తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతన్న గుండె నిండా ధైర్యంతో జీవించాడు. పంట పండించటమే కాదు, అమ్ముకునే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు అండగా నిలిచింది. రైతు చెమటకు పౌరసరఫరాలశాఖ విలువ తీసుకొచ్చింది. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో ఆ రైతన్నే తన ధాన్యం అమ్ముకోవటానికి క్యూల్లో నిలబడి కన్నీళ్లు పెట్టుకునే దుస్థితి దాపురించింది. ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు భరోసా లేకుండా పోయింది. అందుకే గ్రామాల్లో ఓ మాట వినిపిస్తున్నది.. ‘కేసీఆర్ ఉన్న రోజుల్లో రైతు రాజులా బతికాడు, ఇప్పుడు బాధతో బతుకుతున్నాడు.’ అని
కేసీఆర్ నాయకత్వంలో పౌరసరఫరాలశాఖను రైతులు, పేదలకు అండగా నిలబెట్టారు. రేషన్ బియ్యం పంపిణీ నుంచి రైతుల ధాన్యం కొనుగోలు వరకు వ్యవస్థను బలోపేతం చేసి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలందరికీ తెలిసిందే. కండ్లముందే నదులు ప్రవహించినా సాగునీరు లేక, పంటలు పండించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్టులు వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలతో దేశానికి అన్నం పెట్ట్టే స్థాయికి రైతన్నలు ఎదిగారు. వలసలు పోయినవారు వెనక్కి వచ్చి వ్యవసాయం చేసుకున్నారు. కేసీఆర్ ఎంతో దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం భారీ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ ప్రాజెక్టు తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసి, రైతు జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. నీటి విప్లవానికి కాళేశ్వరం చిరునామాగా నిలిచింది.
దుక్కి దున్నింది మొదలు, పంట కొనుగోలు వరకు రైతుకు అండగా నిలబడి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది కేసీఆర్ సర్కార్. రైతన్న కష్టాన్ని ముందే అర్థం చేసుకున్నది. ఎరువులు, రైతుబంధు కోసం రైతు ఎదురుచూసే పరిస్థితి ఏనాడూ రాలేదు. పంట వేసే ముందు వనరులు ఇంటి ముంగిటికే చేరాయి. కానీ ప్రస్తుత పాలకుల ఏలుబడిలో రైతు ఎదురుచూపుల్లోనే మగ్గిపోతున్నాడు.
బీఆర్ఎస్ హయాంలో రైతులు, అధికారులు చర్చించుకోవటానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.572.22 కోట్లు ఖర్చు చేసి 2,601 రైతు వేదికలను నిర్మించారు. వ్యవసాయశాఖలో ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని ప్రభుత్వం నియమించింది. రైతులకు వ్యవసాయ సంబంధిత సేవలు అందించింది. వ్యవసాయ సీజన్ మొదలవుతుందంటే రైతులు పంట వేసే కంటే ముందే యూరియా, ఎరువులు అందుబాటులో ఉంచేవారు. ఇప్పుడు పంట చేతికొచ్చే టైమ్‌కు కూడా యూరియా ఇవ్వటం లేదు. రైతులను యాప్‌ల పేరిట షాపుల చుట్టూ తిప్పుతున్నారు.
కేసీఆర్ హయాంలో 2014 నుంచి 2022-23 వానాకాలం వరకు రూ.1.21 లక్షల కోట్ల విలువైన 6.71 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి పౌరసరఫరాలశాఖ ద్వారా కొనుగోలు చేశారు. ఒకే ఏడాదిలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. పంజాబ్ రాష్ర్టాన్ని తలదన్నేలాగా మొదటిస్థానానికి చేరువయింది. ధాన్యం దిగుబడితో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. తొమ్మిదిన్నరేండ్లలో 1,553 రైస్‌మిల్లులు కొత్తగా ఏర్పాటయ్యాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 35 లక్షల ఎకరాల్లో వరి సాగైతే 2022-23 నాటికి కోటి 21 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే 2021-22 నాటికి కోటి 41 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నది.
కరోనా కాలంలోనూ రైతన్నకు అన్యాయం జరగకూడదని భావించి కేసీఆర్ 10 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత రావటంతో బిహార్ నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా కూలీలను తీసుకువచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం రికార్డు స్థాయిలో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. 2014-15లో 3,328 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంటే, 2022-23 నాటికి 14 వేలకు చేరుకున్నాయి. కేసీఆర్ ఆన్లైన్ చెల్లింపులను ప్రారంభించి, దళారులు లేని మార్కెట్‌ను సృష్టించారు.
2023 వానాకాలంలో 65.95 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైతే, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెప్తున్న లెక్కలు 66.80 లక్షల ఎకరాలు మాత్రమే. ధాన్యం కొనుగోలు విషయానికొస్తే.. 2021-22 వానాకాలంలో 70.21 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కాంగ్రెస్ సర్కార్ 71.86 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. అంటే లక్షన్నర మెట్రిక్ టన్నులు మాత్రమే ఎక్కువ కొనుగోలు చేసి, జబ్బలు చరుచుకుంటున్నది.
ఎన్నికల ప్రచారంలో రైతులకు రెండు పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక రబీ పంటకు బోనస్ ఇవ్వకుండా మోసం చేశారు. వానాకాలానికి సంబంధించి దాదాపు రూ.30 కోట్లకు పైగా బాకీ పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..బీఆర్ఎస్ హయాంలో పౌరసరఫరాల శాఖ తొమ్మిదిన్నరేండ్లలో రూ.30 వేల కోట్లు అప్పులు చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలోనే రూ.30 వేల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఈ రబీ సీజన్‌కు తీసుకున్న అప్పులను కలుపుకుంటే వంద కోట్లకు చేరువవుతుంది.
పాలనలో వైఫల్యం, అవినీతి, అక్రమాలతో పారసరఫరాల శాఖను కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టింది. కొనుగోళ్లు, అప్పులు పరిస్థితి ఇలా ఉంటే..పాలకుల అవినీతి, అక్రమాలకు హద్దు లేకుండా పోయింది. పాలకుల అవినీతికి పౌరసరఫరాల కార్పొరేషన్ పుట్టిమునగడం ఖాయం.
కాంగ్రెస్ పాలకులు ధాన్యం కొనుగోలుకు జాతీయ బ్యాంకులు అప్పులు ఇవ్వలేని పరిస్థితికి పౌరసరఫరాల సంస్థను తీసుకువచ్చారు. జాతీయ బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవటంతో ఎక్కువ వడ్డీకి ఎన్సీడీఈఎక్స్ నుంచి అప్పులు తీసుకుంటున్నారు. వాస్తవానికి జాతీయ బ్యాంకుల కంటే ఎన్సీడీఈఎక్స్ వడ్డీ రేటు 1.5 శాతం అధికంగా ఉంటుంది.
2022-23 యాసంగి ధాన్యం టెండర్లలో భారీ అవినీతి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సుమారు రూ.5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు వేల కోట్ల విలువ చేసే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలంలో విక్రయించేందుకు టెండర్లు వేసింది. 23-5-2024 (90 రోజుల్లో) ధాన్యం లిఫ్ట్ చేసి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాలని 23-3-2024న ఉత్తర్వులు జారీచేసింది. 23-9-2024 వరకు రెండు నెలల గడువు పెంచుతూ 23-7-2024న మరో ఆర్డర్ ఇచ్చింది. 31-12-2024 వరకు మరోసారి గడువు పెంచింది. ఆ తర్వాత మరో మూడు నెలలు పెంచింది. టెండర్ ప్రకారం మూడు నెలల్లో ధాన్యం లిఫ్ట్ చేసి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాలి. కానీ కాంట్రాక్టర్లు ధాన్యం లిఫ్ట్ చేయలేదు. రైస్‌మిల్లర్లు ధాన్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా…‘ధాన్యం వద్దు, డబ్బులు కట్టండి’ అని చెప్పటం ఏ విధానం? ఇది కమీషన్ రాజకీయం కాదా? రెండున్నరేండ్లు గడచినా ఇంకా 25 శాతం ధాన్యం మిల్లర్ల దగ్గరే ఉన్నది. ఈ ధాన్యం విలువ దాదాపు రూ.2 వేల కోట్ల నుంచి రూ.2,500 కోట్ల వరకు ఉంటుంది. ఇందుకు కాంగ్రెస్ పాలకులు ఈయేడు దాదాపు రూ.2 వేల కోట్లకు పైబడి వడ్డీ కట్టారు.
టెండర్ ధర క్వింటాలుకు రూ.2,007 అయితే రూ.200 నుంచి రూ.300 అదనంగా ఎందుకు చెల్లించాలని మిల్లర్లను కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు? దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉండటంతోనే ఇంతగా బరి తెగించారనే ప్రచారం జరుగుతున్నది. అదనంగా డబ్బులు ఇవ్వాలని, బియ్యం బదులు నగదు చెల్లించాలని డిమాండ్ చేయటం వల్లే ధాన్యం డబ్బులు రాలేదు. గడువులోగా ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకుండా గడువులు పెంచుకుంటూ పోయారు. చాలా తెలివిగా వ్యవహరించి లిప్టు చేసిన ధాన్యాన్ని పక్కనపెట్టి ఉన్న ధాన్యానికి దొంగలెక్కలు చూపించి కాంట్రాక్టర్ల నుంచి కేవలం రూ.67 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. దాదాపు రూ.1,200 కోట్ల విలువ చేసే ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమయ్యాయి. అధికారులకు తెలియకుండానే ఇది జరిగిందా? రెండున్నరేండ్ల నుంచి వసూలు చేయకుండా వారు ఏంచేస్తున్నారు?
గడిచిన రెండున్నరేండ్లలో పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలు.. ముఖ్యంగా ధాన్యం టెండర్లు, గోనెసంచుల (పాతవి) కొనుగోలు, కంప్యూటర్లు, ఫర్నిచర్, ఇతర సామగ్రి, దుబారా వ్యయంపై న్యాయవిచారణ జరిపిస్తే భయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తాయి. ఏడాది క్రితం సన్నబియ్యం పంపిణీ సమయంలో హైదరాబాద్ జిల్లాలో లక్షా 40 వేల టన్నుల దొడ్డు బియ్యం మిగిలిపోయాయి. ఆ బియ్యాన్ని కూడా పాలకులు విక్రయించలేకపోయారు. టెండర్ పిలిచినా ఎవరూ రావటం లేదనే నెపంతో ఎవరో ఒకరికి తక్కువ ధరకు అప్పగించాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రేషన్ బియ్యంలో అక్రమాలకు స్వస్తి చెప్పి, అర్హులకు అందేలా తొమ్మిదేండ్ల కాలంలో ప్రజా పంపిణీలో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టాం. ఇవి దేశానికి ఆదర్శంగా నిలిచాయి.
కేసీఆర్ సూచన మేరకు అప్పటి సివిల్ సప్లయ్ కమిషనర్, ప్రస్తుత డీజీపీ సీవీ ఆనంద్ 2017 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రజలు ఎక్కడి నుంచైనా, ఏ రేషన్ షాపు నుంచైనా రేషన్ తీసుకునే రేషన్ పోర్టబులిటీ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ విధానాన్ని 12 కోట్ల మంది వినియోగదారులు ఉపయోగించుకొని రేషన్ తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించి నేషనల్ పోర్టబులిటీ విధానాన్ని తీసుకువచ్చిందంటే ఈ ఘనత కేసీఆర్‌దే.
కేసీఆర్ హయాంలో సరుకుల రవాణా నుంచి పంపిణీ వరకు అన్ని లావాదేవీలు కంప్యూటరీకరణ చేశారు. రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ ఎలక్ట్రానిక్ తూకాల వినియోగం, సరుకుల రవాణా వాహనాలకు జీపీఎస్ సౌకర్యం, గోదాముల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ సెంటర్. ఫిర్యాదుల స్వీకరణ కోసం 1967/1800-425-00333, రేషన్ పోర్టబులిటీ, ధాన్యం సేకరణ, ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజిమెంట్ సిస్టమ్, పేదలందరికీ ఆహారభద్రత కల్పించాలన్న సంకల్పంతో రేషన్ కార్డుల జారీకి ఆదాయ పరిమితిని పెంచారు.
ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు అర్హతకు ఆదాయ పరిమితి ఏడాదికి గ్రామీణ ప్రాంతంలో రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలు, భూమి పరిమితి 2.5 ఎకరాలు (తడి), 5 ఎకరాలు (పొడి) ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం మరింతమంది పేదలకు ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.00 లక్షలు, 3.5 ఎకరాల (తడి), 7.5 ఎకరాలు (పొడి) పెంచింది. కొత్తగా 6.71 లక్షల మందికి రేషన్ కార్డులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం మొత్తం 9,53,395 దరఖాస్తులు రాగా, అర్హులైన 6,71,012 మందికి రేషన్ కార్డులు జారీ చేసింది. 2,69,995 దరఖాస్తులను తిరస్కరించింది. కాంగ్రెస్ సర్కార్ కొత్తగా ఏ కార్యక్రమాలు..సంస్కరణలు తీసుకురాకపోయినా పర్వాలేదు కానీ, బీ ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంస్కరణలు చక్కగా అమలు చేస్తే పేదలకు అన్నం పెట్టే పౌరసరఫరాల శాఖకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే రైతులు, పేదల పరిస్థితితోపాటు చివరకు పౌరసరఫరాల సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి ఈ సంస్థ చేరటం ఖాయం.
– (వ్యాసకర్త: తెలంగాణ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్)
మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి