75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో కులానికి ఎనలేని పాత్ర ఉన్నది. జాతీయ, ప్రాంతీయ పార్టీలు కులాలను బట్టి తమ విధి విధానాలను, పార్టీ ఎజెండాలను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలోనే, తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇక, తప్పని పరిస్థితుల్లో కులగణన చేపట్టిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక పార్టీలు, కులమతాలకు అతీతంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ లెక్కలు అందరినీ విస్తుపోయేలా చేశాయి.
Caste Census | నాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా 63,60,158 (18 శాతం) ఉండగా, ఎస్టీ జనాభా 36, 02,288 (10శాతం) ఉన్నది. బీసీ జనాభా 1,85,61,856 (51శాతం) కాగా, ముస్లిం జనాభా 46,25,062 (13శాతం) ఉన్నది. అగ్రకులాల జనాభా 31,29,160 (8శాతం) ఉండగా, హిందూ బీసీ 51 శాతం, ముస్లిం బీసీ 10 శాతం, ఓసీ హిం దువులు 8 శాతం, ఓసీ ముస్లింలు 3 శాతం ఉన్నారు. కానీ, తాజాగా కాంగ్రెస్ ప్రభు త్వం చేపట్టిన కులగణన వివరాలను పరిశీలిస్తే బీసీ జనాభా 1,64,09,179 (46.25 శాతం), ఎస్సీ జనాభా 61,84,318 (17.43 శాతం), ఎస్టీ జనాభా 37,05, 928 (10.45 శాతం), ఓసీ జనాభా 47,21,115 (13.31 శాతం), ముస్లిం బీసీలు 35,76,588 (10.08 శాతం), ముస్లిం ఓసీలు 8,80,424 (2.48 శాతం) తో మొత్తంగా ఓసీ జనాభా 56,01,539 (15.79 శాతం) ఉన్నది. అంటే గత పదేండ్లలో రాష్ట్రంలో ఓసీల జనాభా పెరిగింది కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా తగ్గింది. దీంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు, దళిత, బహుజన మేధావులు, విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాం లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 8 శాతం అగ్రకులాలు ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో అగ్రకుల జనాభా దాదాపుగా రెట్టింపు కావడం నమ్మశక్యంగా లేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అగ్రకుల జనాభా శాతాన్ని పెంచి, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభాను తగ్గించినట్టు అనిపిస్తున్నది. ఈ లెక్కల కారణంగా సమాజంలో ఎక్కువగా ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉన్నది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ తెలంగాణలో 90 శాతం బీసీ ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని చెప్పారు. కానీ, కులగణన సర్వేలో మాత్రం 75 శాతం వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీలను చూపించారు. అంటే 15 శాతం అణగారిన వర్గాలను బలి చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. వారి జనాభాను ఎక్కువ చేసి చూపిస్తే వారికి సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్ కల్పించాల్సి వస్తుంది. ఇది గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ మనుగడ కోసం, ఆధిపత్యం చెలాయించడం కోసం వారి జనాభాను పెంచుకుని బీసీ, ఎస్సీ, ఎస్టీల శాతాన్ని తగ్గించినట్టు అర్థం చేసుకోవచ్చు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం
తీసుకొచ్చిన ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, జనరల్ విభాగంలో అగ్రకుల అభ్యర్థులే విద్య, ఉద్యోగ రంగల్లో లాభం పొందుతున్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్లను తెలంగాణ అగ్రకులాలు కాపాడుకోవడానికి కులగణన సర్వేలో అగ్రకులాల జనాభాను లేనిది ఉన్నట్టుగా ఎక్కువ శాతం చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
దేశ జనాభాలో దాదాపు 60 శాతం వర కు ఉన్న బీసీలకు పార్లమెంటులో తగిన స్థానం లేకపోవడం ప్రజాస్వామ్య, గణతం త్ర, సహజ మానవ హక్కులకు విరుద్ధమైన అంశం. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ మేధావు లు, విద్యావంతులు అంతిమంగా గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, రాజ్యాధికారం లో ఏ కులాలు ఉంటే ఆయా కులాలకు అనుకూలంగా విధానాలు ఉంటాయి. కాబ ట్టి అణగారిన వర్గాలు రాజ్యాధికారానికి వచ్చినప్పుడే సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరివర్తన సాధ్యమవుతుందనే చారిత్రక సత్యాన్ని గ్రహించాలి.
-పుల్లెంల గణేష్
95530 41549