ఆధారాలే ధ్వంసమయ్యాయా? లేక అంతకు మించే లెక్క ఉండొచ్చా? అన్న విషయంలోనూ స్పష్టత ఇవ్వడం లేదు. మొత్తానికి ప్రమాదం ‘గండికోట రహస్యం’గానే మిగిలిపోయింది.