రాష్ట్రంలోని కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు అయిపోయినట్టు బోర్డులు పెడుతున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు… తమకు ఏ నిబంధనలు వర్తించవని, తమ నిబంధనలు తమవే అన్నట్టుగా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం తమకేం పట్టదన్నట్టుగా చోద్యం చూస్తున్నది. కొన్ని పాఠశాలల్లోనైతే ఒకేసారి మొత్తం ఫీజు కట్టాలనే నిబంధనలను అమలుచేస్తున్నారు. లేకుంటే అడ్మిషన్ ఇవ్వలేమంటూ విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణ చేస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కొలువుదీరాక మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు మండల స్థాయి వరకు విస్తరించి ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తుంటే, ప్రభుత్వాధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.
పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఈ కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే యూనిఫామ్స్, బుక్స్, నోట్ పుస్తకాల పేరిట ఇష్టం వచ్చినట్టు బిల్లులు వేస్తున్నారు. ఇవి తమ వద్దే కొనాలని, లేకుంటే విద్యార్థులను లోపలికి రానీయమంటూ హుకుం జారీ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలావరకు కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలను వాడటం లేదు. ఆయా స్కూళ్లు రూపొందించిన పాఠ్యపుస్తకాల ద్వారానే విద్యార్థులకు బోధన చేస్తున్నారు. వాటిని తమ పాఠశాలల్లోనే కొనాలని చెప్పి ఫీజులకు, పుస్తకాలకు మెలిక పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి. ఫీజు నియంత్రణ చట్టం తీసుకువచ్చి విద్యార్థులకు ఉపశమనం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
– సొప్పరి నరేందర్ ముదిరాజ్
హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థి