‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. కేరళ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ నేతల పీకలమీదికి వచ్చిందట. ఆ రాష్ట్ర ఎన్నికల ఖర్చు కింద రూ.వెయ్యి కోట్లు సర్దే బాధ్యతను తెలంగాణ ముఖ్యనేత నెత్తికెత్తుకున్నారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. తన మార్గదర్శిని సీఎం అభ్యర్థిగా ఎంపికచేసినందుకు కృతజ్ఞతగా తాను రూ.500 కోట్లు పంపిస్తానని, ఇంకో రూ.500 కోట్లు మంత్రివర్గం నుంచి ముక్కుపిండి వసూలు చేయిస్తానని ముఖ్యనేత ఒప్పుకున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అంతేకాదు.. తన రెండో గురువు తరఫున ప్రచారం చేయడానికి ఇప్పటికే తన సొంత చానల్‌గా పేరున్న ఓ ‘పెద్ద’ తెలుగు టీవీ చానల్‌ను కేరళలో లాంచ్ చేయించినట్టు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. ఆధిష్ఠానం ఈ నెల 19న మంత్రి వర్గాన్ని గంపగుత్తగా ఢిల్లీకి పిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘కేరళ’ ఎన్నికల పన్ను వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘గాంధీ కుటుంబానికి ఆర్థిక అవసరాలు ఉన్నాయంటే తలా ఒక చెయ్యేసి తెలంగాణ నుంచి రూ.వెయ్యి కోట్లు పోగేసి ఇవ్వగల శక్తి కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నది’ అంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అర్థం ఇదేనా? అంటూ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఏప్రిల్ నెలలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. ఓటరు లిస్టును ప్రకటించింది. ఐఏసీసీలో ప్రధాన పోస్టులో ఉన్న నేతనే సీఎం అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో గురువును గెలుపించుకునే బాధ్యతను తెలంగాణ ముఖ్యనేత భుజాల మీద వేసుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి.
చంద్రబాబు శిష్యరికం వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ముఖ్యనేతకు ఏఐసీసీ ప్రధాన నేత రెండో గురువుగా, మార్గదర్శిగా కొనసాగుతున్నారన్నది బహిరంగ రహస్యం. బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ అధినేత్రిని బలి దేవతగా పోల్చి, తెలంగాణలో వెయ్యి మందిని బలి తీసుకున్నదని ఆరోపించిన కొద్దిరోజులకే ముఖ్యనేత మూడు రంగుల కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఏఐసీసీలో ప్రధాన పదవిలో ఉన్న కేరళ నేత ఆయనకు అక్కున చేర్చుకొన్నారు. గాంధీ కుటుంబాన్నే నమ్ముకొని ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కకు తోసి.. నాడు పార్టీలో ప్రధాన పదవి ఇప్పించడం, నేడు ప్రభుత్వంలో ప్రధాన పదవి దక్కేలా చేయడం వరకు ఆయన అండదండగా ఉన్నారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
బడేభాయ్ వివాదం, తెలంగాణలో బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు రాహుల్‌గాంధీ ముఖ్యనేతను దూరం పెట్టారని, ఆ సమయంలో కుర్చీ నుంచి దించేస్తారన్న ప్రచారం జరిగినప్పుడుకూడా కేరళ నేతే ఆయనను కాపాడారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేరళ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో తనను ఆదరించిన గురువుకు దక్షిణ చెల్లించుకునేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యనేత భావించారని సమచారం.
అందుకే తెలంగాణ కాంగ్రెస్ వర్గాలను ఏకం చేస్తున్నారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నోటిఫికేషన్ వెలువడే నాటి నుంచి ఫలితాలు వచ్చే వరకు ఖర్చంతా తెలంగాణ నుంచే ఇస్తామని ఢిల్లీ నేతలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. దాదాపు రూ.వెయ్యి కోట్లు అవసరమని చెప్పగా, ఇందులో సగం అంటే దాదాపు రూ.500 కోట్లు తాను, నెంబర్ 2 మంత్రి కలిసి సమకూర్చుతామని చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో 50 శాతం నిధులు మంత్రివర్గానికి అప్పగించాలని ముఖ్యనేత సూచించినట్టు తెలిసింది.
వారు దిగువశ్రేణి నాయకత్వంతో సమన్వయం చేసుకొని సమకూర్చుతారని చెప్పినట్టు చర్చ జరుగుతున్నది. కర్ణాటక నుంచి కూడా కొంత నిధులు తేవాలని మరో ప్రముఖ నేత సూచించగా, ఆ డబ్బు అధిష్ఠానం ఖర్చుల కోసం వాడుకోవాలని, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు మొత్తం తెలంగాణే చూసుకుంటుందని ముఖ్యనేత మరోసారి స్పష్టంచేసినట్టు తెలిసింది. దీనికితోడు అక్కడ తన మార్గదర్శికి ప్రచారం కోసమే తెలంగాణలో ముఖ్యనేత పెట్టుబడులతో నడుస్తున్నదని గుర్తింపు ఉన్న ఒక తెలుగు ఛానల్‌ను మలయాళంలోనూ లాంచ్ చేసినట్టు చెప్తున్నారు.
ముఖ్యనేత సూచన మేరకు పెద్దలు 19న మంత్రి వర్గాన్ని ఢిల్లీకి పిలిచి టా ర్గెట్ పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసిం ది. వారి పదవులకు, శాఖలకు భరోసా కల్పిస్తూ సగటున ఒక్కొక్కరికి రూ.35 కోట్ల టార్గెట్ పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన డీసీసీల సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. అధినే తే ఎదురుగా కూర్చొని టార్గెట్ నిర్దేశిస్తున్న నేపథ్యంలో మంత్రులు మౌనం గా అంగీకరించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆర్థికంగా బలంగా ఉన్న న లుగురు మంత్రులు రూ.100 కోట్ల వర కు వీలైనంత సర్దితే, ఎస్సీ, ఎస్టీ మంత్రు ల టార్గెట్‌లో కొంత మినహాయింపు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ‘ఏమైనా ఇబ్బందులున్నాయా?’ అని అగ్రనేత అడుగగా, ‘తెలంగాణ వెరీ పొ టెన్షియల్ స్టేట్’ అంటూ ఏఐసీసీ ప్రధా న నేత ఒకరు ఊరడించినట్టు తెలిసింది. ఈ నిధుల సమకూర్పులో భాగంగానే శనివారం డీసీసీ అధ్యక్షుల సమావేశం నిర్వహించినట్టు సమాచారం. ఢిల్లీకి అ వసరమైన డబ్బు పంపేందుకు సమాయత్తమై ఉండాలంటూ డీసీసీ అధ్యక్షులను మానసికంగా సిద్ధం చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది. నిధుల సమీకరణ బాధ్యతలను ఇన్చార్జ్ మంత్రులకు ఇచ్చే ఆలోచనతో ఉన్నట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.